Begin typing your search above and press return to search.

షాకిచ్చిన కేంద్రం: కరోనాతో కలిసి బతకాల్సిందేనట.!

By:  Tupaki Desk   |   9 May 2020 9:30 AM GMT
షాకిచ్చిన కేంద్రం: కరోనాతో కలిసి బతకాల్సిందేనట.!
X
కరోనా వైరస్ దేశంలో విస్తరిస్తుండడం.. కట్టడికి విధించిన లాక్ డౌన్ పెద్దగా ప్రయోజనం చేకూర్చకపోవడంతో కేంద్ర ప్రభుత్వంలో నిరాశ నిసృహ వ్యక్తమవుతున్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ జాయింట్ సెక్రెటరీ లవ్ అగర్వాల్ మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో కరోనా కేసుల సంఖ్య 59,662కి చేరిందని.. కరోనా వల్ల దేశంలో ఇప్పటివరకు 1985మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు.

ఈ సందర్భంగా లవ్ అగర్వాల్ మాట్లాడుతూ ‘‘ప్రస్తుత పరిస్థితిని చూస్తుంటే కరోనా వైరస్ నియంత్రణ చర్యలను జీవితంలో ఒక భాగంగా మార్చుకోవాలని.. మన ముందు పెద్ద సవాల్ ఉందని.. కరోనాతో కలిసి జీవించడం నేర్చుకోక తప్పదని’’ సంచలన వ్యాఖ్యలు చేశారు.

దేశవ్యాప్తంగా 216 జిల్లాల్లో ఇప్పటిదాకా కరోనా పాజిటివ్ కేసు ఒక్కటి కూడా నమోదు కాలేదని లవ్ అగర్వాల్ తెలిపారు. 42 జిల్లాల్లో గత 28 రోజులుగా పాజిటివ్ కేసులేవీ నమోదు కాలేదని పేర్కొన్నారు. మరో 29 జిల్లాల్లో గత 21 రోజులుగా కొత్త కేసులు బయటపడలేదన్నారు.

లాక్ డౌన్ మినహాయింపుల నేపథ్యంలో వలస కూలీలు సొంత ప్రాంతాలకు వెళుతున్నారని.. కరోనా విజృంభించే అవకాశాలున్నాయని.. రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని లవ్ అగర్వాల్ తెలిపారు. వలస కూలీల కోసం 222 ప్రత్యేక రైళ్లు నడిపినట్లు తెలిపారు. 2.5 లక్షల మంది సొంత ప్రాంతాలకు వెళ్లారని వివరించారు.

ఇది వరకు ఏపీ సీఎం జగన్ కూడా ఇదే మాట అని లాక్ డౌన్ సడలించాలని.. కరోనాతో కలిసి బతకాల్సిందేనని.. ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలని సూచించారు. అప్పుడు జగన్ ను విమర్శించిన వాళ్లకు ఇప్పుడు కేంద్రం ప్రకటన చెంపపెట్టులా మారింది.