Begin typing your search above and press return to search.

‘భద్రమ్’ సినిమా చూసే.. ఐదుగురిని హత్య చేశాడ‌ట‌..! పోలీసులకు చెప్పిన‌ నిందితుడు!

By:  Tupaki Desk   |   11 March 2021 11:00 AM GMT
‘భద్రమ్’ సినిమా చూసే.. ఐదుగురిని హత్య చేశాడ‌ట‌..! పోలీసులకు చెప్పిన‌ నిందితుడు!
X
అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న వారినీ.. వివాహేత‌ర సంబంధాలు కొనసాగిస్తున్న‌వారినీ సెల‌క్ట్ చేసుకుంటారు. ఆరోగ్యం బాగోలేని వ్య‌క్తి ఎన్నాళ్లైనా భార‌మే.. ఆర్థికంగా న‌ష్ట‌మేన‌ని కుటుంబ స‌భ్యుల‌కు బ్రెయిన్ వాష్ చేస్తారు. ఇక‌, అక్ర‌మ సంబంధాలు కొన‌సాగించే వారికి మీ పార్ట్ న‌ర్ ను లేపేస్తే మీకు ఎదురే ఉండ‌ద‌ని చెప్పేస్తారు. ఇలా చేస్తే.. మీకేం లాభం అని వాళ్లు అడిగితే.. బీమా సొమ్ములు వ‌చ్చేస్తాయ‌ని చెప్తారు. వాళ్లు ఓకే అన‌గానే.. ల‌క్ష‌ల విలువైన‌ ఇన్సూరెన్స్ పాల‌సీ తీసుకుంటారు.

ఆ పాల‌సీ ఎంత‌కాలం తర్వాత నుంచి వ‌ర్తిస్తుందో చూసుకొని, ఆ స‌మ‌యం వ‌ర‌కూ వేచి చూసి, ఆ వెంట‌నే ఎవ‌రి పేరుమీద పాల‌సీ తీసుకున్నారో వారిని చంపేస్తారు. ఆ త‌ర్వాత ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకొని, వ‌చ్చిన డ‌బ్బుల్లో ఫిఫ్టీ ఫిఫ్టీ పంచుకుంటారు. ఇదీ.. న‌ల్గొండ జిల్లాలో వెలుగు చూసిన బీమా దారుణ హ‌త్య‌ల వెనుకున్న నిజం.

ఇప్ప‌టి వ‌ర‌కూ ఇలా ఐదుగురిని చంపేసింది ఓ ముఠా. న‌ల్గొండ జిల్లా దామ‌ర‌చ‌ర్ల మండ‌లం రాళ్ల‌వాగు తండాకు చెందిన ధీరావ‌త్ రాజునాయ‌క్ నేతృత్వంలోని ముఠా స‌భ్యులు ఈ దారుణాల‌కు పాల్ప‌డ్డారు. ఇందులో ప‌లువురు అధికారుల‌కు, ఇన్సూరెన్స్ కంపెనీల్లో ప‌నిచేసే వారికి కూడా సంబంధాలు ఉన్నాయ‌ట‌. ఇందుకు సంబంధించిన వివ‌రాల‌ను పోలీసులు వెల్ల‌డించారు. అయితే.. ఇలా ఒక‌రిని చంపేసిన త‌ర్వాత వ‌చ్చిన డ‌బ్బులు పంచుకోవ‌డంలో తేడాలు రావ‌డంతో.. ఈ విష‌యం పోలీసుల‌కు లీకైంది. దీంతో.. ఈ దారుణ వ్య‌వ‌హారం వెలుగు చూసింది.

కాగా.. నిందితుల‌ను అరెస్టు చేసిన పోలీసులు విచార‌ణ చేట్టారు. అయితే.. ఈ విచార‌ణ‌లో న‌మ్మ‌లేని నిజాలు వెలుగు చూశాయి. తాను ఓ సినిమా చూసి ఈ నేరాల‌కు స్కెచ్ గీసిన‌ట్టు నిందితుడు చెప్ప‌డం గ‌మ‌నార్హం. తెలుగులో వ‌చ్చిన ‘భ‌ద్ర‌మ్‌’ అనే సినిమా ఆధారంగానే ఈ హత్యలకు పాల్పడినట్టు ప్రధాన నిందితుడు రాజు పోలీసులకు వెల్లడించాడట. అమాయకులకు బీమా పాలసీలు ఇప్పించి, ఆ తర్వాత వారిని చంపేసి, ప్ర‌మాదాల్లో చ‌నిపోయిన‌ట్టుగా చిత్రించి, బీమా సొమ్ములు కాజేయ‌డ‌మే ఈ సినిమా క‌థ. దీన్ని చూసే తాను ఇలా చేశాన‌ని నిందితుడు చెప్ప‌డంతో పోలీసులు ఆశ్చ‌ర్య‌పోయార‌ట‌. ప్ర‌జ‌లారా.. విన్నారుగా.. ఏ పాల‌సీ మాటున ఏముందో చూసుకొన్న త‌ర్వాతే సంత‌కం చేయ‌డం ఉత్త‌మం.