Begin typing your search above and press return to search.

వారంతా మూడో డోసు తీసుకోవాలన్న ప్రముఖ తెలుగువైద్యుడు

By:  Tupaki Desk   |   16 Jun 2021 2:30 PM GMT
వారంతా మూడో డోసు తీసుకోవాలన్న ప్రముఖ తెలుగువైద్యుడు
X
కొవిడ్ పుణ్యమా అని ప్రతి ఒక్కరి జీవితాల్లోకి వైరస్ మాట భాగమైంది. కరోనాకు దూరంగా ఉండేందుకు.. దాని బారిన పడకుండా ఉండేందుకు ఏమేం చేయాలన్న విషయాల్ని తెలుసుకోవాలన్న ఆసక్తి అంతకంతకూ ఎక్కువ అవుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ.. టీకా తీసుకోవటం ద్వారా కొవిడ్ బారిన పడకుండా ఉండొచ్చన్నది తెలిసిందే. అయితే.. టీకా తీసుకున్నంతనే కొవిడ్ ముప్పు తప్పదని నిపుణులు చెబుతున్నారు.

కారులో ప్రయాణించే వేళలో.. సీటు బెల్టు పెట్టుకోవటం లాంటిదే టీకా వేసుకోవటం అన్న మాటను వైద్యులు చెబుతున్నారు. అనుకోని రీతిలో ప్రమాదం జరిగినప్పుడు సీటు బెల్టు పెట్టుకుంటే ప్రమాద తీవ్రత తక్కువగా ఉండటంతో పాటు దెబ్బలు కూడా తక్కువే తగులుతాయి. అదే రీతిలో వ్యాక్సిన్ తీసుకోవటం ద్వారా కొవిడ్ తీవ్రత అంతగా ఉండదని.. టీకా వేసుకున్నంతనే కొవిడ్ రాదన్న గ్యారెంటీ ఏమీ లేదని చెప్పటం తెలిసిందే. అందుకే.. టీకా వేసుకున్నప్పటికి అప్రమత్తంగా ఉండటం చాలా అవసరమని స్పష్టం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. తాజాగా ప్రముఖ గ్యాసో ఎంట్రాలజిస్టు.. ఏఐజీ ఛైర్మన్ డాక్టర్ నాగేశ్వరరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రోగ నిరోధక శక్తిని తగ్గించే ఔషధాలు (స్టెరాయిడ్స్) వాడుతున్న వారు.. షుగర్ కంట్రోల్ లో లేని వారు కరోనా వ్యాక్సిన్ ను రెండు డోసులు పొందిన 8 వారాల తర్వాత మూడో డోసు టీకాను కూడా తీసుకోవటం మేలని చెబుతున్నారు.

అంతేకాదు.. కొవిడ్ తీవ్రతపైనా ఆసక్తికర అంశాల్ని చెప్పారు. కొవిడ్ ను రెండు దశలుగా విభజించాలని.. తొలి వారం వైరీమియా అని.. ఈ సమయంలో వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని.. ఈ దశలో లక్షణాలు కనిపించినప్పుడు రెమ్ డెసివిర్.. మోనోక్లోనల్ యాంటీబాడీల తరహాలో చికిత్స అందించాలన్నారు.రెండో వారంలో సైటోకైన్స్ అని.. అంటే వ్యాధి తీవ్రత ఉప్పెన మాదిరి ఉంటుందన్నారు. ఇది చాలా ప్రమాదకరమైన దశగా అభివర్ణించారు.

ఈ సమయంలో యాంటీ వైరల్ ఔషధాలు ఇవ్వటం వల్ల ఉపయోగం లేదని.. రక్తనాళాల్లో ఉన్నట్లుండి రక్తం గడ్డకట్టే అవకాశాలు పెరుగుతాయని.. దీన్ని నివారించటానికి స్టెరాయిడ్స్.. టోసిలిజుమాబ్.. బారిసిటినిబ్ లాంటి మందులు అవసరమన్నారు. అయితే.. స్టెరాయిడ్స్ ను ఎక్కువగా వాడటం వల్ల పెద్ద వయస్కుల్లోని వారు.. షుగర్ కంట్రోల్ లో లేని వారికి అధిక రక్తపోటు.. దీర్ఘకాల కొవిడ్ ఇష్యూలు ఎదురవుతున్నట్లు వెల్లడించారు. అయితే.. .ఇదంతా కొవిడ్ తీవ్రత ఎక్కువ ఉన్న వారికే సుమా.