Begin typing your search above and press return to search.

షాక్: క‌రోనా భ‌యంతో క‌న్న‌త‌ల్లిని ఇంట్లోకి రానివ్వ‌లేదు

By:  Tupaki Desk   |   30 May 2020 4:30 PM GMT
షాక్: క‌రోనా భ‌యంతో క‌న్న‌త‌ల్లిని ఇంట్లోకి రానివ్వ‌లేదు
X
క‌రోనా క‌ల‌క‌లం కొన‌సాగుతున్న త‌రుణంలో... మ‌నుషులు భ‌యం భ‌యంతో జీవితం కొన‌సాగిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇలాంటి త‌రుణంలో మాన‌వ‌త్వం సైతం మ‌రిచిపోతున్నారు. తాజాగా ఇలాంటి షాకింగ్ ఘ‌ట‌నే తెర‌మీద‌కు వ‌చ్చింది. కరోనా సోకిందని నవమాసాలు మోసిన కన్నతల్లినే వదిలించుకోవాలనుకున్నారు. కంటికి రెప్పలా కాపాడి పిల్లల్ని పెంచి పెద్ద చేస్తే కరోనా సాకుతో ఆ తల్లిని ఇంట్లోకి రానివ్వ‌లేదు. ఎర్రటి ఎండలో నిలబెట్టారు. ఆ తల్లి దీన స్థితిని చూసి చుట్టు పక్కల వారు చీదరించిన వారి బుద్ధి మారలేదు. ఈ అమానవీయ ఘటన కరీంనగర్ లోని కిసాన్ నగర్ లో చోటు చేసుకుంది.

క‌రీంన‌గ‌ర్‌లోని 3వ డివిజన్ కిసాన్ నగర్‌లో త‌న కుమారుడి వద్ద నివసించే కట్ట శ్యామల(65) మూడు నెలల క్రితం తన చెల్లెలు దగ్గరికి షోలాపూర్ వెళ్లింది. లాక్ డౌన్ తో అక్కడే చిక్కుకుపోయింది. శుక్రవారం నగరంలోని ఇంటికి రాగా కొడుకు అడ్డుకున్నాడు. షోలాపూర్ లో కరోనా ఎక్కువగా ఉందని, తన కుమార్తె డెలివరీకి ఉందని లోపలికి రానీయలేదు. ఉదయం నుంచి ఎండలోనే ఆమె ఇంటి ముందే ఉండిపోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు, వైద్య సిబ్బంది అక్కడకు చేరుకుని కొడుకును హెచ్చరించారు. శ్యామలను హోంక్వారంటైన్ లో ఉంచారు. ఈ ఘ‌ట‌న మాన‌వ‌త్వాన్ని ప్ర‌శ్నించేలా ఉంద‌ని అంటున్నారు.