Begin typing your search above and press return to search.

తల్లిని కాపాడి ప్రాణాలు వదలిన ఎస్ ఐ

By:  Tupaki Desk   |   26 Aug 2018 10:30 AM GMT
తల్లిని కాపాడి ప్రాణాలు వదలిన ఎస్ ఐ
X
తల్లి అంటే అతడికి పంచప్రాణాలు.. ఇటీవలే గుండె ఆపరేషన్ కూడా చేయించాడు. తల్లితో కలిసి పెళ్లికి వెళ్లి వస్తుండగా కారు అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. గజ ఈతగాడైన ఆ ఎస్ ఐ తన తల్లిని అతికష్టం మీద కాపాడాడు. కానీ మళ్లీ కారులోని నగదును తీసుకెళ్లేందుకు వెళ్లి కొట్టుకుపోయాడు. కృష్ణా జిల్లాలో జరిగిన ఈ విషాధ సంఘటన ఓ తల్లికి కడుపుకోతను మిగిల్చింది..

కృష్ణా జిల్లా కోడూరు మండలం ఇస్మాయిల్ బేగ్ పేటకు చెందిన కోట వంశీధర్ తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం ఎస్ ఐగా పనిచేస్తున్నారు. శనివారం బంధువుల ఇంట్లో పెళ్లికి కారులో తల్లితో కలిసి వెళ్లాడు. మధ్యాహ్నం విజయవాడ నుంచి అవనిగడ్డ కరకట్టపై నుంచి వెళుతుండగా.. కారులో టైరులో గాలి తగ్గిపోయి కేఈబీ కెనాల్ లోకి దూసుకెళ్లింది. అక్కడే ఉన్న గ్రామస్థులు చూసి చేరుకున్నారు. ఈ క్రమంలోనే ఈత వచ్చిన వంశిధర్ కారులోంచి బయటపడి తల్లిని గ్రామస్థుల సాయంతో కాపాడాడు. అనంతరం కారులో ఉన్న నగదు.. విలువైన వస్తువుల కోసం మరోసారి కారు వద్దకు వెళ్లి దానిలో ఇరుక్కొని కొట్టుకుపోయాడు.

వంశీధర్ కోసం పోలీసులు - అధికారులు వెతుకుతున్నారు. కొడుకు కల్లముందే గల్లంతవడం చూసి తల్లి లక్ష్మి షాక్ కు గురైంది. తల్లి కోసం ప్రాణాల మీదకు తెచ్చుకున్న కొడుకు ఉదంతం స్థానికంగా విషాదం నింపింది.