Begin typing your search above and press return to search.

టైఫాయిడ్ వస్తే కరోనా సోకిందేమో అని .. ముగ్గురు ఏం చేశారంటే

By:  Tupaki Desk   |   15 May 2021 3:46 AM GMT
టైఫాయిడ్ వస్తే కరోనా  సోకిందేమో అని .. ముగ్గురు ఏం చేశారంటే
X
దేశంలో కరోనా మరణాలు రోజురోజుకి పెరిగిపోతుంటే , కరోనా సోకకపోయినప్పటికీ , మాములు జ్వరం వచ్చినా కూడా కరోనా సోకిదేమో అన్న భయం తో పలువురు ఆత్మహత్యలకి పాల్పడుతున్నారు. తాజాగా విజయనగరం జిల్లాలో ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. టైఫాయిడ్ జ్వరం వస్తే కరోనా మహమ్మారి సోకిందని భయపడి కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులు ఆత్మహత్య కి పాల్పడ్డారు. విజయనగరం జిల్లా వేపాడ మండలంలోని నల్లబిల్లిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్రవిషాదం నింపింది.

వివరాల్లోకి వెళ్తే .. నల్లబిల్లి గ్రామానికి చెందిన ఉడత సత్యనారాయణ గుప్తా రెండు సంవత్సరాలుగా విశాఖపట్టణం జిల్లాలోని చోడవరంలో కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. గుప్తాకు భార్య సత్యవతి , అత్త వెంకటసుబ్బమ్మ, కుమారుడు సంతోష్, కుమార్తె పూర్ణ ఉన్నారు. కుమారుడు తెలంగాణలోని నిజామామాద్‌ లో రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నాడు. కూతురికి పెళ్లి అయింది. 2002లో తన మొదటి భార్య మరణించడంతో, 2009లో ఓ పేపరు ప్రకటన చూసి గుంటూరుకు చెందిన సత్యవతిని గుప్తా రెండో వివాహం చేసుకున్నాడు. కాగా, ఇటీవల సత్యనారాయణ అనారోగ్యానికి గురవడంతో ప్రైవేటు ఆసుపత్రిలో చూపించుకుంటే టైఫాయిడ్ అని తేలింది. దీంతో మందులు వాడుతున్నారు.

అయితే, రెండు రోజుల క్రితం భార్య సత్యవతికి కూడా జ్వరం వచ్చింది. దీంతో వారికి సేవలు చేసేందుకు చుక్కపల్లిలో ఉంటున్న కుమార్తె వచ్చింది. గురువారం కుమార్తెను ఇంటికి వెళ్లిపొమ్మన్న గుప్తా, నిన్న ఉదయం భార్య, అత్తతో కలిసి స్వగ్రామం నల్లబిల్లి వచ్చాడు. తమకు కరోనానే వచ్చిందని నిశ్చయించుకున్న గుప్తా దంపతులు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో గ్రామంలోని శివాలయం వెనక భాగంలోకి వెళ్లి వెంట తెచ్చుకున్న పురుగు మందును ఓఆర్ ఎస్ లో కలిపి ముగ్గురూ తాగారు. ఆ తర్వాత దగ్గర్లోనే ఉన్న బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే బావి నుంచి మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టానికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.