Begin typing your search above and press return to search.

ఈడీ నోటీసులపై ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి షాకింగ్ స్పందన

By:  Tupaki Desk   |   16 Dec 2022 10:30 AM GMT
ఈడీ నోటీసులపై ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి షాకింగ్ స్పందన
X
మూడేళ్ల నాటి బెంగుళూరు డ్రగ్స్ కేసుకు సంబంధించి డిసెంబర్ 19న విచారణ నిమిత్తం తమ ముందు హాజరు కావాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బీఆర్‌ఎస్ పార్టీ తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి నోటీసులు అందజేసింది.

డిసెంబర్ 19న హైదరాబాద్ లో విచారణకు హాజరు కావాలని టాలీవుడ్ నటి రకుల్ ప్రీత్ సింగ్‌కు కూడా ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు.

తనకు అందిన నోటీసులపై రోహిత్ రెడ్డి స్పందించారు. షాకింగ్ కామెంట్స్ చేశారు. డిసెంబర్ 19న ఈడీ ఎదుట హాజరవుతానని, కేంద్ర ఏజెన్సీ నోటీసులోని అంశాలను ధృవీకరిస్తానని చెప్పారు.

కాగా, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తు చేస్తున్న అక్రమాస్తుల కేసుకు సంబంధించి రెండు రోజుల క్రితం రోహిత్ రెడ్డి వాంగ్మూలాన్ని స్థానిక కోర్టు నమోదు చేసింది.

బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే అక్రమాస్తుల కేసులో కోర్టు ముందు వాంగ్మూలం ఇచ్చిన కొద్ది రోజులకే డ్రగ్స్ కేసుకు సంబంధించి ఈడీ నోటీసు అందడం విశేషం. 'నాకు ఈడీ నుంచి నోటీసులు వచ్చాయి. ఇంకా నోటీసులు చూడలేదు. ఏ కేసులో నోటీసులు ఇచ్చారో తెలియదు.

నా బిజినెస్, ఐటీ రిటర్న్స్, కుటుంబ సభ్యుల బ్యాంకు వివరాలు అడిగారు' అని ఆయన తెలిపారు. డ్రగ్స్ కేసులోనే రోహిత్ రెడ్డికి నోటీసులు వచ్చినట్టు తెలుస్తోంది. దీంతో ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు ఇది ప్రతీకారంతో పంపిన నోటీసు అని టీఆర్ఎస్ విమర్శిస్తోంది..

రోహిత్ రెడ్డి ఇద్దరు వ్యాపారవేత్తలు కలహర్ రెడ్డి మరియు సందీప్ రెడ్డితో కలిసి బెంగళూరులో తన స్నేహితుల కోసం నిర్మాత శంకర గౌడ ఏర్పాటు చేసిన పార్టీకి హాజరయ్యారు, ఇందులో డ్రగ్స్ సరఫరా చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. పార్టీలోకి ప్రముఖులు, రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలను శంకర గౌడ ఆహ్వానించారు.

గతంలో డ్రగ్స్ కేసులో బెంగళూరులో ఓ ప్రముఖుడిని గోవిందపురా పోలీసులు అరెస్ట్ చేయగా.. ల్యాండ్ డీలింగ్ కోసం రోహిత్ రెడ్డి పార్టీకి హాజరయ్యారనే ఆరోపణలు వచ్చాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.