Begin typing your search above and press return to search.

శోభనం జరిపించారు.. దుస్తులపై రక్తం లేదని అమ్మాయిలను వెళ్ల‌గొట్టారు!

By:  Tupaki Desk   |   10 April 2021 5:46 AM GMT
శోభనం జరిపించారు.. దుస్తులపై రక్తం లేదని అమ్మాయిలను వెళ్ల‌గొట్టారు!
X
శాస్త్ర‌విజ్ఞానంలో ప్ర‌పంచం ఎంతో ముందుకు వెళ్తున్నా.. దేశంలోని కొంత‌మంది ఎంత‌టి అజ్ఞానంలో ఉన్నారో తెలిపే సంఘ‌ట‌న ఇది! బుర్ర‌ల నిండా ఎలాంటి మూఢ‌త్వం నిండిఉందో చాటిచెప్పే అమాన‌వీయ ఘ‌ట‌న ఇది! నిందితుల‌తోపాటు పెద్ద మ‌నుషులు కూడా దారుణంగా ప్ర‌వ‌ర్తించి, ఇద్ద‌రు యువ‌తుల జీవితాల‌ను రోడ్డు పాలు చేశారు. ఈ సంఘ‌ట‌న మ‌హారాష్ట్రలో చోటు చేసుకుంది.

ఒకే ఇంటికి చెందిన ఇద్ద‌రు అన్న‌ద‌మ్ముల‌కు.. త‌మ స‌మీప గ్రామంలోని మ‌‌రో ఇంటికి చెందిన అక్కాచెళ్లెల్ల‌ను ఇచ్చి పెళ్లి చేశారు. గత నవంబర్ లో ఘనంగా వివాహం చేశారు. ఆ త‌ర్వాత శోభ‌నం ఏర్పాట్లు చేశారు. వారికి తెల్ల‌టి వ‌స్త్రాల‌ను క‌ట్టి గ‌దుల్లోకి పంపించారు. తెల్ల‌వారిన త‌ర్వాత ఆ వ‌స్త్రాల‌ను చూసి అక్కాచెల్లెళ్ల‌లో ఒక‌రు క‌న్య కాద‌ని తేల్చేశారట‌. ఎలా అంటే.. తెల్ల వ‌స్త్రంపై ర‌క్త‌పు మ‌ర‌కు లేక‌పోవ‌డ‌మే ఇందుకు కార‌ణమ‌ట‌.

దీంతో.. అత్తింటివారి అరాచ‌కానికి అంతే లేకుండా పోయింది. మీ కుటుంబం మొత్తం ఇంతే.. అంటూ అక్కాచెళ్లెల్లు ఇద్ద‌రినీ వేధించ‌డం మొద‌లు పెట్టారట‌. కొంద‌రు పెద్ద‌లు స‌ర్దిచెప్పిన‌ప్ప‌టికీ.. అత్త‌గారు విన‌లేదట‌. కోడ‌ళ్ల‌ను వెళ్ల‌గొట్టాల‌ని కొడుకుల‌ను రెచ్చ‌గొట్టింద‌ట‌. వాళ్లుకూడా త‌ల్లిమాట‌కు త‌లూపి, ఇంట్లోంచి వెళ్ల‌గొట్టిన‌ట్టు స‌మాచారం. రూ.10 ల‌క్ష‌లు తెస్తే మాత్రం కాపురం చేస్తామ‌ని చెప్పార‌ట‌. ఆర్థిక స్థోమ‌త లేని అభాగ్యులు.. ఏడ్చుకుంటూ ఈ ఫిబ్ర‌వ‌రిలో ఇంటికి వెళ్లిపోయార‌ట‌.

ఇక్క‌డ‌, రంగ ప్ర‌వేశంచేసిన‌పెద్ద‌లు పంచాయతీ చేసేందుకు సి‌ద్ధ‌మ‌య్యార‌ట‌. దీనికోసం రూ.40 వేలు తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. అది కూడా అమ్మాయిల‌ త‌ల్లిదండ్రుల‌నుంచే. ఆ మొత్తం తీసుకొని పంచాయ‌తీ చేసి తీర్పు చెప్పారట‌. ఏమ‌ని అంటే.. మీ అమ్మాయిలో ఒక‌రికి ఇదివ‌ర‌కే వివాహేత‌ర సంబంధం ఉంది కాబ‌ట్టి.. ఈ పెళ్లి చెల్ల‌ద‌ని చెప్పార‌ట‌. అంతేకాకుండా.. కులం నుంచి బ‌హిష్క‌రిస్తున్నామ‌ని ప్ర‌క‌టించార‌ట‌.

దీంతో.. బాధితులు క‌న్నీటితో పోలీస్ స్టేష‌న్ మెట్లు ఎక్కారు. పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేపట్టారు. మూఢ న‌మ్మ‌కాల‌తో అమ్మాయిల జీవితాల‌ను నాశ‌నం చేసే ఘ‌ట‌న‌ల‌కు అంతే లేకుండాపోతోంది. క‌న్య‌త్వ పొర అనేది అతి సున్నిత‌మైన‌ద‌ని, అది ఎలాగైనా చెదిరిపోవ‌చ్చ‌ని వైద్యులు చెబుతూనే ఉన్నారు. ఆట‌ల్లోనో.. ప‌రిగెత్తే స‌మ‌యంలోనో ఎలాగైనా అది దెబ్బ‌తినే అవ‌కాశం ఉంటుంద‌ని ఎన్నో ప‌రిశోధ‌న‌లు వెల్లడించాయి. అయిన‌ప్ప‌టికీ.. అవేవీ ప‌ట్ట‌ని అజ్ఞానులు.. మూఢ‌న‌మ్మ‌కాల‌తో జీవితాల‌ను నాశ‌నం చేస్తున్నార‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.