Begin typing your search above and press return to search.

ఇండిగోకు చుక్కలు చూపించిన సిబ్బంది.. ఒకేసారి సిక్ లీవ్ పెట్టి డుమ్మా

By:  Tupaki Desk   |   4 July 2022 2:28 AM GMT
ఇండిగోకు చుక్కలు చూపించిన సిబ్బంది.. ఒకేసారి సిక్ లీవ్ పెట్టి డుమ్మా
X
చెప్పిన టైంకు చెప్పినట్లుగా విమానాల్ని నడిపే విమానయాన సంస్థగా ఇండిగోకు ఉన్న పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాను చేరాల్సిన గమ్యస్థానానికి.. ఐదు.. పది నిమిషాలు ముందే చేరుకోవటం.. ఇండిగోలో ప్రయాణించే వారు చాలామంది అనుభవంలో ఉండి ఉంటుంది. అలాంటి ఇండిగోకు తాజాగా ఉద్యోగులు ఇచ్చిన షాక్ తో ఆ సంస్థ ఆగమాగమైన పరిస్థితి.

అనూహ్యంగా వ్యవహరించిన సిబ్బంది.. వచ్చి పడుతున్న ముప్పును గుర్తించటంలో విఫలమైన హెచ్ ఆర్ శాఖ పుణ్యమా అని.. ఇండిగో ఉక్కిరిబిక్కిరి అయ్యే పరిస్థితి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 900 సర్వీసులకు షాకిచ్చిన ఉద్యోగుల తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగుల మీద ఎంతటి ఒత్తిడి ఉంటుందో తెలిసిందే. అలాంటి పరిస్థితుల్లోనూ అందరూ కలిసి కట్టుగా ఇచ్చిన షాక్ ఇప్పుడు కార్పొరేట్ వర్గాల్లో కొత్త చర్చకు కారణమైందని చెప్పాలి.

శనివారం ఇండిగో ఉద్యోగుల్లో దాదాపు 52 శాతం మంది అనూహ్యంగా సిక్ లీవ్ తీసుకున్నారు. అనూహ్యంగా సిబ్బంది మొత్తం ఒకరు తర్వాత ఒకరు సిక్ లీవ్ కోసం అప్లై చేసుకోవటం.. ఏం జరుగుతుందన్న విషయం అర్థమయ్యే లోపు.. జరగాల్సిన నష్టం జరిగిపోయింది. తగిన సిబ్బంది అందుబాటులో లేకపోవటంతో ఇండిగో సర్వీసుల్ని సమయానికి నడపలేని పరిస్థితి. ఇండిగో సిబ్బంది పలువురు పెద్ద ఎత్తున సిక్ లీవ్ తీసుకున్నారు.

ఇంతకీ అంతలా సిబ్బందికి అనారోగ్యానికి గురి కావటానికి కారణం.. టాటా సంస్థ ఇటీవల కొనుగోలు చేసిన ఎయిరిండియా రిక్రూట్ మెంట్ నిర్వహించటమే. దీంతో.. సిక్ లీవ్ పేరుతో ఇండిగో క్యాబిన్ సిబ్బంది ఆ డ్రైవ్ కు హాజరు కావటంతో.. ఉన్న సిబ్బందిని సర్దుబాటు చేయలేక ఇండిగో కిందా మీదా పడింది.

విమానాలు ఆలస్యంగా నడవటంపై పలువురు ప్రయాణికులు ఫిర్యాదులు చేయటంతో ఏవియేషన్ రెగ్యులేటర్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ విమానాల ఆలస్యంపై ఇండిగోను వివరణ కోరింది.

తన విమానాల ఆలస్యంపై ఇండిగో మాత్రం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. కాకుంటే.. సంస్థకు చెందిన కొందరు మాత్రం అనధికారికంగా కొన్ని మీడియా సంస్థలతో మాట్లాడుతూ జరిగిన కారణాన్ని వివరించారు. మొత్తానికి సిబ్బంది కారణంగా ఇండిగోకు ఇప్పటివరకు ఎప్పుడూ ఎదురుకాని విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొందని చెప్పక తప్పదు.