Begin typing your search above and press return to search.

చింత‌ల‌పూడి టీడీపీ ఫాలోయింగ్ చూశారా?

By:  Tupaki Desk   |   31 March 2019 1:05 PM GMT
చింత‌ల‌పూడి టీడీపీ ఫాలోయింగ్ చూశారా?
X
ఏపీలో ఇప్ప‌టి ఎన్నిక‌లు చాలా ప్ర‌త్యేక‌మనే చెప్పాలి. టీడీపీ త‌న చ‌రిత్ర‌లోనే తొలిసారిగా సింగిల్ గానే బ‌రిలోకి దిగిన ఈ ఎన్నిక‌లు... ఆ పార్టీకి చుక్క‌లు చూపించ‌డం ఖాయ‌మ‌నే వాద‌న‌లు వినిపిస్తున్నాయి. ఎంతైనా అధికారంలో ఉన్న పార్టీ క‌దా. అప్పుడే ఓట‌మిని ఒప్పేసుకుంటే ఎలా? అందుకే... ఓట‌మి క‌ళ్లెదుటే క‌నిపిస్తున్నా కూడా టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు... ఈ ఎన్నిక‌ల్లోనూ తామే గెలుస్తున్నామ‌ని, ఈ విజ‌యం వంద‌కు రెండు వంద‌లు కాద‌ని, వంద‌కు వెయ్యి శాతం ప‌క్కా అని మేక‌పోతు గాంభీర్యం ప్ర‌ద‌ర్శిస్తున్నార‌న్న విశ్లేష‌ణ‌లు కూడా క‌నిపిస్తున్నాయి. అవ‌త‌లి వైపు విప‌క్ష నేత‌, వైసీపీ అదినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఎక్క‌డ స‌భ‌లు పెట్టినా... జ‌నం బారుల్లా త‌ర‌లివ‌స్తుంటే... బాబు స‌భ‌లు మాత్రం వెల‌వెల‌బోతున్న వైనం చాలా స్ప‌ష్టంగానే క‌నిపిస్తోంది.

ఇలాంటి నేప‌థ్యంలో టీడీపీ ఓట‌మి ప‌క్కా అని రుజువు చేసేందుకు... ఆ పార్టీకి ద‌క్కుతున్న జ‌నాద‌ర‌ణే నిద‌ర్శ‌న‌మ‌న్న వాద‌న కూడా వినిపిస్తోంది. పైన క‌నిపిస్తున్న దృశ్యం చూస్తే చాలు... టీడీపీకి అనుకూలంగా గాలి వీస్తుందో, వ్య‌తిరేక ప‌వ‌నాలు వీస్తున్నాయో ఇట్టే తేలిపోతుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. టీడీపీకి కంచుకోట‌గా ఉన్న ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోనే ఈ అరుదైన దృశ్యం ఆవిష్కృత‌మేతే... ఇక మిగిలిన జిల్లాల్లో ప‌రిస్థ‌తి ఏమిటో ఇట్టే తేలిపోతుంద‌న్న వాద‌న కూడా వినిపిస్తోంది. ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే.. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా చింతలపూడి టీడీపీ అభ్యర్ధి కర్రా రాజారావుకు ఆదివారం వింత అనుభవం ఎదురైంది.

జంగారెడ్డిగూడెం మండలం ఏ. పోలవరంలో కర్రా రాజారావు రోడ్ షో నిర్వహించగా ఒక్కరంటే ఒక్కరు కూడా రోడ్డుపై కనిపించలేదు. మరోవైపు ఆయన వెంట కూడా ప్రచారంలో ఇద్దరు ముగ్గురు అనుచరులే ఉండటం టీడీపీ దుస్ధితిని తెలియజేస్తోంది. రోడ్ పై ఒక్కరు లేకపోయినా కూడా కర్రా రాజారావు మాత్రం ఖాళీ రోడ్డు‌, గోడలకు దండం పెడుతూ.. తనకు, ఎంపీగా మాగంటి బాబుకి‌ ఓటు వేయాలని చెప్పుకు పోవడం.. ఆయన వెంట జీపులో ఉన్న ఇద్దరు అనుచరులకి‌ కూడా ఆశ్చర్యం‌ కలిగించింది. కనీసం తెలుగుదేశం కార్యకర్తలు కూడా లేకుండా చింతలపూడి నియోజకవర్గంలో రోడ్ షో జరుగుతున్న తీరు వారి‌ ఓటమికి సంకేతాలని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.