Begin typing your search above and press return to search.

ప్రియాంకను ఎత్తటం కోసం రాహుల్ కు తగ్గించాలా పీకే?

By:  Tupaki Desk   |   18 Oct 2021 3:28 AM GMT
ప్రియాంకను ఎత్తటం కోసం రాహుల్ కు తగ్గించాలా పీకే?
X
ఎన్నికల వ్యూహకర్తగా దేశ వ్యాప్తంగా మంచి పేరున్న ప్రశాంత్ కిశోర్ కు ఉన్న ఇమేజ్ అంతా ఇంతా కాదు. ఆయన సేవల్ని పొందేందుకు పలు పార్టీల అధినేతలు ఆసక్తిని చూపిస్తుంటారు. అయినప్పటికీ.. ఆచితూచి అన్నట్లుగా ఆయన వ్యవహరిస్తారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పటమే కాదు.. రాహుల్ ను ప్రధానమంత్రిని చేయాలన్న అభిలాషను ఆయన దాచిపెట్టుకోలేదు. ఇంతలో ఏమైందో ఏమో కానీ.. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు షాకింగ్ గా మారాయి.

కాంగ్రెస్ అధినేత్రి సోనియా ఇంట్లో ‘పవర్ పోరు’ సాగుతుందా? అన్న సందేహానికి తెర తీసేలా పీకే వ్యాఖ్యలు ఉండటం గమనార్హం. తాజాగా ఒక టీవీ చానల్ తో మాట్లాడిన సందర్భంగా రాహుల్.. ప్రియాంకల మీద ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. సోదరి ప్రియాంకా గాంధీ శక్తి సామర్థ్యాలను చూసి రాహుల్ భయపడుతున్నారని పేర్కొన్నారు. వాస్తవానికి 2017లో యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్థిగా ప్రియాంకను ప్రకటించాల్సి ఉందని.. అలా జరగకపోవటానికి కారణం రాహుల్ భయమేనని చెప్పారు.

ప్రియాంక అచ్చం తన నానమ్మ మాదిరే ఉంటారని.. దేశ మాజీ ప్రధాని ఇందిరా గాంధీలా ఉంటారని.. ఆమెలో బలమైన నాయకత్వ లక్షణాలు ఉన్నాయని.. రాహుల్ ను తొలిసారి తాను పాట్నాలో కలిసినట్లు చెప్పారు. అప్పుడే తనను కాంగ్రెస్ కోసం పని చేయాలని కోరినట్లు చెప్పారు. ఉత్తి పుణ్యానికే మాట్లాడే రకంగా కాదు పీకే. అలాంటిది తాను సేవలు అందించే పార్టీకి సంబంధించిన ఇంటి గుట్టును రట్టు చేయటంలోనూ ఏదైనా వ్యూహం ఉందా? అన్నది ప్రశ్న. రాహుల్ ఇమేజ్ కంటే ప్రియాంక ఇమేజ్ ను బిల్డ్ చేయాలన్న లక్ష్యంతో.. తాజా ఎపిసోడ్ ను పీకే షురూ చేశారా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారిందని చెప్పక తప్పదు.