Begin typing your search above and press return to search.

ఈ షేరు గురించి తెలిస్తే.. స్టాక్ మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వాలనిపిస్తుంది

By:  Tupaki Desk   |   19 Dec 2021 4:19 AM GMT
ఈ షేరు గురించి తెలిస్తే.. స్టాక్ మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వాలనిపిస్తుంది
X
ఈ కథనం చదవటానికి ముందు నిజాయితీగా మీకో హెచ్చరిక చేయకుండా ఉండలేం. అలా చేయకుండా ఈ కథనాన్ని మీ చేత చదివితే.. మేం చాలా తప్పు చేసిన వాళ్లమవుతాం. మిమ్మల్ని తప్పుడు దారిలో నడిపించినట్లే. ఈ కథనం ఒక షేరు గురించి. మూడేళ్ల క్రితం ఈ షేరు ధరకు.. ఇప్పటికి పోలిక ఉండకపోవటమే కాదు.. కేవలం మూడేళ్ల వ్యవధిలో సదరు షేరు చేరుకున్న స్థాయి గురించి తెలిసిన తర్వాత.. స్టాక్ మార్కెట్ గురించి ఆలోచించకుండా ఉండలేరు. అయితే.. ఊరించే కథనాలు.. విజయవంతమైన ఉదంతాల్ని విన్నంతనే.. వాటి గురించి ఆలోచిస్తాం. ఆ మాటకు వస్తే.. ఆకర్షితులం అవుతాం కూడా. అలా ఆకర్షితులం కావటం రిస్కుతో కూడున్నది.

అందుకే.. షేర్ మార్కెట్లో కొత్తగా ఎంట్రీ ఇవ్వాలనుకున్న వారు.. డబ్బుల్ని మదుపు చేయటానికి ముందు.. దాని గురించి పక్కాగా అధ్యయనం చేసి.. తమ ఎంపిక విషయంలో ఉన్న లోపాల గురించి బాగా అర్థం చేసుకున్న తర్వాతే పెట్టుబడులు పెట్టాలి. స్టాక్ మార్కెట్ లో ఏదైనా కంపెనీ షేర్ ను కొనటానికి ముందు.. దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని శాస్త్రీయంగా శోధించాల్సిందే. అంతే తప్పించి.. ఎవరో ఏదో చెప్పారని స్టాక్ లో పెట్టుబడి పెడితే.. మీరు కష్టపడిన సొమ్మంతా హారతి కర్పూరం అవుతుంది. ఇక.. మేం చెప్పాలని అనుకున్నదేమంటే.. మూడేళ్ల క్రితం ఒక కంపెనీ షేరు ఒక్కొక్కటి రూ.2 ఉండేది. అదికాస్తా ఈ రోజున ఏకంగా రూ.195 స్థాయికి చేరుకుంది. అంటే.. మూడేళ్ల క్రితం సదరు షేరు మీద లక్ష రూపాయిల్ని పెట్టుబడిగా పెడితే.. ఇవాల్టి రోజున రూ.90 లక్షలు అయ్యేదన్న మాట.

ఇంతకీ ఆ షేరు ఏమిటంటారా? అక్కడికే వస్తున్నాం. ఆ కంపెనీ పేరు బ్రైట్ కాం. డిజిటల్ మార్కెటింగ్ సేవల్ని అందించే ఈ కంపెనీ మూడేళ్ల వ్యవధిలో ఊహించనంత భారీగా పెరిగిపోయింది. మూడేళ్ల క్రితం ఈ కంపెనీ షేరు ఒక్కొక్కటి రూ.2.14 చొప్పున ఉండేది. అది కాస్తా ఇప్పుడు రూ.195కు చేరుకుంది. అంటే.. మూడేళ్ల వ్యవధిలో తొమ్మిది వేల శాతం పెరిగిందన్న మాట. హైదరాబాద్ కు చెందిన ఈ కంపెనీకి ఫస్ట్ గ్లోబల్ వైస్ ఛైర్మన్ కం ఎండీగా వ్యవహరించే శంకర్ శర్మ ఈ కంపెనీ షేర్లు కొనటం మొదలు పెట్టిన తర్వాత నుంచి ఇది పరుగులు తీస్తోంది. అలా అని.. ఈ షేరును కొనుగోలు చేయమని కూడా మేం చెప్పట్లేదు.

డబ్బును దేనిలో పెట్టుబడిగా పెట్టాలని భావించే వారికి.. స్టాక్ మార్కెట్ కూడా ఒక మార్గం. కాకుంటే.. దాని గురించి పూర్తిస్థాయిలో అథ్యయనం చేయటం.. మార్కెట్ సెంటిమెంట్ మీద అవగాహన పెంచుకున్న తర్వాత డబ్బులు మదుపు చేయాలి. ఏ మాత్రం తేడా కొట్టినా.. మొదటికే మోసం వస్తుందన్న చేదు నిజాన్ని మర్చిపోకూడదు.