Begin typing your search above and press return to search.

తాజాగా ఏపీ హైకోర్టులో దాఖలైన పిటిషన్ తో జగన్ సర్కారుకు షాక్ తప్పదా?

By:  Tupaki Desk   |   23 April 2022 3:29 AM GMT
తాజాగా ఏపీ హైకోర్టులో దాఖలైన పిటిషన్ తో జగన్ సర్కారుకు షాక్ తప్పదా?
X
అదేమీ హైకోర్టు తీర్పు కాదు. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఇచ్చే ఆదేశానికి ఎంతటి సంచలనంగా ఉంటుందో.. ఇప్పుడు అలాంటి హైప్.. తాజాగా హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ తో ఉండటం గమనార్హం. దీనికి కారణం.. పిటీషన్ లో ఉన్న అంశాలే అని చెబుతున్నారు. ఏపీ రాజధాని అమరావతిపై దాఖలైన పిటీషన్లలో ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు జగన్ సర్కారుకు ఎంతటి ఇబ్బందిగా మారిందో తెలిసిందే. తాజాగా దానికి అనుబంధంగా దాఖలైన పిటీషన్ తో జగన్ సర్కారుకు కొత్త తలనొప్పి ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఏపీ రాజధాని అమరావతి నిర్మాణ పనులు ప్రారంభించాలని హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును ఉద్దేశపూర్వకంగా అమలు చేయలేదని.. ఇందుకు బాధ్యులైన అధికారులు.. ప్రభుత్వ పెద్దలను శిక్షించాలని కోరుతూ కోర్టు ధిక్కరణ వ్యాజ్యం దాఖలైంది. ఇది సంచలనంగా మారింది. తాజా హాట్ టాపిక్ కావటానికి కారణం.. ఈ వ్యాజ్యంలోని అంశాలేనని చెబుతున్నారు. జగన్ సర్కారు ఇరుకున పడటానికి అవసరమైన అన్ని అంశాలు ఈ పిటీషన్ లో ఉన్నట్లు చెబుతున్నారు.

రాజధాని అమరావతిని నిర్మించాలని.. రాజధాని నగరం రాజధాని ప్రాంతంలో కనీస అవసరాలైన రోడ్లు.. తాగునీరు.. డ్రైనేజీ.. విద్యుత్ తదితర మౌలిక సదుపాయాలను నెల రోజుల్లో పూర్తి చేయాలని పేర్కొంటూ మార్చి 3న హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం తీర్పును ఇవ్వటం తెలిసిందే. అంతేకాదు.. ఇదే తీర్పులో భూసమీకరణలో భాగంగా రైతులతో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఆరునెలల్లో అమరావతి రాజధాని నగరాన్ని నిర్మించాలని.. రాజధాని ప్రాంతాన్ని డెవలప్ చేయాలని తేల్చింది. అయితే.. ఈ తీర్పు ప్రకారం అధికారులు రియాక్టు కాకపోవటంతో రైతులు మరోసారి హైకోర్టును ఆశ్రయించారు.

కోర్టు ఇచ్చిన ఆదేశాల్ని ఉద్దేశ పూర్వకంగానే ప్రభుత్వ పెద్దలతో పాటు.. అధికారులు సైతం కోర్టు తీర్పును ఉల్లంఘిస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఇందులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొదలు పలువురు అధికారుల పేర్లను పేర్కొంటూ వారిపై కోర్టు ధిక్కరణ కింద శిక్షించాలని కోరారు. కోర్టు ఉత్తర్వులు అమలు కాకపోవటానికి కారణం సీఎంతో పాటు మంత్రులు కూడా కారణమన్నారు. ఇక.. పిటిషన్ లో పేర్కొన్న కొందరు రాజకీయ ప్రముఖులు.. అధికారుల పేర్లు చూస్తే.. పిటిషన్ స్థాయిలోనే ఈ ఫిర్యాదు ఎందుకంత సంచలనంగా మారిందో అర్థమవుతుంది.

- ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి

- ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ

- జీఏడీ ప్రత్యేక సీఎస్ జవహర్ రెడ్డి

- నాటి న్యాయశాఖ కార్యదర్శి వి. సునీత

- అసెంబ్లీ కార్యదర్శి పి. బాలక్రిష్ణామాచార్యులు

- రహదారులు భవనాల శాఖ ముఖ్యకార్యదర్శి ఎం.టి. క్రిష్ణబాబు

- ఆర్థిక ముఖ్యకార్యదర్శి ఎస్.ఎస్. రావంత్

- పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి వై. శ్రీలక్ష్మీ

- నాటి మంత్రి బొత్స సత్యానారాయణ (వ్యక్తిగత హోదాలో ప్రతివాదులు)

- ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి (వ్యక్తిగత హోదాలో ప్రతివాదులు)

ఇదిలా ఉంటే.. మరో పిటిషన్ ను ఏపీ హైకోర్టులో వేశారు అమరావతి రైతులు. రాజధానిగా అమరావతిలో హైకోర్టు చెప్పిన పనులు పూర్తి చేయటానికి 60నెలలు సమయం కావాలన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ దాఖలు చేసిన అఫిడవిట్ ను రిజెక్టు చేయాలని కోరుతూ మరో పిటిషన్ ను హైకోర్టులో దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆ మధ్య మంత్రి బొత్స సత్యానారాయణ చేసిన వ్యాఖ్యల్ని ఉదహరించారు.

అమరావతి రాజధాని అంశంపై హైకోర్టు తీర్పు ఇచ్చిన సమయంలో మంత్రి బొత్స సత్యానారాయణ మీడియాతో మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం మూడు రాజధానులకు కట్టుబడి ఉందన్న వ్యాఖ్యను ప్రస్తావిస్తూ.. చట్టాలు చేయకుండా శాసన వ్యవస్థను న్యాయస్థానాలు ఆపలేవని వ్యాఖ్యానించిన వైనాన్ని ప్రస్తావించారు. కోర్టులు చట్టాలు చేయకుండా అడ్డుకుంటున్నాయన్న సందేశాన్ని ప్రజలకు పంపారని.. ఇది న్యాయవ్యవస్థను.. న్యాయమూర్తులను కించపర్చటమేనని పేర్కొన్నారు. అందుకే.. 60 నెలల సమయం కావాలంటూ సీఎస్ ఇచ్చిన అఫిడవిట్ ను రిజెక్టు చేయాలని కోరారు.