Begin typing your search above and press return to search.

కొత్త షాక్: వాయుసేన స్థావరంపై డ్రోన్ దాడి పాక్ నుంచి కాదు జమ్ము నుంచే!

By:  Tupaki Desk   |   16 Aug 2021 3:52 AM GMT
కొత్త షాక్: వాయుసేన స్థావరంపై డ్రోన్ దాడి పాక్ నుంచి కాదు జమ్ము నుంచే!
X
సుమారు యాభై రోజుల క్రితం (సరిగ్గా చెప్పాలంటే జూన్ 27 రాత్రి) ఇండియన్ ఎయిర్ ఫోర్సు స్థావరంపై డ్రోన్ దాడి జరగటం తెలిసిందే. సంచలనంగా మారిన ఈ ఉదంతానికి సంబంధించి.. దాడికి పాల్పడిన డ్రోన్ పాక్ నుంచి వచ్చినట్లుగా వార్తా కథనాలు వచ్చాయి. అయితే.. అందులో నిజం లేదంటూ సండే గార్డియన్ సంచలన కథనాన్ని ప్రచురించింది. దీనికి సంబంధించిన నివేదిక తాజాగా హోంశాఖకు చేరినట్లుగా వెల్లడించింది. అంతేకాదు.. ఈ కథనంలో షాకింగ్ అంశం ఏమంటే.. దాడికి ఉపయోగించిన డ్రోన్ పాక్ భూభాగం నుంచి రాలేదని.. జమ్ము నుంచే దాన్ని ఆపరేట్ చేసినట్లుగా గుర్తించినట్లుగా తెలిపింది.

తాము సేకరించిన సమాచారంపై స్పందించేందుకు అధికారులు సిద్ధం లేదరని సండే గార్డియన్ వెల్లడించింది. పాకిస్థాన్ కు పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉండే వాయుసేన స్థావరం భారత్ కు వ్యూహాత్మకమైనది. ఇందులో విమానాలు.. హెలికాఫ్టర్లను భద్రపరిచే గోదాము ఉంటుంది. ఇందులో పేలుడు పదార్థాల్ని జారవిడవటం సంచలనమైంది. ఈ గోదాములో ఎంఐ17 హెలికాఫ్టర్లను.. రవాణా విమానాలను ఇక్కడికి దగ్గర్లో భద్రపరుస్తారు.

తొలుత ఈ దాడికి ప్రయోగించిన డ్రోన్ పాక్ నుంచి వచ్చినట్లుగా అనుమానించారు. కానీ.. దర్యాప్తు ముందుకు వెళుతున్నకొద్దీ ఈ డ్రోన్ ను జమ్ములో నివాసం ఉండే వారే ప్రయోగించి ఉంటారని గుర్తించారు. ఈ ఉదంతం తర్వాత.. డ్రోన్ నుంచి ఎదురయ్యే ముప్పు మీద భారత్ కొత్తగా ఆలోచించటం షురూ చేసింది.

అనుమానిత డ్రోన్ల జాడల్ని గుర్తించేందుకు వీలుగా యాంటీ డ్రోన్ ఆయుధాల్ని సిద్ధం చేయటంతో పాటు.. డ్రోన్ లను గుర్తించి వాటిని కంట్రోల్ చేసేందుకు వీలుగా తయారు చేసే వ్యవస్థను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన ప్రచారానికి భిన్నంగా.. డ్రోన్ దాడి భారత భూభాగం నుంచే జరిగినట్లుగా చెబుతున్ననేపథ్యంలో..దీని వెనుక ఉన్నదెవరు? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారిందంటున్నారు.