Begin typing your search above and press return to search.

కరోనా వైరస్ పై షాకింగ్ నిజం బయటకు

By:  Tupaki Desk   |   17 April 2020 4:45 AM GMT
కరోనా వైరస్ పై షాకింగ్ నిజం బయటకు
X
కరోనా వైరస్ పుట్టింది చైనాలోనే అయినా.. దాని మరణం మాత్రం వేడిలోనే అన్న మాట చాలా వేగంగా విస్తరించింది. చైనాలో టెంపరేచర్ తక్కువగా ఉండటం కారణంగా వైరస్ విశ్వరూపాన్ని చూపించిందని.. భారత్ లాంటి ఉష్ణదేశాల్లో అంత సినిమా ఉండదన్న మాట పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. ఈ విషయాన్ని ప్రముఖుల మొదలు సామాన్యుల వరకూ ఒకటే థియరీని వినిపించారు.

భారత్ లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదు అవుతాయి కాబట్టి కరోనా తన ప్రభావాన్ని చూపించలేదన్న మాటలో ఏ మాత్రం నిజం లేదన్న విషయంపై ఆ మధ్యన పలు అధ్యయనాలు వెల్లడించినా.. ప్రజల్లోకి వెళ్లలేదు. ఇదిలా ఉంటే..తాజాగా ఫ్రాన్స్ లోని ఎయిక్స్ మార్సెల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ రెమీ చారెల్ షాకింగ్ మాటను చెప్పుకొచ్చారు.

కరోనా వైరస్ ను నిర్వీర్యం కావాలంటే 92 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత కంటే ఎక్కువ అయితేనే నిర్మూలించేందుకు సాధ్యమవుతుందని చెప్పుకొచ్చారు. 92 డిగ్రీల సెంటిగ్రేడ్ లోనూ ఆ వైరస్ బతికే ఉంటుందని.. 60 డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద కూడా వ్యాప్తి చెందుతుందని స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూను ఒక ప్రముఖ మీడియా సంస్థ ప్రచురించింది.

కరోనా వైరస్ 92 డిగ్రీల సెల్సియస్ లోనూ 15 నిమిషాల పాటు బతుకుతుందని తమ పరిశోధనల్లో తేలిందని ఆయన చెప్పారు. 56 డిగ్రీల నుంచి 60 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఈ వైరస్ ను దాదాపు గంటపాటు ఉంచామని.. వైరల్ కౌంట్ తగ్గిందే తప్పించి.. వ్యాప్తి చెందే శక్తిని మాత్రం కోల్పోని విషయాన్ని తాము గుర్తించామన్నారు. ప్రయోగశాలల్లో పలు రకాల పరీక్షలు జరిపి ఈ విషయాన్ని గుర్తించామని చెప్పారు

ఈ మాయదారి వైరస్ కు అవసరమైన ప్రోటీన్ ఇచ్చి ఒకసారి.. ఇవ్వకుండా ఒకసారి పరీక్షలు జరిపామని.. 92 డిగ్రీల సెల్సియస్ వరకు ఇది బతికి బట్టకట్టే అవకాశం ఉందన్న విషయాన్ని గుర్తించినట్లు తెలిపారు. వైరస్ లు మనం అనుకున్నంత బలహీనమైనవి కావని.. పరిస్థితులకు అనుగుణంగా మార్పు చెందుతుంటాయన్నారు. ఎక్కువ ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండే భారత్ లాంటి దేశాల్లో వ్యాప్తి తగ్గుతుందా? అంటే మాత్రం సమాధానం చెప్పటం అసాధ్యమని చెప్పటం గమనార్హం. సో.. అధిక వేడిలో కరోనా చచ్చి పోతుందన్న మాటలో నిజం ఎంతో ఇప్పటికైనా అర్థమైందా?