Begin typing your search above and press return to search.

గుజ‌రాత్‌ లో ఇది ఖ‌చ్చితంగా మోడీకి షాకే

By:  Tupaki Desk   |   19 Dec 2017 9:56 AM GMT
గుజ‌రాత్‌ లో ఇది ఖ‌చ్చితంగా మోడీకి షాకే
X

గుజరాత్...ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ స్వ‌రాష్ట్రం. ఆయ‌న ప్ర‌యోగాల‌కు వేదిక‌. హోరాహోరీగా సాగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయ‌న సార‌థ్యంలోని అధికార బీజేపీ మరోసారి తన అధికారాన్ని నిలబెట్టుకుంది. తాజా ఎన్నికల విజయంతో గుజరాత్‌ లో బిజెపి వరుసగా ఆరోసారి అధికారాన్ని చేజిక్కించుకుంది. పూర్తిస్థాయి మెజార్టీని ఆ పార్టీ సాధించింది. 1995 నుంచి వరుసగా బిజెపి ఇక్కడ అధికారం చేజిక్కించుకుంటూ వస్తోంది. 182 స్థానాలకు గానూ బిజెపి 99 స్థానాల్లో గెలుపొందింది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 92. మ్యాజిక్ ఫిగర్ కంటే ఎక్కువగానే బిజెపి సీట్లు సాధించడంతో ఏ పార్టీ పొత్తు అవసరం లేకుండానే సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. అయిన‌ప్ప‌టికీ ఫలితాలు వెలువడిన తీరు ఆ పార్టీని తీవ్రంగా కలవరపాటుకు గురిచేస్తున్నాయి.

అధికారం చేప‌ట్టే సీట్లు అందించిన‌ప్ప‌టికీ....కొన్ని జిల్లాల్లో బీజేపీకి ఓటర్లు గట్టి షాక్ ఇచ్చారు. ఆరు జిల్లాల్లో ఆ పార్టీ అసలు ఖాతానే తెరవలేదు. అమ్రేలీ - నర్మద - పోరుబందర్ - ఆనంద్ - డాంగ్స్ - తాపి జిల్లాల్లో అధికార పార్టీ ఒక్క స్థానంలోనూ విజయం సాధించలేదు. మోడీ సొంత నియోజకవర్గంలో బీజేపీ ఓటమిపాలైంది. వాద్‌ నగర్‌ లో ఉన్న ఉన్జా నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి - సిట్టింగ్ ఎమ్మెల్యే పటేల్ నారాయణ్‌ భాయ్ లల్లూదాస్‌ ను కాంగ్రెస్ అభ్యర్థి ఆశా పటేల్ సుమారు 19,500 ఓట్ల మెజారిటితో ఓడించారు. పటీదార్ (పటేల్) సామాజికవర్గం ప్రాబల్యం అధికంగా ఉన్న ఈ నియోజకవర్గంలో ఆశా పటేల్‌ కు 81,797 ఓట్లు రాగా - ఆమె ప్రత్యర్థి లల్లూదాస్‌ కు 62,268 ఓట్లు వచ్చాయి. 2012లో లల్లూదాస్ 25వేల ఓట్ల మెజారిటీతో ఆశాపటేల్‌ పై విజయం సాధించారు. ఈ ప‌రిణామం మోడీకి మింగుడుప‌డ‌నిద‌ని బీజేపీ నేత‌లే అంటుడ‌టం గ‌మ‌నార్హం.

మ‌రోవైపు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో నోటాకు నాలుగు లక్షల ఓట్లు పడ్డాయి. కొన్ని జాతీయ పార్టీల కంటే కూడా నోటాకే ఎక్కువ నోట్లు పోలయ్యాయి. ఇప్పటివరకు జరిగిన ఓట్ల లెక్కింపులో నోటాకు సుమారు రెండు శాతం ఓట్లు పోలయ్యాయి. నోటాకు పడిన ఓట్లు బీఎస్‌ పీ - ఎన్‌సీపీకి పడిన ఓట్లే కంటే అధికం కావడం గమనార్హం. ఆయా పార్టీల నుంచి పోటీలో ఉన్న అభ్యర్థులు నచ్చకపోవడంతో ప్రజలు నోటాకు ఓటేశారు. సోమ్‌ నాథ్ - నారణ్‌ పురా - గాంధీధామ్ నియోజకవర్గాల్లో పార్టీల కంటే నోటాకే ఎక్కువ ఓట్లు పడ్డాయి. ఒక్క పోర్‌ బందర్‌ లోనే నోటాకు 3433 ఓట్లు పడ్డాయి. ప్ర‌ధాని మోడీ చెప్తున్న గుజ‌రాత్ మోడ‌ల్ డెవ‌ల‌ప్‌ మెంట్‌ లో నిజం ఉంటే....ఈ స్థాయిలో నోటాకు ఓట్లేంట‌ని ప‌లువురు ప్ర‌శ్నిస్తున్నారు.

ఇదిలాఉండ‌గా...ప్రతిపక్ష కాంగ్రెస్ నవ్‌ సారి - అర్వలి జిల్లాల్లో ఖాతా తెరవలేదు. ఏడు జిల్లాల్లో బీజేపీ - కాంగ్రెస్ హోరాహోరీగా తలపడ్డాయి. బనస్కంత - కచ్ - బొతాద్ - ద్వారకా - ఖేడా - మహిసాగర్ - సబర్కంత జిల్లాల్లో రెండు పార్టీలు నువ్వా నేనా అన్న రీతిలో తలపడ్డాయి. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఉన్జా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాగా, పట్టణ ప్రాంతాల్లో బీజేపీకి ఎక్కువగా ఓట్లు వచ్చాయి. గుజరాత్‌లో తొలిసారి గిరిజన ప్రాంతాల్లో బీజేపీ ఆధిక్యం సాధించింది. పాటిదార్ ప్రాంతాలతో పాటు ముస్లిం ఏరియాల్లోనూ బీజేపీ మంచి ఓటు బ్యాంకును సంపాదించింది.