Begin typing your search above and press return to search.

సీఎంకు ఓట‌మి భ‌యం...క‌ల‌వ‌రంలో కాంగ్రెస్‌

By:  Tupaki Desk   |   18 April 2018 10:53 AM GMT
సీఎంకు ఓట‌మి భ‌యం...క‌ల‌వ‌రంలో కాంగ్రెస్‌
X
పొరుగు రాష్ట్రమైన క‌ర్ణాట‌క ఎన్నిక‌లు రంజుగా మారుతున్నాయి. ప్ర‌ముఖుల ప్ర‌చారం ఓ వైపు సాగుతుంటే..మ‌రోవైపు టిక్కెట్ల కేటాయింపులో అల‌క‌లు, ఆందోళ‌న‌లు ఇంకోవైపు సాగుతున్నాయి. తాజాగా ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి సిద్ధ‌రామ‌య్యపై కొత్త చ‌ర్చ మొద‌లైంది. వచ్చేనెల 12న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జ‌ర‌గ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికే పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను కాంగ్రెస్ పార్టీ ఆదివారం విడుదల చేసింది. 224 అసెంబ్లీ స్థానాలకు 218 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. చాముండేశ్వరి స్థానం నుంచి సీఎం సిద్దరామయ్య - కోరాటెగెరె నుంచి పీసీసీ అధ్యక్షుడు జీ పరమేశ్వర పోటీ చేస్తారు. జాబితాలో కొందరు మంత్రుల పేర్లు కూడా ఉన్నాయి.చాముండేశ్వరి నుంచి కచ్చితంగా గెలుస్తానని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ధీమా వ్యక్తం చేస్తున్నా.. ఆయన రెండో స్థానం నుంచి పోటీ చేసే అవకాశముందని స‌మాచారం.

గత ఎన్నికల్లో ఆయన చాముండేశ్వరి నుంచి కేవలం 257 ఓట్ల మెజారిటీతో గెలిచారు. దీంతో సిద్ధరామయ్యను బదామి నుంచి కూడా పోటీ చేయించాలని భావిస్తోంది. వరుణ నియోజకవర్గం సిద్ధరాయమ్యకు కంచుకోట. అయితే ఈ నియోజకవర్గం నుంచి తన కుమారుడు యతేంద్రను బరిలోకి దింపుతున్నారు సిద్ధరాయమ్య. పెద్ద కుమారుడు రాకేష్‌ అకాల మరణంతో యతేంద్ర రాజకీయ ప్రవేశం చేస్తున్నారు. కంచుకోటైన వరుణ నియోజవకర్గం నుంచి కొడుకును దింపి తను మాత్రం చాముండేశ్వరి నుంచే పోటీ చేయాలని నిర్ణయించారు. కాని అధిష్ఠానం మాత్రం బదామి నుంచి కూడా సిద్ధరామయ్యను నిలపాలని భావిస్తోంది. దీంతో కాంగ్రెస్ తుది జాబితాపై కర్ణాటకలో ఆసక్తి పెరిగింది. సీఎం గెలుపుపైనే కాంగ్రెస్ పార్టీకి న‌మ్మ‌కం లేద‌ని..ఇక ఆ పార్టీ అధికారంలోకి ఎలా వ‌స్తుంద‌ని ఇప్ప‌టికే ప్ర‌శ్న‌లు వ‌స్తున్నాయి.