Begin typing your search above and press return to search.

పెళ్లైన 36 రోజులకే మొగుడ్ని చంపేసిన శ్యామల

By:  Tupaki Desk   |   9 May 2022 4:36 AM GMT
పెళ్లైన 36 రోజులకే మొగుడ్ని చంపేసిన శ్యామల
X
కలకాలం కలిసి ఉండాలని చేసే పెళ్లిళ్లు పెటాకులు అవుతున్నాయి. ఇష్టం లేని పెళ్లి చేశారన్న ఆగ్రహంతో.. కట్టుకున్న భర్తను దారుణంగా చంపేసే వైనాలు ఈ మధ్యన ఎక్కువ అవుతున్నాయి. తాజాగా అలాంటిదే మరొకటి చోటు చేసుకుంది. పెళ్లైన 36 రోజులకే కట్టుకున్న భర్తను ప్రియుడితో కలిసి అంతమొందించిన వైనం షాకింగ్ గా మారింది. నిజానికి పెళ్లైన వెంటనే అన్నంలో విషం పెట్టటం ద్వారా చంపేసే ప్లాన్ చేసినా.. అది వర్కువుట్ కాకపోవటంతో రెండో ప్రయత్నంలో భర్తను చంపేసింది. సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకున్న ఈ వైనం షాకింగ్ గా మారింది.

ఇదంతా విన్నప్పుడు ఇష్టం లేని పెళ్లి చేసుకోవటం ఎందుకు? ఏ పాపం ఎరుగని వ్యక్తిని చంపేయటం ఏమిటి? అన్న సందేహం కలుగక మానదు. దుబ్బాక మండలం కోనాపురానికి చెందిన 24 ఏళ్ల చంద్రశేఖర్ కు తొగుట మండలానికి చెందిన 19 ఏళ్ల శ్యామలకు మార్చి 23న పెళ్లైంది. అయితే.. ఆమె అప్పటికే తమ ఊరికి చెందిన శివకుమార్ తో పీకల్లోతు ప్రేమలో ఉన్నారు. వారు అప్పటికే మూడేళ్ల నుంచి ప్రేమలో ఉన్నారు.

పెద్దల ఒత్తిడితో ఇష్టం లేని పెళ్లి చేసుకున్న శ్యామల.. ప్రియుడు శివతో కలిసి భర్తను చంపేసే ప్లాన్ చేసింది. పెళ్లైన 26 రోజులకే భర్తను చంపేసేందుకు ప్లాన్ చేసింది. భర్త తినే అన్నంతో ఎలుకల మందు కలిపేసింది. దీంతో తీవ్ర అనారోగ్యానికి గురైన అతను హైదరాబాద్ కు వెళ్లి చికిత్స చేయించుకోవటంతో వారి ప్లాన్ వర్కువుట్ కాలేదు. అయితే.. తాను తిన్న ఆహారంలో ఏదో తేడా కొట్టిందనే భావించాడు తప్పించి.. భార్యపై ఎలాంటి అనుమానం రాలేదు.

దీంతో.. తన భర్తను ఏదో రీతిలో వదిలించుకోవాలని డిసైడ్ అయిన శ్యామల.. ఆమె ప్రియుడు ఇద్దరూ మరో ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా ఏప్రిల్ 28న తన భర్తను తీసుకొని టూవీలర్ మీద అనంతసాగర్ శివారులో ఏకాంతంగా గడుపుదామని కోరింది. ఆమె మాటల్ని నమ్మిన భర్త ఆమె చెప్పినట్లే చేశాడు.

అయితే.. ముందుగా వేసుకున్న ప్లాన్ లో భాగంగా శ్యామల ప్రియుడు.. అతడి స్నేహితులు కలిసి చంద్రశేఖర్ ను అదిమి పెట్టి చేతి రుమాలుతో గొంతు నులిమి చంపేశారు. ఛాతీ నొప్పితో చనిపోయాడని శ్యామల బంధువులకు తెలియజేసింది.

అయితే.. తన కొడుకు మరణం మీద అనుమానంతో శ్యామల అత్త పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో.. రంగంలోకి దిగిన పోలీసులు మరణం వెనుక ఉన్న అసలు నిజాన్ని తాజాగా తేల్చేశారు. హత్యకు పాల్పడిన వారందరిని అరెస్టు చేసి రిమాండ్ చేశారు. హత్యకు పాల్పడిన వారందరి వయసు పాతికేళ్ల లోపు వాళ్లే కావటం గమనార్హం.