Begin typing your search above and press return to search.

జ‌య మేన‌కోడ‌లి ర‌చ్చ మొద‌లైంది

By:  Tupaki Desk   |   14 Dec 2016 1:10 PM GMT
జ‌య మేన‌కోడ‌లి ర‌చ్చ మొద‌లైంది
X
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత సోదరుడు జయకుమార్ కుమార్తె దీపా రాజ‌కీయాల్లోకి అడుగు పెట్ట‌క‌ముందే అన్నాడీఎంకే వ‌ర్గాల్లో లుక‌లుక‌లు ప్రారంభ‌మ‌య్యాయి. జయలలిత నిజమైన వారసురాలు తానేనంటూ కొంత కాలం నుంచి దీపా మీడియా సాక్షిగా ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అనంత‌రం జయలలిత సమాధి దగ్గర పూజలు చేశారు. ఆ సమయంలో త‌మ‌ కుటుంబం జయలలితకు దూరం కావడానికి శశికళ, అన్నాడీఎంకేకి చెందిన కొందరు నాయకులు కారణం అని దీపా ఆరోపించారు. త్వ‌ర‌లోనే వారి బండారం బయటపెడుతానని దీపా మీడియా సాక్షిగా హెచ్చరించారు. దీంతో రాత్రికి రాత్రి దీపా అభిమాన సంఘాలు పుట్టుకువచ్చాయి. ఈ ప‌రిణామంపైనే అన్నాడీఎంకే వ‌ర్గాలు మండిప‌డుతున్నాయి.

జ‌య‌లలిత నెచ్చెలి అయిన శ‌శిక‌ళ అమ్మ సొంత మేన‌కోడలు అయిన దీపాను తీవ్రంగా అవ‌మానిస్తోంద‌ని ఆమె అభిమానులు మండిప‌డుతున్నారు. జయలలిత మరణించిన తరువాత రాజాజీ హాల్ లో అమ్మ భౌతికకాయం దగ్గర దీపాను కనీసం ఒక్క నిమిషం కూడా ఉండనివ్వకుండా అక్కడి నుంచి పంపించి వేయ‌డం ఇందుకు ఉదాహ‌ర‌ణ అని చెప్తున్నారు. ఈ క్ర‌మంలో తానే నిజ‌మైన వార‌సురాలిని అని చెప్పేందుకు త్వ‌ర‌లో జ‌య అన్నాడీఎంకే పార్టీని దీపా ఏర్పాటు చేస్తార‌ని ఆమె అనుచ‌రులు చెప్తున్నారు. అంతేకాకుండా జ‌య‌లలిత‌-దీపా చిత్రాల‌తో కూడిన ఫ్లెక్సీలు చెన్నైలో ఏర్పాటు చేశారు. మ‌రోవైపు ఈ ప‌రిణామంపై అన్నాడీఎంకే వ‌ర్గాలు అసంతృప్తి వ్య‌క్తం చేశాయి. శశిక‌ళ అభిమానులు జ‌య‌ల‌లిత‌-శ‌శిక‌ళ చిత్రాలతో ఉన్న‌ ఫ్లెక్సీల‌ను న‌గ‌రంలో నింపేశారు.

ఈ అభిమానం ర‌చ్చ ఇక్క‌డితోనే ఆగిపోలేదు. దీపా అనుచ‌రులు శ‌శిక‌ళ ఫ్లెక్సీల‌పై న‌ల్ల రంగు చ‌ల్లారు. దీంతో ఆగ్ర‌హించిన చిన్న‌మ్మ అభిమానులు దీపా ఫ్లెక్సీల‌ను చింపివేశారు. దీంతో ఇపుడు త‌మిళ‌నాడులో జ‌య స‌న్నిహితుల ఫ్లెక్సీ వార్ న‌డుస్తోంది. అయితే తాను రాజ‌కీయాల్లోకి వ‌స్తాన‌ని ప్ర‌క‌టించిన దీపా అరంగేట్రానికి ముందే ఈ రేంజ్ లో అన్నాడీఎంకేను ఇర‌కాటంలో ప‌డేస్తుంటే భ‌విష్య‌త్తులో ఏ విధంగా ఉంటుందోన‌ని అమ్మ అభిమానులు ఆవేద‌న చెందుతున్నారు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/