Begin typing your search above and press return to search.

తిరుపతిలో షాకింగ్ సీన్.. థర్డ్ వేవ్ వేళ.. రాత్రివేళ ఇంత భారీ క్యూలా?

By:  Tupaki Desk   |   10 Jan 2022 3:27 AM GMT
తిరుపతిలో షాకింగ్ సీన్.. థర్డ్ వేవ్ వేళ.. రాత్రివేళ ఇంత భారీ క్యూలా?
X
ఆదివారం రాత్రి.. తిరుపతి వీధుల్లో నెలకొన్న రద్దీని చూసినోళ్లు ఎవరైనా సరే.. ముక్కున వేలేసుకోవాల్సిందే. ఒకవైపు థర్డ్ వేవ్ ఎంట్రీ ఇచ్చేసి.. కరోనా కేసులు అదే పనిగా పెరిగిపోతున్న వేళ.. దాని బారిన పడకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వాలు అదే పనిగా చెబుతున్నా.. అందుకు భిన్నంగా ప్రజల ప్రయారిటీలు చూస్తే.. నవ్వాలో ఏడవాలో అర్థం కాదు. తిరుపతిలో నివసించే స్థానికుల కోసం సోమవారం ఉదయం తిరుమల శ్రీవారి దర్శనానికి సర్వ దర్శనం టికెట్లను జారీ చేస్తామని టీటీడీ పేర్కొంది.

దీని కోసం తిరుపతి పట్టణంలోని ఐదు ప్రాంతాల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. తిరుపతిలోని రామచంద్ర పుష్కరిణి.. బైరాగపట్టడి.. ఎమ్మార్ పల్లి.. మన్సిపల్ కార్యాలయం.. సత్యానరాయణ పురం ప్రభుత్వ స్కూల్ లో సర్వదర్శనం టోకెన్ల పంపిణీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. సోమవారం ఉదయం 9 గంటల వేళలో ఈ టోకెన్లను జారీ చేస్తారు

ఈ టోకెన్లను సొంతం చేసుకోవటం కోసం తిరుపతి ప్రజలు వీధుల్లోకి వచ్చారు. ఆదివారం రాత్రి నుంచే.. టోకెన్ సెంటర్లకు వేలాదిగి వచ్చిన వారు.. క్యూలో నిలుచున్నారు. అంటే..సోమవారం ఉదయం 9 గంటలకు ఇచ్చే స్వామివారి దర్శనం టోకెన్ల కోసం.. ఆదివారం రాత్రి 9 గంటల నుంచే క్యూలైన్లు భారీగా షురూ కావటంతో.. ఆయా వీధులన్ని జనసంద్రంతో నిండిపోయాయి. వేలాది మంది రోడ్ల మీదకు వచ్చి.. ఆధార్ కార్డులతో బారులు తీరిన వైనం చూస్తే.. కరోనా థర్డ్ వేవ్ వేళలో.. స్వామి వారి దర్శనం కోసం ఇంతలా తపించటమా? అన్న సందేహం రాక మానదు.

తిరుపతి స్థానికులకు రోజుకు ఐదు వేల చొప్పున మొత్తం పది రోజులకు 50 వేల టికెట్లనుజారీ చేయనున్నారు. వీటిని సొంతం చేసుకోవటం కోసం వేలాది మంది వీధుల్లోకి రావటంతో.. ఆయా ప్రాంతాలన్ని జనంతో కిటకిటలాడుతున్నాయి. కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉందన్న వేళ.. భౌతిక దూరం లాంటి వాటిని పట్టించుకోకుండా.. స్వామి వారి దర్శనం కోసం ప్రజలు పోటీ పడుతున్న వైనం చూస్తే.. ముప్పు ముంచుకు రావటం ఖాయమన్న భావన కలుగుతోంది. స్వామి మీద ఉన్న భక్తితో ఊగిపోతున్న వీరందరిని.. శ్రీవారే కాపాడాలి.