Begin typing your search above and press return to search.

ప్రేమికులు క్యాబ్ బుక్ చేసుకున్నారు.. తర్వాతేమైందో ఊహించలేని దారుణం

By:  Tupaki Desk   |   22 March 2021 4:29 AM GMT
ప్రేమికులు క్యాబ్ బుక్ చేసుకున్నారు.. తర్వాతేమైందో ఊహించలేని దారుణం
X
మీరిప్పుడు చదివే క్రైంను అస్సలు ఊహించలేరు. ఊహకు అందని రీతిలో జరిగిన ఈ దారుణం గురించి తెలిసిన పోలీసులు సైతం అవాక్కు అవుతున్నారు. ఇలా కూడా దారుణాలకు పాల్పడొచ్చా? అన్నట్లు ఉన్న ఈ దారుణ నేరం వివరాలు చెప్పే ముందు.. మీ అంచనాకు ఓ చిన్న పరీక్ష. అందులో కానీ సరిగా సమాధానం చెబితే.. మీ అంచనా మామూలుగా ఉండదన్నట్లే.

వేర్వేరు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు ప్రేమికులు కలిశారు. క్యాబ్ బుక్ చేసుకున్నారు. దారి మధ్యలో దారుణం జరిగింది. ఏమైందన్నది ప్రశ్న. ఇంకేముంది.. క్యాబ్ డ్రైవర్ అమ్మాయి మీద ఆఘాయిత్యం చేస్తాడన్న సమాధానం వస్తుంది. కాదనుకుంటే.. ప్రేమికులు ఇద్దరు గొడవపడి.. అతడు ఆమెను చంపుతాడని చెబుతాం. సాధారణంగా ఇలాంటివే జరుగుతాయి. కానీ.. తాజా ఉదంతం ఇందుకు భిన్నమైనది. కర్ణాటకలోని బీదర్ కు చెందిన అమ్మాయి (ఇంతియాజ్)కి.. ఢిల్లీలోని ఉండే అబ్బాయి(శివ)ని ఫేస్ బుక్ కలిపింది. ఇద్దరు ఒకరంటే ఒకరు తెగ ఇష్టపడ్డారు. కానీ.. వీరి వ్యవహారం తెలిసిన అమ్మాయి కుటుంబ సభ్యులు శివను హెచ్చరించారు.

దీంతో.. ఇంతియాజ్ ను తీసుకొని ఢిల్లీకి వెళ్లిపోయాడు. ఆర్థిక ఇబ్బందులతో ఏదైనా పని చేసి భారీ సంపాదించాలన్న ప్లాన్ తో హైదరాబాద్ కు వచ్చారు. బీదర్ కు ఒక క్యాబ్ మాట్లాడుకొని.. మధ్యలో ఆ ట్యాక్సీ వాలాను చంపేసి.. కారును అమ్మేయాలన్న దుర్మార్గపు ఆలోచన చేశారు. మొదటి ప్రయత్నంలో ఫెయిల్ కాగా.. రెండోసారి తనకు మిత్రుడైన రవి సాయాన్ని కోరాడు శివ. అతను అందుకు ఓకే చెప్పారు.

మరోసారి నాంపల్లి దగ్గర ఒక క్యాబ్ మాట్లాడుకొని బీదర్ బయలుదేరారు. మార్గమధ్యంలో ఇంతియాజ్ బాత్రూంకు వెళ్లాలని చెప్పి కారు ఆపించారు. డ్రైవర్ వెనుక కూర్చున్న శివ.. తన దగ్గరి ప్లాస్టిక్ తాడుతో మెడకు ఉరి వేసి చంపేశాడు. కదలకుండా ఉండేందుకు రవి సాయం చేశాడు. తన సోదరుడు మిస్ అయిన విషయాన్ని బజార్ ఘాట్ పోలీసులకు క్యాబ్ డ్రైవర్ బ్రదర్ కంప్లైంట్ చేయటంతో రంగంలోకి దిగిన పోలీసులు.. సిసి కెమేరా ఫుటేజ్ సాయంతో నిందితుల్ని పట్టుకున్నారు. క్యాబ్ డ్రైవర్ ను హత్య చేసిన తర్వాత కారును అమ్మేసిన వారు.. జల్సా చేస్తున్నారు. నాంపల్లి లాడ్జిలో నమోదైన వీరి వివరాల ఆధారంగా.. ఫోన్ సిగ్నల్ ను ట్రేస్ చేసి నిందితుల్ని పట్టుకొని విచారణ జరపగా.. తాము చేసిన దారుణాన్ని వారు చెప్పారు. దీంతో.. పోలీసులు షాక్ తిన్నారు.