Begin typing your search above and press return to search.

సత్యసాయి జిల్లాలో దారుణం.. ఆమెను చంపేసి గ్యాంగ్ రేప్ చేశారట

By:  Tupaki Desk   |   10 May 2022 5:03 AM GMT
సత్యసాయి జిల్లాలో దారుణం.. ఆమెను చంపేసి గ్యాంగ్ రేప్ చేశారట
X
ఏపీలో నేరాలు.. ఘోరాలు అంతకంతకూ ఎక్కువైపోతున్నాయి. గతంతో పోలిస్తే.. ఇటీవల కాలంలో మహిళలపై జరుగుతున్న దాడులు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. అక్కడా ఇక్కడా అన్న తేడా లేకుండా ఎక్కడైనా.. ఎవరినైనా సరే.. అత్యాచారం చేసేస్తున్న వైనం ఎక్కువ అవుతోంది. ఇటీవల కాలంలో చోటు చేసుకుంటున్న దారుణాలకు కొనసాగింపుగా తాజాగా శ్రీసత్యసాయి జిల్లాలో మరో ఆరాచకపు ఘటన చోటు చేసుకుంది.

బహిర్భూమికి వెళ్లిన బాలింతను దారుణంగా హత్య చేసి.. అనంతరం ఆమెపై సామూహిక అత్యాచారం జరిగినట్లుగా అనుమానిస్తున్నారు. ఈ ఉదంతం స్థానికంగా సంచలనంగా మారింది. కనగానపల్లి మండలానికి చెందిన మహిళకు ఏడేళ్ల క్రితం పెళ్లైంది. ఏడు నెలల క్రితం ఆమెకు బాబు పుట్టాడు. పది రోజుల క్రితం ఆమెకు కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేయించుకుంది. తన నెలల బిడ్డను తోడి కోడలకు ఇచ్చి బహిర్భూమికి వెళ్లారు.

అప్పటికే అక్కడ కాపు కాసిన గుర్తు తెలియని వ్యక్తులు ఆమెపై దాడికి పాల్పడ్డారు. బండారాళ్లతో ఆమె తలను చిధ్రం చేసిన ఆనవాళ్లతో పాటు.. ఆమెపై సామూహిక అత్యాచారం జరిపినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బహిర్భూమికి వెళ్లి పది గంటలు అవుతున్నా తిరిగి రాకపోవటంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు వెతగ్గా.. ఊరి బయట విగతజీవిగా పడి ఉన్న బాధితురాలు కనిపించింది.

మహిళ దారుణ హత్యకు సంబంధించి కుటుంబంలోని నలుగురిపైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. గ్రామానికి చెందిన నలుగురు ఈ దారుణానికి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. మ్రతురాలి ఫోన్ లోని కాల్ లిస్టు ఆధారంగా దర్యాప్తు జరుపుతున్నారు.