Begin typing your search above and press return to search.

షర్మిల పుణ్యమా అని వైఎస్ మరిన్ని మాటలు అనిపించుకోక తప్పదా?

By:  Tupaki Desk   |   26 Jun 2021 4:30 AM GMT
షర్మిల పుణ్యమా అని వైఎస్ మరిన్ని మాటలు అనిపించుకోక తప్పదా?
X
ఆవేశం అవసరం. కానీ.. అందుకు ఒక లెక్క ఉండాలి. ఈ చిన్న విషయాన్ని వైఎస్ షర్మిల మిస్ అవుతున్నారా? అన్నది ప్రశ్నగా మారింది. ఎప్పుడు ఏ అవకాశం వస్తుందా? అన్నట్లు ఎదురుచూసే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. తనకు ఏ చిన్న అవకాశం లభించినా ప్రత్యర్థులపై ఎంతలా విరుచుకుపడతారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇంతకాలం కామ్ గా ఉన్న ఆయన.. హటాత్తుగా ఏపీ ప్రాజెక్టుల విషయాన్ని తెర మీదకు తీసుకురావటం.. ఆ వెంటనే కొత్త ప్రాజెక్టులకు సంబంధించి డీపీలు తయారు చేయాలని ఉత్తర్వులు జారీ చేయటం చూస్తే.. క్రిష్ణా జలాల విషయంలో సరికొత్త ప్లానింగ్ లోకి కేసీఆర్ దిగినట్లుగా చెబుతున్నారు.

ఈ సందర్భంలో కేసీఆర్ మాటల గాలానికి పడిపోతే అడ్డంగా బుక్ అయినట్లే. ఆయన తీరును గమనిస్తే.. తన ప్రత్యర్థులకు అర్థం కాని రీతిలో గాలం వేస్తారు. దాన్ని అంచనా వేయలేని వారు.. దానికి చిక్కుకోవటం.. ఆ తర్వాత విలవిలలాడటం కొత్తేం కాదు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకే కొత్త పాఠాలు నేర్పిన కేసీఆర్ ను డీల్ చేయటం అంత తేలికైన విషయం కాదు. అదే సమయంలో తాను ఏదైనా ఇష్యూను టేకప్ చేసినంతనే అందులో భావోద్వేగాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు.

ఇలా అన్ని రకాలుగా అస్త్రశస్త్రాల్ని సిద్ధం చేసుకునే కేసీఆర్ మాటలకు వెంటనే రియాక్టు అయితే లాభం కంటే నష్టమే ఎక్కువ. ఈ విషయాల్ని అర్థం చేసుకోవటంలో షర్మిల కాస్త వెనుకబడినట్లుగా చెప్పక తప్పదు. తెలంగాణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చినంతనే తన గురి ఏకంగా కేసీఆర్ మీద పెట్టటం తెలిసిందే. కొంతకాలం ఉపేక్షించిన ఆయన.. తాజాగా ఇరిగేషన్ ప్రాజెక్టుల అంశాల్ని తెర మీదకు తీసుకొచ్చి వైఎస్ మీద విమర్శ చేయటమే కాదు.. తన వారు ఘాటైన వ్యాఖ్యలు చేసేలా ఆయన పురిగొల్పినట్లుగా రాజకీయ వర్గాలు అబిప్రాయపడుతున్నాయి.

ఇలాంటి వేళ ఆచితూచి అడుగులు వేయాల్సిన షర్మిల అందుకు భిన్నంగా వైఎస్సార్ ను ఏమైనా అంటే.. ఖబడ్డార్ అంటూ టీఆర్ఎస్ నేతలకు వార్నింగ్ ఇచ్చేశారు. వైఎస్ ను ఏదైనా అంటే ఊరుకునేది లేదని ఆమె స్పష్టం చేస్తున్నారు. ఈ తరహా వ్యాఖ్యలకు ఎలా స్పందించాలన్న విషయం గులాబీ నేతలకు కొట్టిన పిండి. నిజానికి షర్మిల నోటి నుంచి ఇలాంటి వ్యాఖ్యల్ని ఆశిస్తున్న వారు.. రానున్న రోజుల్లో తెలంగాణ సెంటిమెంట్ ను మరింతగా పండించి.. వైఎస్సార్ మీద మరిన్ని ఘాటు వ్యాఖ్యలు చేసే వీలుంది. మొత్తంగా రాజకీయాల్లో తన పరిణితి అంతంతమాత్రమే అన్నట్లుగా ఆమె తీరు ఉందన్న అభిప్రాయాల్ని పలువురు వ్యక్తం చేయటం గమనార్హం.