Begin typing your search above and press return to search.

రాహుల్ పాదయాత్ర టీవీలలో కనిపించకూడదా...?

By:  Tupaki Desk   |   8 Sep 2022 7:14 AM GMT
రాహుల్ పాదయాత్ర టీవీలలో కనిపించకూడదా...?
X
రాహుల్ గాంధీ కాంగ్రెస్ అగ్ర నేత. ఆ పార్టీకి అధ్యక్షుడిగా చేసిన వారు. అతి పురాతమైన పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న వారు. ఈ దేశాన గొప్ప రాజకీయ కుటుంబంగా ఉన్న గాంధీ ఫ్యామిలీకి అయిదవ తరం వారసుడు. ఇప్పటికి నాలుగు సార్లు లోక్ సభ సభ్యుడిగా ఎన్నికై జాతీయ రాజకీయాల్లో తనదైన మార్క్ వేసుకున్న యువ నాయకుడు. అలాంటి రాహుల్ గాంధీ అత్యంత సాహసంతో పాదయాత్రను చేపట్టారు. భారత్ జోడో పేరిట ఈ యాత్ర ఏకంగా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా అయిదు నెలల పాటు సాగనుంది.

ఇక దేశంలోని ప్రధానమైన పది రాష్ట్రాలతో పాటు రెండు కేంద్ర పాలిత ప్రాంతాలలో రాహుల్ పాదం మోపబోతున్నారు. ఈ దేశంలో ఇప్పటిదాకా ఎవరూ చేయని సాహసం రాహుల్ చేస్తున్నారు. కాంగ్రెస్ అగ్ర నాయకులు కాదు కదా మిగిలిన పార్టీల నాయకులు ఎవరూ తలపెట్టని పాదయాత్రకు ఆయన శ్రీకారం చుట్టారు. అలాంటి రాహుల్ పాదయాత్ర ధూం ధాం గా కన్యాకుమారిలో మొదలైంది.

రాహుల్ వంటి అగ్ర శ్రేణి నాయకుడు. ఈ దేశాన్ని అత్యధిక కాలం పాలించిన కాంగ్రెస్ పార్టీ నేత పాదయాత్ర చేపడితే తొలి రోజునే ఆ కార్యక్రమం టీవీలలో పెద్ద ఎత్తున కవరేజికి నోచుకోలేదు. దీనికి కారణాలు ఏంటి అన్న చర్చ ఇపుడు సాగుతోంది. నిజానికి రాహుల్ యువ రాజు కాదు, అతి సామన్యుడు మీలో ఒకడు అని చాటి చెప్పడానికే కాంగ్రెస్ ఈ యాత్రను తలపెట్టింది అని చెప్పాలి.

మరి అంతటి ముఖ్యమైన పాదయాత్ర విషయంలో మీడియా కవరేజి పెద్దగా ఎందుకు లేదు, దీని వెనక కాంగ్రెస్ వ్యూహాలు ఏమైనా విఫలం అయ్యాయా లేక మీడియా మేనేజ్మెంట్ విషయంలో కాంగ్రెస్ పార్టీ సక్రమంగా ఏర్పాట్లు చేసుకోలేదా అన్న చర్చ వినిపిస్తోంది. అదే టైం లో అధికారంలో ఉన్న బీజేపీ మీడియా మేనేజ్మెంట్ లో దిట్ట. నరేంద్ర మోడీ 2013లో జాతీయ రాజకీయాల్లోకి వచ్చినపుడు ఎంతో పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. డిబేట్ల మీద డిబేట్లు దేశంలోని అన్ని టీవీలలో సాగింది.

ఈ దేశాన్ని రక్షించే గొప్ప రక్షకుడు వచ్చారంటూ ఊదరగొట్టారు. మరి ఇపుడు రాహుల్ గాంధీ వంటి అగ్ర నేత పాదయాత్ర చేపట్టినా ఆ రేంజిలో కాకపోవచ్చు కనీస స్థాయిలో మీడియాలో ప్రచారం ఎందుకు రావడం లేదు అన్న డౌట్లు తటస్థులలో కలుగుతున్నాయి. అంతే కాదు రాహుల్ వంటి చరిష్మాటిక్ లీడర్ జనంలోకి వచ్చినపుడు ప్రజల రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలన్న ఆసక్తి కామన్ టీవీ వీక్షకులకు ఉంటుంది. ఒక విధంగా రాహుల్ పాదయాత్రను కవర్ చేస్తే టీవీ చానళ్ళ టీయార్పీ రేటింగ్ కూడా ఈ టైం లో పెరుగుతుంది అన్న అంచనాలు ఉన్నాయి.

మరీ అన్నీ తెలిసి అన్ని లెక్కకు కరెక్ట్ గా ఉన్న టైం లో రాహుల్ పాదయాత్ర ఎందుకు టీవీలలో కనిపించడంలేదు అంటే దాని మీద అనేక రకాలైన ప్రచారాలు అయితే ఉన్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వమే దేశంలోని చానళ్ళకు వార్నింగ్ ఇచ్చిందని వార్తలు అయితే వైరల్ అవుతున్నాయి. రాహుల్ పాదయాత్రను ప్రసారం చేయవద్దు అంటూ సుతి మెత్తని హెచ్చరికలు వెళ్లాయని అంటున్నారు.

పదే పదే రాహుల్ పాదయాత్రను టీవీ చానళ్లలో చూపిస్తే మాత్రం బాగోదు అన్న సందేశాలు వెళ్లాయని ప్రచారం మాత్రం సాగుతోంది. ఇందులో నిజమెంత ఉందో ఎవరికీ తెలియదు కానీ ఇదే నిజమైతే మాత్రం కాంగ్రెస్ తన జాగ్రత్తలో తాను ఉండాల్సిందే. ఈ రోజుల్లో ఏ రాజకీయ పార్టీ విజయానికైనా మీడియా పాత్ర చాలా అవసరం. దేశంలో ఎక్కడ ఏ మూల చిన్న కార్యక్రమం చేసినా అది ఆసేతు హిమాచలం వినిపించి కనిపించేలా చేయడంలో మీడియా పాత్ర కీలకం. అలాంటిది కాంగ్రెస్ తన జీవన్మరణ సమస్యగా భావిస్తూ రాహుల్ తో పాదయత్రకు సమకట్టిన వేళ దానికి తగిన కవరేజి రాకుండా చేస్తే అది ఫక్తు రాజకీయం.

రాజకీయాలు చేసే ప్రత్యర్ధులు ఎపుడూ చేస్తూనే ఉంటారు. దాన్ని తిప్పికొట్టే వ్యూహాలు కూడా కాంగ్రెస్ రెడీ చేసుకుని తమ పాదయాత్రను కోట్లాది మంది ప్రజల వద్దకు తీసుకెళ్ళాల్సిన అవసరం అయితే కచ్చితంగా ఉంది మరి. ఈ విషయంలో ఆదిలోనే బీజేపీతో తలపడాల్సి వస్తుందని ఆలోచించకుండా రంగంలోకి దిగిపోవాల్సిందే. ఏది ఏమైనా రాహుల్ యాత్ర మాత్రం దేశంలోని సామాన్యులలో అతి పెద్ద చర్చకు ఆస్కారం ఇస్తోంది అన్నది నిజం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.