Begin typing your search above and press return to search.

ఒకప్పటి రాజకీయ గురుశిష్యులే..ఇప్పుడిలా!

By:  Tupaki Desk   |   26 Aug 2019 2:30 PM GMT
ఒకప్పటి రాజకీయ గురుశిష్యులే..ఇప్పుడిలా!
X
ఇద్దరు ఒకప్పుడు గురుశిష్యులు. కానీ ప్రస్తుతం రాజకీయ ప్రత్యర్థులుగా మారారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఎన్నో ఏళ్ల తర్వాత ఒకే వేదికపై ప్రసంగించారు. మళ్లీ ఇప్పుడు ఒకరంటే ఒకరకు పడదు. వారిద్దరు కర్ణాటకలో పేరు మోసిన ప్రముఖ రాజకీయ నాయకులు. ఒకరేమో మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ కాగా మరొకరు మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య. వీరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత అంతర్గత శతృత్వం ఏర్పడింది. ఇప్పుడిప్పుడు వీరి మధ్య మరోసారి రాజకీయ వైరం తలెత్తింది. సంకీర్ణ ప్రభుత్వం పతనానికి 'నువ్వంటే నువ్వు' కారణమంటూ ఒకరినొకరు ఆరోప - ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. ఇద్దరి మధ్య గొడవలు కొత్తేమీ కాకపోయినా తాజాగా మరోసారి రాజుకోవడం సంచలనంగా మారింది. వాస్తవానికి సిద్ధరామయ్య తన రాజకీయ జీవితాన్ని జేడీఎస్‌ లో ప్రారంభించారు. ఆ తర్వాత కొన్ని విభేదాల కారణంగా జేడీఎస్‌ నుంచి సస్పెన్షన్‌ కు గురికావడంతో కాంగ్రెస్‌లో చేరారు. కాలం కలిసి రావడంతో ఐదేళ్ల పాటు సీఎంగా కొనసాగారు.

2006 నవంబర్‌ లో చాముండేశ్వరి నియోజకవర్గానికి ఉప ఎన్నిక వచ్చింది. ఆ సమయంలో ఈ స్థానం నుంచి గెలుపొందడం సిద్ధరామయ్యకు జీవన్మరణ సమస్యగా మారింది. అదే సమయంలో బీజేపీ – జేడీఎస్‌ ప్రభుత్వం కూడా ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. జేడీఎస్‌ నుంచి బయటకొచ్చేశాక దేవెగౌడపై సిద్ధరామయ్య ఆగ్రహంతో ఊగిపోయేవారు. దేవెగౌడ కూడా ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. బీజేపీ–జేడీఎస్‌ లు తమ అభ్యర్థిగా శివబసవయ్యను సిద్ధరామయ్యపై పోటీకి దింపాయి. ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగి ఈ చాముండేశ్వరి ఉప ఎన్నికల్లో చివరికి సిద్ధరామయ్య 277 ఓట్ల తేడాతో గెలుపొంది దేవెగౌడపై తన ప్రతీకారాన్ని తీర్చుకున్నారు. జేడీఎస్‌ నుంచి దేవెగౌడ సస్పెండ్‌ చేశారనే కోపంతో సిద్ధరామయ్య ఎప్పటికప్పుడు అవకాశం ఉన్నప్పుడల్లా దేవెగౌడపై విమర్శలు చేస్తూనే ఉన్నారు.

చాముండేశ్వరి నియోజకవర్గం ఉప ఎన్నిక తర్వాత సిద్ధరామయ్య ప్రతిపక్ష నేతగా ఎదిగారు. అసెంబ్లీలో అక్రమ మైనింగ్‌ పై ప్రతిపక్ష నేత హోదాలో గట్టిగా నినదించారు. అంతేకాకుండా అక్రమ మైనింగ్‌ ను వ్యతిరేకిస్తూ అప్పట్లో బళ్లారికి పాదయాత్ర కూడా చేశారు. ఒక ప్రతిపక్ష నాయకుడిగా చేయాల్సిన పనులన్నింటిని ఎన్నికలకు ముందుగానే చేసుకుంటూ వచ్చారు. దీంతో 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌ ను అధికారంలోకి తెచ్చారనడంలో అతిశయోక్తి లేదు. ఫలితంగా పార్టీలోని సీనియర్‌ నేతలను వెనక్కి నెట్టి ముఖ్యమంత్రి పీఠం అధిరోహించారు. తర్వాత కావేరి నది నీటి వివాదం సంభవించినప్పుడు రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఇద్దరు నేతలు తమ భేదాభిప్రాయాలను పక్కనపెట్టి ఒక్కతాటిపైకి వచ్చారు. ఇద్దరి మధ్య వివాదం సమసిపోయిందని భావించారు. కానీ అలా జరగలేదని చెప్పవచ్చు.

2018 ఎన్నికల ప్రచారంలో కూడా దేవెగౌడ - సిద్ధరామయ్య ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. అంతేకాకుండా అప్పటి ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ చేత కూడా దేవెగౌడపై విమర్శలు గుప్పించడంలో సిద్ధరామయ్య సఫలీకృతుడయ్యారు. అయితే ఎన్నికల ఫలితాలు అందరినీ తారుమారు చేశాయి. మేజిక్‌ ఫిగర్‌ కు బీజేపీ దగ్గరికి వచ్చినా అందుకోలేకపోయింది. కింగ్‌ మేకర్‌ గా మారిన జేడీఎస్‌ తో అయిష్టంగానే మైత్రి ఏర్పాటు చేసుకుంది. అధిష్టానం సూచన మేరకు దేవెగౌడ కుమారుడు కుమారస్వామికి సీఎం పదవి అప్పగించి కాంగ్రెస్‌ నేతలు మౌనంగా ఉండిపోయారు. అయితే సార్వత్రిక ఎన్నికల్లో కలిసి పని చేసి సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయాక ఒకరిపై ఒకరు మాటల యుద్ధానికి దిగారు.