Begin typing your search above and press return to search.

స్టాలిన్ పై దాడి.. బయటకు షాకింగ్ నిజాలు..

By:  Tupaki Desk   |   20 Feb 2017 4:17 AM GMT
స్టాలిన్ పై దాడి.. బయటకు షాకింగ్ నిజాలు..
X
తమిళనాడు అసెంబ్లీలో జరిగిన బలపరీక్ష ఎపిసోడ్ లో డీఎంకే సభ్యుల ఆరాచకం బయట ప్రపంచానికి తెలిసినంత బాగా.. చాలా విషయాలు తెలీని పరిస్థితి. బల నిరూపణ పరీక్షను లైవ్ టెలికాస్ట్ చేయటం లేదంటూ చెప్పినప్పటికీ.. కాసేపటికే కొన్ని దృశ్యాలు బయటకు రావటం.. డీఎంకే ఇమేజ్ ను దారుణంగా దెబ్బ తీసే క్లిప్పింగులు టీవీ స్క్రీన్ల మీద కనిపించాయి.

ఇదిలా ఉంటే.. డీఎంకే నేత స్టాలిన్ చొక్కా చినిగిన ఉదంతం చాలా తక్కువగా ఫోకస్ అయిన పరిస్థితి. విపక్ష నేత చొక్కా చినగటం.. తనపై దాడికి పాల్పడ్డారంటూ ఆయన చేసిన వాదన.. డీఎంకే సభ్యులు చేసిన పనుల తీవ్రత ముందు తేలిపోయాయి. అయితే.. తన మీద దాడి జరిగిందంటూ స్టాలిన్ గవర్నర్ కు ఫిర్యాదు చేయటం.. ఆయనీ అంశంపై విచారణకు ఆదేశించిన నేపథ్యంలో.. షాకింగ్ నిజాలు బయటకు వచ్చాయి.

సభలో స్టాలిన్ మీద దాడి జరిగిన మాట వాస్తవమే అన్నట్లుగా ఆధారాలు దొరకటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. స్టాలిన్ మీద పళని స్వామి ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా దాడి చేసిందా? అన్న అనుమానం కలిగేలా పరిణామాలు చోటు చేసుకోవటం ఇప్పుడు సంచలనంగా మారింది. మార్షల్స్ ముసుగులో తొమ్మిదిమంది ఐపీఎస్ అధికారులు సభ నిబంధనల్ని ఉల్లంఘించి అసెంబ్లీలోకి అడుగు పెట్టటమే కాదు.. స్టాలిన్ మీద దాడి చేసినట్లుగా తెలుస్తోంది. స్పీకర్ అనుమతి లేకుండా తొమ్మిది మంది ఐపీఎస్ లు సభలోకి ఎలా అడుగు పెట్టారన్నది ఇప్పుడు అంతు చిక్కని ప్రశ్నగా మారింది.

మరో కీలకమైన అంశం ఏమిటంటే.. రూల్స్ కి భిన్నంగా సభలోకి అడుగు పెట్టిన తొమ్మిది మంది ఐపీఎస్ లు.. జల్లికట్టు ఉద్యమ సమయంలో చోటు చేసుకున్న అల్లర్ల పైనా వీరిపై ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఐపీఎస్ అధికారులు సభలోకి ఎందుకు వచ్చారు? అన్నది ప్రశ్నగా మారింది. దీనికి అసెంబ్లీ కార్యదర్శి ఇస్తున్న వివరణ ఏ మాత్రం సంతృప్తికరంగా లేకపోవవటం విశేషం.

సభలో జరుగుతున్న గందరగోళం మేరకు ఆగమేఘాల మీద ఐపీఎస్ లను రంగంలోకి దించినట్లుగా చెబుతున్నారు. ఒకవేళ అది నిజమేనని అనుకుంటే.. వారికి మార్షల్స్ యూనిఫారాలు ఎక్కడి నుంచి వచ్చాయి? అన్నది పెద్ద ప్రశ్న. మరో కీలకమైన సందేహం ఏమిటంటే.. స్పీకర్ సభలో లేని సమయంలో మార్షల్స్ ముసుగులో ఈ అధికారులు ఎందుకు ప్రవేశించారన్నది కూడా ఇప్పుడు చర్చగా మారింది. తాజాగా వెలుగు చూసిన విషయాలు.. అంతిమంగా తొమ్మిది మంది ఐపీఎస్ ల మెడకు చుట్టుకునేలా ఉందన్న వాదన వినిపిస్తోంది.

ఈ ఎపిసోడ్ ను చూస్తే.. పథకం ప్రకారం స్టాలిన్ మీద దాడి జరిగిందన్న వాదనకు బలం చేకూరేలా ఉండటం గమనార్హం. విపక్ష నేత మీద సభలోనే దాడి చేసినా.. ఆ విషయం ప్రజల్లోకి వెళ్లకుండా చేయటంలో వ్యూహాత్మకంగా వ్యవహరించిన వైనం చూసినప్పుడు.. ఇంత పక్కా ప్లానింగ్ ఎవరిదన్నది ఇప్పుడు సందేహం మారింది. ఈ ఉదంతంపై గవర్నర్ దృష్టి పెట్టిన నేపథ్యంలో రానున్న రోజుల్లో ఈ అంశంపై మరింత సమాచారం బయటకు వచ్చే అవకాశం ఉందని చెప్పొచ్చు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/