Begin typing your search above and press return to search.

కేసీఆర్ జీ..పోలీసులు చేసిన పని తెలిసిందా?

By:  Tupaki Desk   |   5 Oct 2016 4:30 AM GMT
కేసీఆర్ జీ..పోలీసులు చేసిన పని తెలిసిందా?
X
ఈ విషయం విన్నంతనే కడుపు మండుతుంది. ఆవేశం తన్నుకు వస్తుంది. మా గొప్ప పోలీసులు అని గొప్పగా చెప్పుకున్నోళ్లు సైతం నోట మాట రానట్లు ఉండిపోవటం ఖాయం. ఛాలెంజ్ చేసి చెప్పగలం.. సామాన్యులే కాదు.. సీఎం కేసీఆర్ కు సైతం ఈ విషయం గురించి తెలిస్తే కోపం కట్టలు తెగటం ఖాయమని. ఇంతకీ అంత పెద్ద తప్పేం జరిగిందన్న సందేహం వచ్చిందా? అక్కడికే వస్తున్నాం. వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి తెలుగువాడి నోటి నుంచి ‘అయ్యో.. పాపం.. ఇలాంటి కష్టం.. పగోడికి కూడా వద్దు సుమా’ అని ఆవేదన చెందిన చిన్నారి రమ్య ఆమె ఫ్యామిలీకి సంబంధించిన ఉదంతం గురించే.

చిన్నారి రమ్య అన్న వెంటనే గుర్తుకు వచ్చే ఉంటుంది. అదేనండి.. మద్యం సేవించి అతి వేగంగా కారు నడిపి.. స్కూల్ నుంచి తిరిగి వస్తున్న చిన్నారి రమ్యతో సహా ముగ్గురి మృతికి కారణమైన శ్రావిల్ ఉదంతం గురించి గుర్తుండే ఉంటుంది. మద్యం మత్తులో ఇష్టారాజ్యంగా కారు నడిపి.. డివైడర్ ను బలంగా ఢీ కొట్టడంతో.. ఎగిరి పడిన ఆ కారు.. తమ దారిన తాము వెళుతున్న చిన్నారి రమ్య ప్రయాణిస్తున్న కారుపై పడటం.. ముగ్గురు ప్రాణాల్ని బలి తీసుకున్న వైనం గుర్తుకు రావటం ఖాయం.

ప్రతి ఒక్కరి గుండెను పిండేసిన ఈ దారుణానికి కారణమైన శ్రావిల్ కు ఉమ్మడి హైకోర్టు బెయిల్ ఇచ్చింది. అంత దారుణానికి పాల్పడిన వ్యక్తికి బెయిల్ ఎలా ఇచ్చిందంటే.. దానికి హైదరాబాద్ పోలీసులే కారణమని చెప్పాలి. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఈ ఉదంతంపై 90 రోజులు గడిచినా అభియోగ పత్రాన్ని పోలీసులు దాఖలు చేయకపోవటంతో.. నిబంధనల ప్రకారం 90 రోజుల నుంచి జైల్లో ఉన్న శ్రావిల్ చట్టబద్ధంగా బెయిల్ కు అర్హుడని పేర్కొంటూ అతన్ని విడుదల చేసేందుకు వీలుగా బెయిల్ మంజూరు చేస్తూ న్యాయమూర్తి నిర్ణయం తీసుకున్నారు.

బాధ్యతారాహిత్యంతో అంతమంది ప్రాణాలు పోవటానికి కారణమై.. రమ్య కుటుంబానికి అంతులేని శోకాన్ని మిగిల్చిన వ్యక్తి 90 రోజుల్లో జైల్లో నుంచి ఎందుకు బయటకు వచ్చాడంటే.. ఈ ఉదంతంపై హైదరాబాద్ పోలీసులు అభియోగపత్రాన్ని దాఖలు చేయకపోవటం వల్లే. వారే కానీ అభియోగపత్రం దాఖలు చేసి ఉంటే.. బెయిల్ అర్హతకు అవకాశం ఉండేది కాదన్న వాదనను పలువురు వినిపిస్తున్నారు. మూడు నెలల సమయం అంటే తక్కువేం కాదు. ఒక రోడ్డు ప్రమాదానికి సంబంధించిన ఒక అంశంపై చార్జిషీట్ రూప‌క‌ల్ప‌న‌కు ఇంత పెద్ద పోలీసు యంత్రాగానికి మూడు నెలల సమయం సరిపోలేదా? అన్నది ప్రశ్న.

చిన్నారి రమ్య ఉదంతం సామాన్యులనే కాదు.. ప్రముఖుల్ని సైతం కలిచి వేసింది. నిందితులకు చట్టబద్ధంగా శిక్ష పడటం ద్వారా.. చిన్నారి రమ్య ఆత్మకు శాంతి చేకూరుతుందన్న భావన పలువురు వ్యక్తం చేశారు. అయితే.. హైదరాబాద్ పోలీసుల కారణంగా.. నిందితుడు బెయిల్ పొంది బయటకు వచ్చే అవకాశం కలిగిందని చెప్పొచ్చు. ఈ కేసుకు సంబంధించి గతంలో రెండుసార్లు బెయిల్ పిటిషన్ హైకోర్టులో దాఖలైనప్పటికీ తిరస్కరణకు గురైంది. కానీ.. నిబంధనల ప్రకారం ఒక కేసులో అభియోగపత్రం దాఖలు కాని వేళ.. 90 రోజులకు మించి జైల్లో ఉంచలేని పరిస్థితి. అందరి మనసుల్ని పిండేసిన ఉదంతానికి సంబంధించిన అభియోగపత్రాన్ని దాఖలు చేయటానికి 90 రోజుల సుదీర్ఘమైన సమయం హైదరాబాద్ పోలీసులకు ఎందుకు సరిపోలేదు? ఇప్పుడు చెప్పండి.. ఈ విషయం కానీ.. సీఎం కేసీఆర్ దృష్టికి వెళ్లి ఉంటే.. ఆయన ఊరుకుంటారంటారా?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/