Begin typing your search above and press return to search.

పోల‌వ‌రంపై మ‌రో పిడుగు.. ఈ పాపం ఎవ‌రిది?

By:  Tupaki Desk   |   24 Oct 2021 4:30 PM GMT
పోల‌వ‌రంపై మ‌రో పిడుగు.. ఈ పాపం ఎవ‌రిది?
X
ఏపీకి జీవ‌నాడి వంటి పోల‌వ‌రం సాగు, తాగు నీటి స‌హా జ‌ల విద్యుదుత్ప‌త్తి ప్రాజెక్టు విష‌యంలో కేంద్రం మ‌రో నిర్ణ‌యం తీసుకుంది. ఫ‌లితంగా పోలవరం ప్రాజెక్టులో మరో కోత ప‌డింది. విద్యుత్ కేంద్రం నిర్మాణానికయ్యే ఖర్చును డీపీఆర్ నుంచి మినహాయించినట్లు కేంద్రం పేర్కొంది. దీనికి గతంలో ఇచ్చిన రూ. 168 కోట్లను మినహాయించుకుంటామని తాజాగా వెల్లడించింది. ప్రాజెక్టుకు గతంలో ఇచ్చిన నిధులపైనా పరిశీలన జరుపుతున్నామని కేంద్రం.. అవి డీపీఆర్‌ పరిధిలోకి వస్తాయా రావా అనే అంశంపైనా లోతుగా విచారిస్తున్నట్టు అధికారులు తెలిపారు.

పోలవరం ప్రాజెక్టుకు ఇప్పటికే ఇచ్చిన నిధుల్లోనూ కేంద్రం కోత పెడుతోంది. విద్యుత్కేంద్రం తవ్వకం పనులకు గతంలో ఇచ్చిన రూ.168 కోట్లు మినహాయించుకుంటామని కేంద్రం తెలిపినట్లు సమాచారం. పోలవరం దగ్గర 960 మెగావాట్ల విద్యుత్ కేంద్రం పనులు సాగుతున్నాయి. దీని నిర్మాణానికి రూ.4,560.91 కోట్లను డీపీఆర్‌ నుంచి ఇప్పటికే మినహాయించినట్లు కేంద్రం పేర్కొంది. విద్యుత్కేంద్రం నిర్మాణ వ్యయాన్ని రాష్ట్రమూ అడగడం లేదు. విద్యుత్ కేంద్రానికి నీటిని మళ్లించేందుకు... అక్కడ అవసరమైన మట్టి తవ్వకం తదితర పనులు సాగుతున్నాయి. వాటికయ్యే వ్యయం ఇవ్వాల్సి ఉంటుందని రాష్ట్రం వాదిస్తోంది.

ఇప్పుడు తాజాగా మట్టి తవ్వకానికి గతంలోనే ఇచ్చిన రూ.168 కోట్లు మినహాయించుకుంటామని కేంద్రం చెబుతోంది. అంతేకాకుండా జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాక ఇచ్చిన ప్రతి పైసాపై కేంద్రం పరిశీలన జరుపుతోంది. 2014 ఏప్రిల్‌ ఒకటి నాటికి ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా సాగునీటి విభాగం కింద రూ.20,398. 61 కోట్లు ఖర్చవుతుందని లెక్క తేల్చింది. అందులో ఏయే విభాగాల కింద ఎంత మొత్తం అవుతుందని లెక్కించి కేంద్ర ఆర్థికశాఖ ఆమోదం తెలిపిందో అంతకుమించి ఒక్క పైసా ఇచ్చేందుకు ససేమిరా అంటోంది. పైగా గతంలో ఆయా విభాగాల కింద ఏయే నిధులు ఇచ్చారు... అవి ఈ డీపీఆర్‌ పరిధిలోకి వస్తాయా రావా అన్న విషయాన్నీ కేంద్రం లోతుగా పరిశీలిస్తోంది.

ఫ‌లితంగా పోల‌వ‌రం ప్రాజెక్టు ప‌నులు మంద‌కొడిగా సాగ‌డ‌మే కాకుండా.. ఇవి ఇప్ప‌ట్లో పూర్త‌య్యేలా క‌నిపించ‌డం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి దీనికి కార‌ణం ఏంటి? ఎవ‌రు? అనే విష‌యాలు ఆస‌క్తిగా మారాయి. గ‌తంలో చంద్ర‌బాబు ప్ర‌భుత్వ హ‌యాంలో పోల‌వ‌రంలో ఏదో జ‌రుగుతోంద‌ని.. నిధులు మింగేస్తున్నార‌ని.. అందుకే కాంట్రాక్ట‌ర్ల‌ను మార్చార‌ని.. పేర్కొంటూ.. అప్ప‌టి విప‌క్షం వైసీపీ కేంద్రానికి లేఖ‌లు రాసింది. దీంతో కేంద్ర ప్ర‌భుత్వం నిధుల్లో కొర్రీ వేయ‌డం ప్రారంభించింది. ప్ర‌తి ప‌నికీ అడ్డు చెప్ప‌డం ప్రారంభించింది. సో.. మొద‌టి బీజం వైసీపీ నుంచే ప‌డింది.

గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్ర‌ధాని నరేంద్ర మోడీ స్వ‌యంగా గుంటూరులో నిర్వ‌హించిన స‌భ‌లో .. పోల‌వ‌రం టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు ఏటీఎంగా మారింద‌న్నారు. దీని ఎఫెక్ట్ పోల‌వ‌రంప బాగానే ప‌డింద‌ని అర్ధ‌మైంది. ఇక‌, రాష్ట్రంలో ప్ర‌భుత్వం మారి.. చంద్ర‌బాబు దిగిపోయి.. జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చారు. అయితే.. గ‌తంలో చేసుకున్న పాప‌మే ఇప్ప‌టికీ పోల‌వ‌రం విష‌యంలో ఆయ‌న‌ను వెంటాడుతుండ‌డం గ‌మ‌నార్హం. ఇప్పుడు తాను ఏం చెప్పినా.. ``గ‌తంలో మీరు ఇలా చెప్పారు. ఇంత మొత్తమే స‌రిపోతుంద‌ని చెప్పారు క‌దా..!`` అంటూ ప్ర‌శ్నిస్తూ.. ఎక్క‌డిక‌క్క‌డ కోత పెడుతుండ‌డం గ‌మ‌నార్హం. సో.. దీనిని బ‌ట్టి.. ఎవ‌రు చేసుకున్న పాపం వారు అనుభ‌విస్తున్నార‌నే సూక్తి నిజ‌మ‌నే అనుకున్నా.. అంతిమంగా అన్న‌దాత‌లు.. ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డుతున్నారు.