Begin typing your search above and press return to search.

ఎంత దారుణం? పెళ్లి చేయటం లేదని తండ్రిని.. బాబాయ్ ని చంపేశాడు

By:  Tupaki Desk   |   13 Aug 2022 4:23 AM GMT
ఎంత దారుణం? పెళ్లి చేయటం లేదని తండ్రిని.. బాబాయ్ ని చంపేశాడు
X
ఇటీవల కాలంలో దారుణ ఉదంతాలు తరచూ వెలుగు చూస్తున్నాయి. తాజా ఉదంతం చూస్తే.. అయ్యో అనుకోకుండా ఉండలేం. తనకు పెళ్లి చేయమని కోరినా.. తన తండ్రి.. బాబాయ్ లు పట్టించుకోవటం లేదన్న కోపంతో వారిద్దరిని చంపేసిన వైనం ఇప్పుడు సంచలనంగా మారింది. తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా మోపాల్ మండల కేంద్రంలో ఈ షాకింగ్ ఉదంతం చోటు చేసుకుంది. ఈ దారుణ ఉదంతానికి సంబంధించిన వివరాల్ని పోలీసులు వెల్లడించారు.

మోపాల్ గ్రామానికి చెందిన 64 ఏళ్ల పెద్దబ్బయ్య.. సాయిలు ఇద్దరు అన్నదమ్ములు. పెద్దబ్బయ్య ముగ్గురు కొడుకులు బతుకుదెరువు కోసం గల్ఫ్ కు వెళ్లారు. వారిలో రెండో కొడుకు సతీశ్ ప్రవర్తనలో తేడా రావటంతో కంపెనీ ప్రతినిధులు అతడ్ని తిరిగి పంపేశారు. దీంతో నాలుగేళ్ల క్రితం ఊరికి వచ్చేశాడు. దీంతో అతడికి ఆసుపత్రిలో వైద్యం చేయిస్తున్నారు. అప్పటి నుంచి ఎలాంటి పని లేకుండా ఉండిపోయాడు. దీంతో తరచూ తనకు పెళ్లి చేయాలని ఇంట్లో పోరు పెట్టేవాడు.

అయితే.. అతని ఆరోగ్య సమస్యల గురించి తెలిసిన తండ్రి.. కొడుకు పెళ్లి విషయంలో జాప్యం చేసేవారు. ఇదిలా ఉంటే.. తాజాగా తానే ఒక పెళ్లి సంబంధాన్ని కుదుర్చుకొని ఇంట్లో వారికి చెప్పాడు. ఆడపెళ్లి వారు ఈ నెల 14న వస్తారని చెప్పాడు.

గల్ప్ లో ఉన్న కొడుకులతో మాట్లాడి చెబుతామని చెప్పటంతో గొడవ మొదలైంది.తండ్రి కొడుకుల మధ్య గొడవ జరిగింది. దీంతో గొడవను సర్ది చెప్పటానికి బాబాయ్ సాయిలు వచ్చి సతీశ్ కు నచ్చజెప్పాడు. గురువారం రాత్రి ఈ రచ్చ జరగ్గా.. శుక్రవారం ఉదయాన్నే మళ్లీ తండ్రి కొడుకుల మధ్య గొడవ మొదలైంది.

ఇది కాస్తా పెద్దది కాగానే.. ఇంట్లో ఉన్న కర్ర తీసుకొని.. తండ్రిని కొట్టేందుకు వెళ్లాడు. దీన్ని గమనించిన బాబాయ్ సాయిలు అడ్డుకున్నాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన సతీశ్.. అక్కడే ఉన్న పారతో సాయిలు మీద దాడి చేశాడు. దీంతో తీవ్రంగా గాయపడిన అతడు అన్న వద్దకు రాగా.. కొడుకును అడ్డుకునే ప్రయత్నం చేశాడు.

అప్పటికే కోపంగా ఉన్న సతీశ్ తండ్రిని కూడా పారతో బలంగా మోది చంపేశాడు. వారిద్దరు చనిపోయారని చూసుకున్నాక.. అక్కడి నుంచి పారిపోయాడు. దీనికి ముందు.. తల్లిని.. వదినను కూడా చంపే ప్రయత్నం చేయగా.. వారు అతడి బారి నుంచి తప్పించుకున్నాడు. తండ్రి.. బాబాయ్ ను చంపేసిన తర్వాత నిందితుడు సతీశ్.. తులసి చెట్టుకు పూజ చేయటం గమనార్హం. ఈ ఉదంతం స్థానికంగా సంచలనంగా మారింది.