Begin typing your search above and press return to search.

దీదీకి కొత్త గండం.. సీఎం పదవికి రాజీనామా చేయక తప్పదా?

By:  Tupaki Desk   |   4 July 2021 3:40 AM GMT
దీదీకి కొత్త గండం.. సీఎం పదవికి రాజీనామా చేయక తప్పదా?
X
రాజకీయాల్లో అన్ని ఓపెన్ గా జరగవు. ఎక్కడో ఏదో జరుగుతుంది. కానీ.. దాని కనెక్షన్ మాత్రం వేరే ఉంటుంది. ఇప్పుడు అందరి చూపు పడిన ఉత్తరాఖండ్ లో చోటు చేసుకున్న పరిణామం.. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రికి ఫ్యూచర్ ఏమిటో చెప్పకనే చెప్పిన వైనమా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీరథ్ సింగ్ రావత్ రాజీనామా చేయటం ద్వారా.. రానున్న రోజుల్లో మమత సైతం ఇలాంటి పరిస్థితి తప్పదన్న సంకేతాన్ని కేంద్రం ఇచ్చిందా? అన్న చర్చ మొదలైంది.

ఇటీవల ముగిసిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మమత అధ్యక్షతన నడిచే టీఎంసీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆపరేషన్ సక్సెస్.. పేషెంట్ డెడ్ అన్న రీతిలో 200 ప్లస్ సీట్లను సొంతం చేసుకున్న దీదీ.. తాను స్వయంగా పోటీ చేసిన నందిగ్రామ్ లో పరాజయం పాలయ్యారు. హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకున్నా.. దాన్ని ఎంజాయ్ చేయలేని పరిస్థితిలో మమత ఉండిపోయారు. నిజానికి దీదీకి మాత్రమే కాదు.. ఆమె పార్టీ నేతలకు ఇలాంటి పరిస్థితే ఎదురైంది.

అదే సమయంలో.. దీదీ ప్రత్యర్థి బీజేపీకి బెంగాల్ ఎన్నికల్లో మిగిలిన ఏకైక ఊరట ఏమంటే.. మమతను ఓడించటం. ఆమె పార్టీని ఓడించలేకపోయినా.. ఆమె పోటీ చేసిన స్థానంలో పరాజయం పాలయ్యేలా చేయటాన్ని.. బెంగాల్ లో గెలిచామన్న చందంగా ఫీల్ కావటం కనిపించింది. ఎమ్మెల్యే కాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని చేపడితే.. ఆర్నెల్ల వ్యవధిలో ప్రజాప్రతినిధిగా గెలివాల్సి ఉంటుంది. ఈ నిబందనను తూచా తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. ఇదే అంశాన్ని గుర్తు చేసేలా తాజాగా ఉత్తరాఖండ్ పరిణామం చోటు చేసుకుందని చెప్పాలి. ఎమ్మెల్యేగా గెలవని తీరథ్ సింగ్ రావత్ ను సీఎంగా చేసిన బీజేపీ.. ఆయన్ను తాజాగా పదవి నుంచి దించేయటం తెలిసిందే.

బెంగాల్ లో జరిగిన ఎన్నికల ప్రకారం చూస్తే.. దీదీకి ఎమ్మెల్యే అయ్యేందుకు ఈ ఏడాది నవంబరు వరకు అవకాశం ఉంది. ఆమె బెంగాల్ ముఖ్యమంత్రిగా మే నాలుగున ప్రమాణ స్వీకారం చేపట్టారు. ఆర్నెల్లు అవకాశం ఉండటంతో నవంబరు వరకు ఆమె సీఎం పదవిలో కొనసాగే వీలుంది. అయితే.. ఈ లోపు ఎన్నికల్లో ఆమె ఎమ్మెల్యేగా విజయం సాధించాల్సి ఉంటుంది. కరోనా పుణ్యమా అని.. రానున్న రెండు నెలల వ్యవధిలో ఉప ఎన్నికల్ని నిర్వహించే వీల్లేదన్న మాట వినిపిస్తోంది.

అదే సమయంలో ఈ ఏడాది ఆగస్టు.. సెప్టెంబరులో మూడో వేవ్ మొదలవుతుందన్న అంచనాలు ఉన్నాయి. అదే జరిగితే.. ఎన్నిక కావటానికి తుది గడువైన సెప్టెంబరులో కరోనా తీవ్రత ఎక్కువగా ఉండే వీలుంది. అలాంటివేళలో ఉప ఎన్నికను ఎట్టి పరిస్థితుల్లో కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించే వీల్లేదు. అదే జరిగితే.. ముఖ్యమంత్రి పదవికి మమత రాజీనామా చేసి.. తన స్థానంలో మరొకరిని కూర్చోబెట్టాల్సిన పరిస్థితి.

అయితే.. ఇదంతా తాత్కాలికమే అవుతుంది. ఎందుకంటే.. డిసెంబరు నాటికి మూడో వేవ్ నుంచి బయటపడతామని.. జనవరి.. ఫిబ్రవరిలో జరిగే ఎన్నికల్లో పోటీ చేసి గెలవటం ద్వారా.. మళ్లీ సీఎం కుర్చీలో కూర్చునే వీలుందన్న మాట వినిపిస్తోంది. అంతవరకు వెళ్లకుండా ఆమెకున్న గడువు లోపలే ఉప ఎన్నిక జరిగితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. అందుకు భిన్నంగా జరిగితే మాత్రం సీఎం కుర్చీని దీదీ వదిలేయాల్సి ఉంటుంది.