Begin typing your search above and press return to search.

పాప పుడుతుందని.. డెలివరీ ముందు రోజు సూసైడ్

By:  Tupaki Desk   |   7 Jan 2022 9:30 AM GMT
పాప పుడుతుందని.. డెలివరీ ముందు రోజు సూసైడ్
X
కాలం మారినా కొంతమంది అస్సలు మారరు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అమ్మాయి.. అబ్బాయి అన్న తేడా లేదు. ఆ మాటకు వస్తే కొన్ని కుటుంబాల వారు.. తమకు అమ్మాయే పుట్టాలని కలలు కనేవారున్నారు. తమ ఇంట్లో అమ్మాయి పుడితే పండుగ చేస్తున్న వారు లేకపోలేదు. ఇలాంటిరోజుల్లో తనకు మళ్లీ అమ్మాయి పుడుతుందన్న ఉద్దేశంతో ఒక తల్లి ఘోరమైన తప్పు చేసింది. తన ప్రాణాల్ని తానే తీసుకుంది. తీరా చూస్తే.. గర్భంలో ఉన్నది మగ శిశువు అన్న విషయం తేలేసరికి ఆ అమ్మ మాత్రం ప్రాణాలతో లేకుండా పోయింది. దేవుడి స్క్రిప్టును చదవకుండా.. అమాయకత్వంతో తీసుకున్న ఆమె నిర్ణయం.. చంటి పిల్లలకు తల్లి లేకుండా చేసింది. అయ్యో అనిపించే ఈ విషాదంలోకి వెళితే..
మంచిర్యాల జిల్లాలోని నర్సాపూర్ కు చెంది 26 రమ్యకు 2017లో అనంద్ అనే యువకుడికి ఇచ్చి పెళ్లి చేశారు. వారికో పాప ఉంది. రెండేళ్ల వయసు. ఈ మధ్యనే రమ్య మరోసారి గర్భం దాల్చింది. తొమ్మిది నెలల గర్భిణి అయిన రమ్యకు జనవరి 6న డెలివరీ డేట్ ఇచ్చారు. తెల్లారితే తనకు డెలివరీ అని.. తనకు ఆడపిల్ల పుడితే ఇబ్బందులు తప్పవని భావించిన ఆమె.. బుధవారం రాత్రి.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుంది.

ఆమెను ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోస్టు మార్టంలో ఆమె గర్భం నుంచి మరణించిన మగ శిశువును వైద్యులు గుర్తించారు. తనకు ఆడ పిల్ల పుడుతుందని తప్పుడు సమాచారంతో ఆమె ఈ పని చేసిందని రమ్య తల్లిదండ్రులు విలపిస్తున్నారు. అయినా.. ఇప్పటి రోజుల్లో అమ్మాయి.. అబ్బాయి అన్న తేడా ఎక్కడ ఉంది? తాను కోరుకున్నట్లు దేవుడు మగ బిడ్డను ఇచ్చినా.. ఆయన స్క్రిప్టును చదవటంలో ఫెయిల్ కావటమే కాదు.. తన విలువైన జీవితాన్ని ఫెయిల్ చేసుకుంది. అభంశుభం తెలీని తన రెండేళ్ల కుమార్తెకు తల్లి లేకుండా చేసింది. ఎందుకమ్మా.. ఇలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు?