Begin typing your search above and press return to search.

షాకింగ్ నిజం.. ఆకలితో సెకనుకు 4 చనిపోతున్నారట

By:  Tupaki Desk   |   21 Sep 2022 1:30 PM GMT
షాకింగ్ నిజం.. ఆకలితో సెకనుకు 4 చనిపోతున్నారట
X
మనిషి ఎదుగుతున్నాడు. అంతకంతకూ ముందుకు వెళుతున్నాడు. ఇలాంటివేళలోనూ ఆకలితో తననువు చాలిస్తున్న దారుణమైన రోజులు మన చుట్టూ ఉన్నాయా? అంటే అవునన్న మాట వినిపిస్తోంది.

ప్రపంచ వ్యాప్తంగా 45 దేశాల్లోని 34.5 కోట్ల మంది ప్రజలు తీవ్రమైన ఆకలితో ఇబ్బందిపడుతున్నట్లుగా తాజాగా విడుదలైన ఒక నివేదిక స్పష్టం చేస్తోంది. ఒక లెక్క ప్రకారం ప్రతి సెకనుకు కేవలం ఆకలి సమస్యతో నలుగురు మరణిస్తున్న దారుణం నెలకొందన్న విషయం వెల్లడైంది.

కరోనా ముందు నమోదైన ఆకలి చావులతో పోలిస్తే.. ఇప్పుడు రెట్టింపు అయినట్లుగా ఈ నివేదిక వెల్లడిస్తోంది. 75 దేశాలకు చెందిన ఆక్స్ ఫామ్.. సేవ్ ది చిల్డ్రన్.. ప్లాన్ ఇంటర్నేషనల్ వంటి 238 స్వచ్ఛంద సంస్థలు కలిసి తాజాగా ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ సమావేశాలకు హాజరయ్యే ప్రపంచ నేతలకు ఒక లేఖ రాశాయి. అందులో ఆకలి కారణంగా చనిపోతున్న వారికి సంబంధించిన షాకింగ్ అంశాల్ని వారి ముందుకు తీసుకెళ్లారు.

ఒక అంచనా ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ఆకలి కారణంగా రోజుకు 19700 మంది మరణిస్తున్నారని తేల్చారు. 2019తో పోలిస్తే తాజాగా ఆకలి చావులు రెట్టింపు అయినట్లుగా పేర్కొన్నారు. 21వ శతాబ్దంలో కరువు పరిస్థితులను రానివ్వమని ప్రపంచ దేశాల నేతలు ప్రతిన పూనినప్పటికీ సోమాలియాలో ఈసారి తీవ్రమైన కరువు తాండవిస్తోంది. 45 దేశాల్లోని మరో ఐదు కోట్ల మంది ప్రజలు కరువుకు చేరువలో ఉన్నట్లుగా ఈ ప్రకటన పేర్కొంది.

ఆకలి చావులు అన్నవి కేవలం ఒక దేశానికో.. ఒక ఖండానికో కాదు.. మొత్తం మానవాళికే జరుగుతున్న అన్యాయంగా అభివర్ణిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా కరువు గురించి మాట్లాడుకోవాల్సి రావటం దారుణమని.. సిగ్గు పడాల్సిన విషయంగా పేర్కొన్నారు.

ప్రజల ప్రాణాల్ని రక్షించేందుకు తక్షణమే ఆహారంతో పాటు దీర్ఘకాలం పాటు వారికి సాయం కొనసాగించే విషయంలో ఏ మాత్రం లేట్ చేయకూడదన్న మాట వినిపిస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.