Begin typing your search above and press return to search.

ఏపీలో దారుణంః కూతురిని ప్రేమిస్తున్నాడ‌ని..

By:  Tupaki Desk   |   30 May 2021 2:30 AM GMT
ఏపీలో దారుణంః  కూతురిని ప్రేమిస్తున్నాడ‌ని..
X
ఈ దేశాన్ని క‌నిపించ‌కుండా నాశ‌నం చేస్తున్న అంశాల్లో కులం ముందు వ‌ర‌స‌లో ఉంద‌ని ఎంతో మంది మేధావులు చెప్పారు. ఇప్ప‌టికీ చెబుతూనే ఉన్నారు. అయిన‌ప్ప‌టికీ.. ఈ ఉన్మాదం మాత్రం త‌గ్గ‌ట్లేదు. కొంద‌రు త‌మ‌కంటే త‌క్కువ కులం అంటూ మ‌నుషుల‌ను హీనంగా చూస్తున్న ఘ‌ట‌న‌లు త‌ర‌చూ వెలుగు చూస్తూనే ఉన్నాయి. మ‌రికొంద‌రు త‌క్కువ కులం వారు త‌మ‌వారిని ప్రేమించార‌నే అక్క‌సుతో ప్రాణాలు తీస్తున్నారు.

ఆ మ‌ధ్య‌ తెలంగాణ‌లో మారుతీరావు అనే వ్య‌క్తి చేయించిన‌ దారుణ హ‌త్య‌ను ఎవ్వ‌రూ మ‌రిచిపోలేదు. ఆ త‌ర్వాత త‌నుకూడా ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. తాజాగా.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోనూ ఓ కుల హ‌త్య చోటు చేసుకుంది. త‌న కూతురిని ప్రేమిస్తున్నాడ‌నే కార‌ణంతో.. ఓ యువ‌కుడిని చంపేశాడో వ్య‌క్తి.

చిత్తూరు జిల్లా ప‌ల‌మ‌నేరుకు చెందిన ధ‌న‌శేఖ‌ర్ అనే 23 ఏళ్ల యువ‌కుడు బెంగ‌ళూరులో కారు డ్రైవ‌ర్ గా ప‌నిచేస్తున్నాడు. లాక్ డౌన్ నేప‌థ్యంలో స్వ‌గ్రామానికి వ‌చ్చిన ధ‌న‌శేఖ‌ర్‌.. ఓ అమ్మాయితో ప్రేమ‌లో ప‌డ్డాడు. ఇద్ద‌రూ ప్రేమించుకున్నారట‌. ఈ క్ర‌మంలోనే ఓ రోజు త‌మ ఇంట్లో ఎవ్వ‌రూ లేర‌ని, ఇంటికి రావాల‌ని మెసేజ్ చేసింద‌ట స‌ద‌రు యువ‌తి.

దీంతో.. ధ‌న‌శేఖ‌ర్ ఆ యువ‌తి ఇంటికి వెళ్ల‌గా.. కాసేప‌టికే ఆమె తండ్రి ఇంటికి వ‌చ్చాడు. వాళ్లిద్ద‌రినీ చూసిన అత‌ను ధ‌న‌శేఖ‌ర్ ను త‌న‌తోపాటు పొలం వ‌ద్ద‌కు తీసుకెళ్లాడ‌ట‌. త‌న కూతురినిప్రేమించాడ‌నే కార‌ణంతో చంపేసి, బావిలో ప‌డేశాడ‌ట‌. అయితే.. మూడు రోజుల త‌ర్వాత శవం పైకి తేల‌డంతో.. గుట్టుచ‌ప్పుడు కాకుండా బ‌య‌ట‌కు తీయించి, ముక్క‌లుగా న‌రికి పొలంలో పాతిపెట్టాడ‌ట‌.

మూడు రోజులుగా త‌మ కుమారుడు క‌నిపించ‌క‌పోవ‌డంతో.. కుటుంబ స‌భ్యులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దీంతో.. రంగంలోకి దిగిన పోలీసులు కాల్‌డేటా ఆధారంగా విచార‌ణ చేప‌ట్ట‌డంతో.. అస‌లు విష‌యం బ‌య‌ట‌ప‌డిందని తెలుస్తోంది. నిందితుడితోపాటు కుటుంబ స‌భ్యుల‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు.