Begin typing your search above and press return to search.

ఎన్‌సీఆర్‌బీ షాకింగ్ నివేదిక‌.. ఈ రాష్ట్రాల్లోనే విద్యార్థుల ఆత్మ‌హ‌త్య‌లు!

By:  Tupaki Desk   |   12 Oct 2022 8:40 AM GMT
ఎన్‌సీఆర్‌బీ షాకింగ్ నివేదిక‌.. ఈ రాష్ట్రాల్లోనే విద్యార్థుల ఆత్మ‌హ‌త్య‌లు!
X
నేషనల్క్రైమ్ రికార్డు బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) విద్యార్థుల ఆత్మ‌హ‌త్య‌ల‌కు సంబంధించి సంచ‌ల‌న నివేదిక‌ను విడుద‌ల చేసింది. దేశంలో విద్యార్థుల ఆత్మ‌హ‌త్య‌లు ద‌క్షిణాది రాష్ట్రాల్లోనే జ‌రుగుతున్నాయ‌ని బాంబుపేల్చింది. ఎన్‌సీఆర్‌బీ లెక్కల ప్రకారం.. 2021లో మ‌న‌దేశంలో మొత్తం 1,60,000 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ మొత్తంలో ప్రత్యేకించి విద్యార్థుల సూసైడ్స్ బాగా పెరిగాయి. 2020లో 12,526 విద్యార్థి ఆత్మహత్యలు నమోదు కాగా 2021లో వాటి సంఖ్య13,089కి పెర‌గ‌డం గ‌మ‌నార్హం.

ముఖ్యంగా, 1995 నుంచి 2019 డిసెంబర్‌ 31 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా 1.7 లక్షల మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇక 2014-2021 నివేదిక‌ల ప్ర‌కారం ద‌క్షిణాది రాష్ట్రాల్లో ఏటా స‌గ‌టున 2,900 మంది విద్యార్థులు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటున్నారు. ఎన్‌సీఆర్‌బీ నివేదిక ప్ర‌కారం 2014-2021 మ‌ధ్య‌ తెలంగాణ‌లో 3507, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 3115 ఆత్మ‌హ‌త్య‌లు జ‌రిగాయి.

గతేడాది ఆత్మహత్య చేసుకున్న 13,089 మంది విద్యార్థుల్లో 7,396 మంది పురుషులు, 5,693 మంది మహిళలు ఉండ‌టం గ‌మ‌నార్హం. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులలో అత్య‌ధికంగా 14.0% మంది మహారాష్ట్రలో (1,834), మధ్యప్రదేశ్‌లో 10.0% (1,308), తమిళనాడులో 9.5% (1,246) మంది ఉన్నారు. ఆ త‌ర్వాత‌ 6.5% మందితో కర్ణాటక(855) త‌దిత‌ర రాష్ట్రాలు ఉన్నాయి.

చ‌దువుల్లో పోటీ, ప‌రీక్ష‌ల్లో విఫ‌లం కావ‌డం, జాతీయ స్థాయి ప‌రీక్ష‌ల‌యిన నీట్, జేఈఈల్లో ఫెయిల్ కావ‌డం, లేక‌పోతే ర్యాంకులు సాధించ‌లేక‌పోవ‌డం, ఇత‌ర కుటుంబ స‌మ‌స్య‌లు విద్యార్థుల ఆత్మ‌హ‌త్య‌ల‌కు కార‌ణ‌మ‌ని ఎన్‌సీఆర్‌బీ వెల్ల‌డించింది.

విషం, పురుగుల మందు తాగడం, ఉరేసుకోవడం, రైలు, రోడ్డు ప్రమాదాలు, ఊపిరాడకుండా చేసుకోవడం, నీటిలో దూకడం లాంటి మార్గాల ద్వారా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు.

ఈ నేప‌థ్యంలో త‌ల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్యార్థుల మాన‌సిక స్థితిని గ‌మ‌నిస్తుండాల‌ని.. ఏమాత్రం వారిలో అవాంచిత ల‌క్ష‌ణాలు క‌నిపించినా త‌గిన కౌన్సెలింగ్ ఇవ్వాల‌ని నిపుణులు చెబుతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.