Begin typing your search above and press return to search.

రైత‌న్న రాజ్యంలో రైతులు మ‌ట్టి అమ్ముకోవ‌డ‌మేనా?

By:  Tupaki Desk   |   10 April 2021 1:30 PM GMT
రైత‌న్న రాజ్యంలో రైతులు మ‌ట్టి అమ్ముకోవ‌డ‌మేనా?
X
`జై కిసాన్‌`- అన్న స్ఫూర్తి దేశంలో కేవ‌లం చెప్పుకొనేందుకు మాత్ర‌మే మిగుల‌తోందా? గతంలో ప్ర‌ముఖ ర‌చ‌యిత‌ అన్న‌ట్టు.. `రైతు నాగ‌లి మోస్తున్నాడు.. ఏసు శిలువ మోసిన‌ట్టు`గానే దేశంలో రైత‌న్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఏటికేడు పెరుగుతున్న ఖ‌ర్చులు.. రైతుల‌ను నిలువునా ముంచేస్తుంటే.. మ‌రోవైపు... గిట్టుబాటు ధ‌ర‌లు ల‌భించ‌ని ప‌రిస్థితి వారి ఉసురు తీస్తున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో దేశంలోని రైతుల‌కు జ‌రుగుతున్న మేలేంటి? అనేది ప్ర‌ధాన ప్ర‌శ్న‌. కానీ, ప్ర‌భుత్వాల తీరును గ‌మ‌నిస్తే.. మాత్రం మేం ఉన్నది రైతుల కోసం.. మేం ఏం చేసినా. రైతుల కోసం! అన్న విధంగానే ఉంది ప‌రిస్థితి!!

ప్ర‌స్తుతం కేంద్రాన్ని తీసుకున్నా.. రెండు తెలుగు రాష్ట్రాల‌ను తీసుకున్నా.. రైతు జ‌ప‌మే చేస్తున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారు, తెలంగాణ‌లోని కేసీఆర్ స‌ర్కారు, ఏపీలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం కూడా రైతుల‌కు ఎంతో చేస్తున్న‌ట్టు చెబుతున్నాయి. రైతుల‌కు తాము పెద్ద ఎత్తున నిధులు కుమ్మ‌రిస్తున్నామ‌ని చెప్పుకొంటున్న ప‌రిస్థితి ఉంది. ఏడాదికి మూడు విడత‌ల్లో మోడీ.. 6 వేలు, కేసీఆర్ రైతు బంధు ప‌థ‌కం కింద ఎక‌రాకు రూ.5వేలు, జ‌గ‌న్ ఏకంగా రూ.6500 ఇస్తున్నారు. దీంతో రైతుల‌కు తాము త‌ప్ప ఇంత‌గా ఎవ‌రూ ఏమీ చేయ‌లేదు.. అని చెప్పుకొంటున్నారు.

కానీ, అల‌సు విష‌యానికి వ‌స్తే.. మాత్రం రైతుల‌కు కావాల్సింది ఏంటి? కేవ‌లం డ‌బ్బు విదిలించి వ‌దిలేస్తే.. వారికి `మేళ్లు` జ‌రిగిపోతాయా? అనేది ప్ర‌ధాన ప్ర‌శ్న‌. వాస్త‌వ ప‌రిస్థితిని గ‌మ‌నిస్తే.. రైతుల‌కు తాము పండించిన పంట‌ల‌కు గిట్టుబాటు ధ‌ర‌లు ద‌క్క‌డం లేదు. దుక్కి దున్న‌డం నుంచి విత్త‌నం వ‌ర‌కు.. అనేక రూపాల్లో ధ‌ర‌లు మండిపోతున్నాయి. రైతు కూలీల ధ‌ర‌లు పెరిగిపోయాయి. కానీ, రైతుల‌కు ఆరు గాలం శ్ర‌మించినా.. ప‌ట్టుమ‌ని ప‌ది వేలు కూడా ద‌క్క‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది.

ఇక‌,, ఇప్పుడు మ‌రో పిడుగులాంటి వార్త దేశ‌వ్యాప్తంగా అన్న‌దాత‌ల‌ను బెంబేలెత్తిస్తోంది. వ‌చ్చే వ‌ర్షాకాలం నాటికి ఎరువుల ధ‌ర‌లు 58శాతం పెరుగుతున్నాయ‌ని తెలుస్తోంది మ‌రి ఇంత ఎత్తున ధ‌ర‌లు పెరుగుతున్నా.. వారి పంట‌ల‌కు మాత్రం ధ‌ర‌లు పెర‌గ‌డం లేదు. దీంతో తాము ఇక పండించ‌లేమ‌ని.. అవ‌స‌ర‌మైతే.. పొలాల‌ను బీడు పెట్టుకునేందుకు అయినా సిద్ధ‌మేన‌ని రైతులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. మ‌రోవైపు ప్ర‌భుత్వాల వాద‌న మ‌రో విధంగా ఉంది. క‌రోనా కార‌ణంగా త‌మ ఆదాయాలు త‌గ్గాయి కాబ‌ట్టి `ఈ మాత్రం` ధ‌ర‌లు పెంచామ‌ని చెబుతున్నాయి.

జీఎస్టీ రాబ‌డి త‌గ్గింద‌ని.. కాబ‌ట్టి మేం ధ‌ర‌లు పెంచుతున్నామ‌ని కేంద్రం చెబుతోంది. దీంతో ఇక‌, రాష్ట్రాలు కూడా బాదుడుకు రెడీ అయ్యాయి.అయితే.. ఈ పెంపును స‌మ‌ర్ధించేందుకు ప్ర‌భుత్వాలు మ‌రో వాద‌న తెస్తున్నాయి. పెట్రోల్ ధ‌ర‌లు పెర‌గ‌డంతో ర‌వాణా చార్జీలు పెరిగాయ‌ని.. అందుకే ఎరువుల ధ‌ర‌లు పెరిగాయ‌ని అంటున్నాయి. కానీ, ప్ర‌భుత్వాలు ఎన్ని చెప్పినా.. రైతులు మాత్రం ఇంత పెద్ద ఎత్తున ధ‌ర‌లు పెరిగితే.. తాము వ్య‌వ‌సాయం చేయ‌లేమ‌ని అన్న‌దాత‌లు తెగేసి చెబుతున్నారు. ఇలా అయితే.. తాము పంట‌లు అమ్ముకోవ‌డం మానేసి.. మ‌ట్టిని అమ్ముకోవాల్సి ఉంటుంద‌ని అంటున్నారు. అంతేకాదు.. వ్య‌వ‌సాయ ఆధారిత దేశంలో అన్న‌దాత‌ల ఉసురు త‌గిలితే.. ప్ర‌భుత్వాలు నిల‌బ‌డ‌వ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. మ‌రి ఇప్ప‌టికైనా ప్ర‌భుత్వాలు రైతుల ఆవేద‌న‌ను గ‌మ‌నిస్తాయో.. లేదో చూడాలి.