Begin typing your search above and press return to search.

కరోనా వల్ల చనిపోయే వారిని దహనం చేయాలా ? ఖననం చేయాలా ? WHO ఏంచెప్తుంది ?

By:  Tupaki Desk   |   2 April 2020 5:02 AM GMT
కరోనా వల్ల చనిపోయే వారిని దహనం చేయాలా ? ఖననం చేయాలా ? WHO ఏంచెప్తుంది ?
X
కరోనా వల్ల ప్రస్తుతం ప్రపంచం మొత్తం అల్లకల్లోలంగా మారింది. ఈ మహమ్మారి వల్ల చనిపోయేవారు సంఖ్య రోజువురోజుకి పెరిగిపోతుంది. దీనితో కరోనా వైరస్ వల్ల మరణించిన వారి అంత్యక్రియలు ఎలా చేయాలి అనే దానిపై ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతుంది. సాధారణంగా మరణం తర్వాత ఆయా వ్యక్తుల మత ఆచారాలకు అనుగుణంగా అంత్యక్రియలు నిర్వహిస్తారు. ప్రత్యేకించి భారత్‌ లో కొన్ని సామాజికవర్గాలు ఖననం పద్దతిని అనుసరిస్తే .. కొన్ని సామాజికవర్గాలు దహన సంస్కారాలు నిర్వహిస్తాయి.

అయితే కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో.. కరోనా మృతుల అంత్యక్రియలు ఏ పద్దతిలో నిర్వహించాలన్న చర్చ కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో పూడ్చివేత కంటే దహన సంస్కారాలు నిర్వహించడమే సరైందని విశ్వహిందూ పరిషత్ వాదిస్తోంది. అయితే డబ్ల్యూహెచ్ ఓ మాత్రం ఇందుకు భిన్నంగా స్పందించింది. కుల,మతాలకు అతీతంగా కరోనా మృతుల అంత్యక్రియలకు దహన సంస్కారాలు నిర్వహించాలని విశ్వహిందూ పరిషత్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ కోసం ఈ తరహా పద్దతినే పాటించాలని కోరింది. కరోనా మృతులను ఖననం చేయడం ద్వారా వైరస్ వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని తెలిపింది.

ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్‌ లో మత ప్రార్థనల్లో పాల్గొన్నవారు స్వస్థలాలకు చేరిన తర్వాత పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిన నేపథ్యంలో వీహెచ్‌ పీ ఈ కామెంట్స్ చేయడం గమనార్హం. తెలంగాణ లో మృతి చెందిన ఆరుగురు మర్కజ్‌ కి వెళ్లినట్టుగా అధికారులు గుర్తించారు. అలాగే మహారాష్ట్రలోనూ మర్కజ్‌ వెళ్లి వచ్చిన ఇద్దరు మృత్యువాత పడ్డారు. డబ్ల్యూహెచ్ ఓ మాత్రం వీహెచ్‌పీ వాదనకు భిన్నంగా స్పందించింది. ఖననమైనా.. దహనమైనా.. సరైన జాగ్రత్త చర్యలు పాటించాలని పేర్కొంది. దహనం కంటే ఖననం చేయడం ద్వారా వైరస్ వ్యాప్తి జరిగే అవకాశం ఉందన్న వాదనలో నిజం లేదని తెలిపింది. దహనం అనేది వాళ్ల ఆచారాలకు సంబంధించిన వ్యవహారమని చెప్పింది. కరోనా మృతుల అంత్యక్రియలకు డబ్ల్యూహెచ్ ఓ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇచ్చిన గైడ్ లైన్స్‌ ను తప్పనిసరిగా పాటించాలని తెలిపింది. ముంబై మున్సిపల్ కమిషనర్ ప్రవీన్ పర్దేశీ కరోనా మృతులకు దహన సంస్కారాలే నిర్వహించాలంటూ సర్క్యులర్ జారీ చేయడంతో ఈ చర్చ తెర మీదకు వచ్చింది.

అయన కుల,మతాలకు అతీతంగా కరోనా మృతులను దహనం చేయాలంటూ సర్క్యులర్‌ లో తెలిపారు. అయితే మహారాష్ట్ర మైనారిటీ డెవలప్‌ మెంట్ మంత్రి నవాబ్ మాలిక్ ఈ సర్క్యులర్‌ ను తీవ్రంగా వ్యతిరేకించారు. ఎంఐఎం అధినేత,హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కూడా దీన్ని తప్పు పట్టారు. ఇది ఆరోగ్య మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలకు విరుద్దం అని చెప్పారు. దీంతో మున్సిపల్ కమిషనర్ వెనక్కి తగ్గక తప్పలేదు. తీవ్ర వ్యతిరేకత తర్వాత సర్క్యులర్‌ ను ఆయన వెనక్కి తీసుకున్నారు.