Begin typing your search above and press return to search.

కరోనా టెస్ట్ కి వచ్చి ... రిపోర్ట్ రాకముందే ఆస్పత్రి వద్దే మృతి !

By:  Tupaki Desk   |   26 April 2021 5:30 AM GMT
కరోనా టెస్ట్ కి వచ్చి ... రిపోర్ట్ రాకముందే ఆస్పత్రి వద్దే మృతి !
X
కరోనా వైరస్..కరోనా వైరస్ ప్రస్తుతం ఎక్కడ చూసినా ఇదే పేరు వినిపిస్తుంది. ఇక సెకండ్ వేవ్ లో ఈ మహమ్మారి వ్యాప్తి బాగా పెరిగిపోయింది. దీనితో కొందరు కరోనా లేకున్నా కూడా ఉందేమో అని భయపడి ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా ఓ వ్యక్తి తనకి కరోనా సోకిందేమో అనే అనుమానం తో టెస్టు కోసం ఆస్పత్రికి వచ్చి, ఆ ఆస్పత్రి ఆవరణంలోనే మృతిచెందారు. ఈ ఘటన ఆదివారం నిజామాబాద్‌ జిల్లా రెంజల్‌ పీహెచ్‌సీ ఆవరణలో చోటుచేసుకుంది. దీనితో అయన భార్య..తల్లి రోదనను ఆపడం ఎవరితరం కాలేదు.

ఈ ఘటన గురించి పూర్తి వివరాల్లోకి వెళ్తే .. నిజామాబాద్‌ జిల్లా రెంజల్‌ మండలం బోర్గం గ్రామానికి చెందిన అశోక్‌ వృత్తి రీత్యా ఆటోడ్రైవర్‌. కొద్దిరోజులుగా తీవ్ర జ్వరంతో బాధ పడుతున్నాడు. పీహెచ్‌ సీలో కొవిడ్‌ పరీక్ష చేయగా నెగెటివ్‌ వచ్చింది. తీవ్ర జ్వరం ఉండటంతో వైద్యులు మళ్లీ పరీక్ష నిర్వహించారు. రిపోర్టు కోసం అశోక్‌, అతడి తల్లి గంగమణి, భార్య లక్ష్మి ఆస్పత్రి ఆవరణలోని చెట్టుకింద కూర్చున్నారు. అయితే, కిశోర్‌.. అంతలోనే చెట్టుకు ఒరిగి ప్రాణాలు వదిలాడు. ఊహించని పరిణామంతో తల్లి, భార్య విలపించిన హృదయ విదారక దృశ్యం గుండెలను పిండెస్తోంది. బాధితుడి భార్య ఆస్పత్రి ప్రాంగణంలో ఇంటికి పోదాం లేవయ్యా అంటూ విలపించిన తీరు అక్కడున్న వారందరినీ కలచివేసింది. కుమారుడిని పట్టుకుని అశోక్‌ తల్లి కన్నీటిపర్యంతమయింది. ఇదిలాఉంటే అనంతరం వచ్చిన కరోనా పరీక్ష ఫలితాల్లో అశోక్‌ కరోనా నెగెటివ్‌ అని తేలింది. కిశోర్‌ మృతికి కరోనా కారణమై ఉండొచ్చని చాలాసేపటి వరకు ఎవరూ మృతదేహం వద్దకు వెళ్లలేదు. మూడు గంటల పాటు అతడి తల్లి, భార్య సాయం కోసం ఎదురుచూశారు. చివరకు గ్రామస్థులు ట్రాక్టర్‌లో మృతదేహాన్ని తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. జ్వరం కారణగానే అతడు మృతిచెంది ఉండవచ్చని చెప్పారు.