Begin typing your search above and press return to search.

కరోనా మరణమృదంగం : ఇద్దరు మంత్రులు, ముగ్గురు ఎమ్మెల్యేలు మృతి

By:  Tupaki Desk   |   1 May 2021 8:30 AM GMT
కరోనా మరణమృదంగం : ఇద్దరు మంత్రులు, ముగ్గురు ఎమ్మెల్యేలు మృతి
X
దేశంలో కరోనా మహమ్మారి అల్లకల్లోలం సృష్టిస్తుంది. చిన్నా , పెద్దా , పేద , ధనిక అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరిపై తన విశ్వరూపం చూపిస్తుంది. వ్యాక్సిన్ వచ్చింది ఇక కరోనా అంతం తప్పదు అనుకుంటే .. సెకండ్ వేవ్ అంటూ చుక్కలు చూపిస్తుంది. ఈ మహమ్మారి దెబ్బకి సామాన్యులతో పాటుగా ప్రముఖులు , రాజకీయ నేతలు కూడా కన్నుమూస్తున్నారు. ఇక ఈ వైరస్ దేశంలో అతి పెద్ద రాష్ట్రమైన యూపీ లో చాలా వేగంగా విజృంభిస్తుంది. కరోనా వైరస్‌ ధాటికి మంత్రులు, ఎమ్మెల్యేలు తట్టుకోలేకపోతున్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తోపాటు చాలామంది మంత్రులు, ఎమ్మెల్యేలు కరోనా బారినపడ్డారు. ఆ రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య కూడా భారీగానే ఉంది.

అలాగే ,ఇప్పటివరకు యూపీకి చెందిన ఇద్దరు మంత్రులు, ముగ్గురు ఎమ్మెల్యేలు కరోనా బారినపడి మృత్యువాత పడ్డారు. వారిలో ఒకరు బుధవారమే మృత్యువాత పడ్డారు. కరోనాపై తన వ్యాఖ్యలతో సంచలనం రేపిన ఎమ్మెల్యేనే కరోనా బారిన పడి మృతి చెందడం గమనార్హం. ఆయన మరెవరో కాదు నవాబ్‌ గంజ్‌ బీజేపీ ఎమ్మెల్యే కేసర్‌ సింగ్‌ గంగ్వార్‌ కరోనాతో బాధపడుతూ బుధవారం మృతి చెందాడు. అంతకుముందు ఆయన కరోనాపై ‘కరోనా ఎక్కడ ఉంది, అసలు మాస్క్‌లు ధరించడం అవసరమా, అని అప్పట్లో ప్రశ్నించాడు. అంతే కాకుండా కరోనా విజృంభిస్తున్నా కూడా ఆయన కనీసం మాస్క్‌ ధరించకుండా విచ్చలవిడిగా తిరిగాడు. అంతకుముందు ఉత్తరప్రదేశ్‌లో ఇద్దరు మంత్రులు కరోనా బారినపడి చనిపోయారు. మంత్రులు చేతన్‌ చౌహన్‌, కమలరాణి వరుణ్‌, లక్నో పశ్చిమ ఎమ్మెల్యే సురేశ్‌ శ్రీవాస్తవ, ఆరయ్య సదర్‌ ఎమ్మెల్యే రమేశ్‌ దివాకర్‌ కరోనా బారినపడి కన్నుమూశారు. వీరితోపాటు చాలా మంది ప్రజాప్రతినిధులు, ప్రముఖులు కరోనా వైరస్‌ బారిన పడ్డారు.