Begin typing your search above and press return to search.

పీకే మీద తమ్ముళ్ళ కసి ఒక రేంజిలో...?

By:  Tupaki Desk   |   3 May 2022 8:33 AM GMT
పీకే మీద తమ్ముళ్ళ కసి ఒక రేంజిలో...?
X
పీకే అలియాస్ ప్రశాంత్ కిశోర్ వృత్తి రాజకీయ వ్యూహాలు రూపొందించడం. ఆయన మంచి వ్యూహకర్త. ఈ విషయంలో ఎవరికీ ఏ డౌట్లూ లేవు. ఇక ఆయన వ్యూహాలతో తమ రాజకీయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా చావు దెబ్బ తిన్న రికార్డు టీడీపీ సొంతం. కలిసానికి కూడా మిగలకుండా పోయారని అంటారే. అలాంటి దెబ్బ టీడీపీకి పీకే వ్యూహలతో ఏపీలో పడిపోయింది. ఎక్కడ వందకు పైగా సీట్లు, మరెక్కడ 23 సీట్లు. మొత్తానికి పీకే అంటే పీకల దాకా టీడీపీ తమ్ముళ్లకు కోపం ఉంది అంటే అందులో న్యాయముందిగా.

ఇవన్నీ పక్కన పెడితే పీకే ఇలా పార్టీ పెడుతున్నాను అని ప్రకటించారో లేదో అలా టీడీపీ నుంచి సెటైర్లు, పంచులు వరసబెట్టి పడిపోతున్నాయి. అసలు పీకేనే తమ రాజకీయ ప్రత్యర్ధిగా టీడీపీ భావిస్తోందా అనడానికి సోషల్ మీడియాలో ఈ బీభత్సమైన దాడే తార్కాణం అనుకోవాల్సిందే.

పీకేను గజదొంగతో పోలుస్తున్నారు. ఆయన వ్యూహాలు అన్నీ కూడా దారుణమట. బాగా చెడ్డవాడిని తెచ్చి జనాలలో మంచిగా ప్రొజెక్ట్ చేశారుట. అలా జనాలను మభ్యపెట్టారుట. ఇవన్నీ ఎవరి మీద అంటే తెలిసిందే కదా జగన్ పీకే కాంబో గురించే. ఆయనను పీకే తన వ్యూహాలతో సీఎం గద్దెనెక్కించారని, తప్పుడు హామీలతో జనాలను మోసం చేశారని టీడీపీ తమ్ముళ్ళు ఆక్రోశిస్తున్నారు.

ఇపుడు అవే మాటలను సీనియర్ మోస్ట్ టీడీపీ నేత బుచ్చయ్యచౌదరి లాంటి వారు కూడా ఘాటుగానే అంటున్నారు. పీకే పార్టీ ప్రశాంత్ కిషోర్ రాజకీయాల్లోకి వస్తాను అంటే ఎలా ఉంది అంటే బాగా ఖరీదైన గజ దోంగ నేను మనసు మార్చుకున్నాను...నేను పోలీసు అవ్వాలనుకుంటున్నాను అని అన్నట్లు ఉంది అని మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్యచౌదరి హాట్ హాట్ గానే కామెంట్స్ చేస్తున్నారు.

అంతేనా తాను బేరాలు కుదుర్చుకున్న రాజకీయ పార్టీల‌ యజమానుల నుంచి డబ్బులు తీసుకుని ఆ మీదట జనాన్ని ఏమార్చి రాజకీయాలు నడిపిన వాడిగా పీకేని ఆయన అభివర్ణించారు. ఇక బాగా చెడ్డోన్ని కూడా మంచి వారిలా చూపించి రాజకీయాలు చేసిన వ్యక్తి పీకే అని మండిపడ్డారు. అవును మరి ఇంతటి కోపం పీకే మీద ఉండాల్సిందే. తెలుగుదేశం కూసాలు మొత్తం కదిలిపోయేలా 2019లో భారీ ఓటమిని నెత్తిన రాసేసిన పీకే అంటే గోరంట్ల లాంటి వారికి మండాల్సిందే కదా.

అయితే దీనికి కాస్తా వెనక్కి అంటే 2017 దాకా వెళ్తే ఒక ముచ్చట గురించి చెప్పుకోవాలి. పీకేను ఆర్భాటంగా తెచ్చి జగన్ నాడు వైసీపీ ప్లీనరీలో తమ పార్టీ జనాలందరి ముందు పరిచయం చేశారు. ఆయన వైసీపీకి పనిచేయబోతున్నారు అని కూడా చెప్పారు. ఆ ప్రకటన తరువాత టీడీపీ తమ్ముళ్ళు కానీ వారి అనుకూల మీడియా కానీ ఒక రేంజిలో జగన్ని ఆడుకున్నాయి.

మీకు పీకేలు అవసరమేమో, ఎందుకంటే మీకు వ్యూహాలు లేవు, అవి రావు, కుదిరే పని కూడా అసలు కాదు, మాకు రాజకీయ గండర గండడు చంద్రబాబు ఉన్నారు. ఆయనను మించిన వ్యూహకర్త ఈ ప్రపంచంలోనే ఎక్కడా లేరు. మా బాబుకు సరిసాటి ఎవరూ లేరు. ఈ పీకేలు ఏమీ పీకలేరు అని కూడా తమ్ముళ్ళు సౌండ్ చేశారు. సీన్ కట్ చేస్తే పీకే ఏం చేశారో తమ్ముళ్ళు చూశారు.

అంటే ఇక్కడ టీడీపీ ఓడిపోవడమే కాదు, చంద్రబాబు రాజకీయం ఆయన అపర చాణక్యం, వ్యూహాలు మొత్తం పీకే ముందు బలాదూర్ అని కూడా రుజువు అయిందిగా. దాంతో నాటి కోపమంతా దాచుకుని ఇపుడిలా పీకే మీద బాహాటంగానే రెచ్చుతున్నారు అని అంటున్నారు. అయినా పీకే ఇంకా పార్టీ ప్రకటన మాత్రమే చేశారు. ముందు ముందు ఏం చేస్తారో. బహుశా ఆయన రాజకీయాన్ని మెచ్చి టీడీపీ కూడా ఆయనతో ఫ్యూచర్ లో జత కట్టొచ్చేమో. అపుడే ఎందుకు తొందర తమ్ముళ్ళూ అన్న మాటలూ వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా కానీ తమ్ముళ్ళు మాత్రం తమ కసిని ఆలా చూపించేస్తున్నారు అన్న మాట.