Begin typing your search above and press return to search.

షాకింగ్ నిజాలు చెప్పిన ‘తెలంగాణ రాష్ట్ర ముఖచిత్రం’

By:  Tupaki Desk   |   21 Nov 2021 10:32 AM GMT
షాకింగ్ నిజాలు చెప్పిన ‘తెలంగాణ రాష్ట్ర ముఖచిత్రం’
X
తెలంగాణ రాష్ట్ర ప్రస్తుత పరిస్థితికి నిలువెత్తు రూపంలా ఉండే నివేదికను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసింది. ‘తెలంగాణ రాష్ట్ర ముఖచిత్రం’ (స్టేట్ ఎట్ ఏ గ్లాన్స్ 2021) పేరుతో విడుదలైన ఈ నివేదికలో రాష్ట్ర తాజా పరిస్థితిని వెల్లడించారు.

ఈ నివేదికలో షాకిచ్చే అంశం ఏమంటే.. రాష్ట్ర ఏర్పాటు అనంతరం గడిచిన ఏడేళ్లలో ఎప్పుడూ లేని రీతిలో రాష్ట్ర జాతీయోత్పత్తి వృద్ధి రేటు గణనీయంగా తగ్గింది. ఏడేళ్లుగా 11 - 14.7 మధ్యన నమోదయ్యే దానికి భిన్నంగా ఈసారి 11.3 శాతానికి పడిపోయింది. ఏడేళ్లలో నమోదైన కనిష్ఠం ఇదేనని చెబుతున్నారు.

తాజా గణాంకాల నివేదికను రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్.. ఆర్థిక ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామక్రిష్ణారావులు విడుదల చేశారు. ఇందులో పేర్కొన్న కీలక అంశాల్లో ముఖ్యమైనది రాష్ట్ర జాతీయోత్పత్తి వృద్ధిరేటు. గతంతో పోలిస్తే.. 2.4 శాతం తక్కువగా నమోదైంది. ఇక.. రాష్ట్ర జనాభా ఎంతన్న విషయం మొదలు ముఖ్యమైన సమాచారాన్ని చూస్తే..వివరాలు ఇలా ఉన్నాయి.

- తెలంగాణ రాష్ట్ర ప్రస్తుత జనాభా 3.77 కోట్లు
- పురుషులు 1,89,78,00.. మహిళలు 1,87,47,000
- తెలంగాణలో మొత్తం కుటుంబాలు 83.04 లక్షలు
- జనాభాలో 20 - 29 ఏళ్ల మధ్య ఉన్న వారు 68.10 లక్షలు
- జనాభాలో 70 ఏళ్లు దాటిన వారు 18.65 లక్షలు
- ప్రతి వెయ్యి మంది బాలలకు బాలికల సంఖ్య 988
- జాతీయ నిష్పత్తి 943 ఉంటే.. తెలంగాణ రాష్ట్రం దాని కంటే మెరుగ్గా ఉంది
- తెలంగాణ తలసరి ఆదాయం రూ.2,37,632. 2019-20లో ఇది రూ.3,33,325గా ఉండేది.
- రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి విలువ రూ.9.80 లక్షల కోట్లు
- రాష్ట్ర సరాసరి అక్షరాస్యత 59.90 శాతం. మహిళల్లో అక్షరాస్యలు 49.90 శాతం
- వ్యవసాయ.. పశు.. అటవీ.. మత్స్య రంగం విలువ రూ.1.84 లక్షల కోట్లు
- ఈ రంగాల్లో వృద్ధిరేటు 2019లో 35.9 శాతం ఉండే.. 2020 -21లో 18.5 శాతంగా ఉంది.
- 2019-20లో పశుసంపద కన్నా పంటల విలువ రూ.9వేల కోట్లు ఎక్కువగా ఉంటే.. ఈ ఏడాది పంటల కన్నా పశుగణ రంగం స్థూల జాతీయోత్పత్తి విలువ రూ.14వేల కోట్లకు పెరిగింది.
- పశుగణ రంగం విలువ 2019లో రూ.68,858 కోట్లుగా ఉంటే.. 2020-21లో అది కాస్తా రూ.94,574కు చేరుకుంది. ఇంత భారీ పెరుగుదల మరే రంగంలో లేదు.
- రవాణా.. నిల్వ.. కమ్యునికేషన్లు.. సమాచార రంగం వృద్ధి రేటు మైనస్ 0.4 శాతం
- రైల్వే రంగం వృద్ధిరేటు మైనస్ 10.3శాతం
- విమానయానం వృద్ధిరేటు మైనస్ 21శాతం
- పన్నులు ఉత్పత్తుల వృద్ధిరేటు మైనస్ 2.3శాతం