Begin typing your search above and press return to search.

మంత్రిగారి ప్ర‌శ్న‌ల‌తో వారికి దిమ్మ‌తిరిగింది

By:  Tupaki Desk   |   14 July 2016 8:28 AM GMT
మంత్రిగారి ప్ర‌శ్న‌ల‌తో వారికి దిమ్మ‌తిరిగింది
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రవాణాశాఖా మంత్రి శిద్దా రాఘవరావు గ్రానైట్ వ్యాపారుల‌కు అనూహ్య‌మైన షాకిచ్చారు. గ్రానైట్‌ పరిశ్రమల యజమానుల సమావేశానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఈ సంద‌ర్భంగా త‌న మాట‌ల‌తో వ్యాపార‌వేత్త‌ల‌ను ఆలోచ‌న‌లో ప‌డేయ‌డ‌మే కాకుండా వారికి ఊహించ‌ని ప్రశ్న‌ను కూడా సంధించారు.

స‌మావేశంలో భాగంగా తొలుత గ్రానైట్‌ యజమానులు పరిశ్రమ నిర్వహణలో తమకు ఎదురవుతున్న రాయల్టీ - డీఎంఎఫ్‌ - ఓవర్‌ లోడ్‌ పేరుతో జరిమానాలు తదితర సమస్యలను మంత్రి శిద్దా రాఘ‌వ‌రావు దృష్టికి తీసుకువెళ్లారు. దానికి మంత్రి స్పందిస్తూ 'హుద్‌ హుద్‌ తుపాను సంభవించిన స‌మ‌యంలో విశాఖ‌ప‌ట్ట‌ణంతో స‌హా కొన్ని ప్రాంతాలు అత‌లాకుత‌లం అయ్యాయి. ఆ సమయంలో మీరేం చేశారు చెప్పండి? అలాంటి సమయంలో ఏవైనా ఆదుకునే చ‌ర్య‌లు చేస్తే కదా ప్రభుత్వం మీకు సహాయ పడేది’ అంటూ ప్ర‌శ్నించారు. మీ సమస్యలను చెప్పకుండానే పరిష్కరించడానికి సీఎం చంద్ర‌బాబు దేవుడు కాదని అనున‌యిస్తూనే 'ప్రభుత్వం చేయలేదంటే తప్పు మీదే' అని అన్నారు. దీంతో వ్యాపారులు ఒక‌రి మొహం మ‌రొక‌రు చూసుకున్నారు. ప‌రిస్థితిని చ‌క్క‌దిద్దేందుకు మళ్లీ మంత్రి శిద్దా ప్ర‌సంగాన్ని కొన‌సాగించారు.

పరిశ్రమ నిర్వహణలోని సమస్యలను సీఎంకు వివరించాన‌ని మంత్రి తెలిపారు. 'మీరు రూ.పది సంపాదిస్తే అందులో రూపాయిని సామాజిక సేవా కార్యక్రమానికి ఖర్చు చేయాలి'అని వ్యాపార‌వేత్త‌ల‌కు ఉద్బోధించారు. ప్రభుత్వం అందరినీ, అన్ని విధాలా అందుకుంటుందని హామీ ఇచ్చారు. రాష్ట్రానికి రెవెన్యూ రావాలంటే పరిశ్రమలు అవసరమని.. ప్రభుత్వం సహకారం ఉంటేనే పరిశ్రమలు నడుస్తాయని శిద్దా అన్నారు. లీజుల ద్వారా భూములు ఇప్పిస్తామని, గ్రానైట్‌ పరిశ్రమను ప్రోత్సహించడానికి జిల్లాలో త్వరలోనే మినరల్‌ విశ్వవిద్యాలయం పనులు ప్రారంభించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి శిద్దా రాఘ‌వ‌రావు పున‌రుద్ఘాటించారు. సమాజం నుంచి పొందిన దాంట్లో ఉంచి స‌మాజానికి కొంతైనా ఇవ్వాల‌నే దిశ‌గా స‌భా వేదిక‌గా ప్ర‌క‌టించిన మంత్రి తీరును ప‌లువురు చ‌ర్చించుకున్నారు.