Begin typing your search above and press return to search.

ఆ ఎమ్మెల్యేపై సిద్ద ఒక‌లా.. అజాద్ మ‌రోలా?

By:  Tupaki Desk   |   19 May 2018 4:21 AM GMT
ఆ ఎమ్మెల్యేపై సిద్ద ఒక‌లా.. అజాద్ మ‌రోలా?
X
క‌ర్ణాట‌క రాజకీయం ఇప్పుడెంత ర‌స‌కందాయంలో ప‌డిందో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. సినిమాటిక్ మ‌లుపుల‌తో రియ‌ల్ రాజ‌కీయ సినిమా ప్ర‌జ‌ల్ని తీవ్ర ఉత్కంట‌కు గురి చేస్తోంది. క‌ర్ణాట‌క రాజ‌కీయాల‌తో సంబంధం లేని రెండు తెలుగు రాష్ట్రాల్లోనే క‌ర్ణాట‌క రాజ‌కీయం త‌దుప‌రి ఘ‌ట్టం ఏమిట‌న్న ఆస‌క్తి కోట్లాది మంది ప్ర‌జ‌ల్లో వ్య‌క్తం అవుతుంటే.. క‌న్న‌డ ప్ర‌జ‌ల్లో మ‌రెంత భావోద్వేగంతో ఉంటారో చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు.

బ‌ల‌ప‌రీక్ష‌కు పోటాపోటీగా బీజేపీ.. కాంగ్రెస్,జేడీఎస్ ప‌క్షాలు సిద్ధ‌మ‌వుతున్న వేళ‌.. ఒక ఎమ్మెల్యే తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్ద‌రు ఎమ్మెల్యేలు క‌నిపించ‌టం లేద‌న్న మాట బ‌లంగా వినిపిస్తుంటే.. వారిలో ఒక‌రిపేరును అదేప‌నిగా ప్ర‌స్తావిస్తున్నారు.

త‌మ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఆనంద్ సింగ్ ను బీజేపీ కిడ్నాప్ చేసింద‌ని.. ఈడీ.. ఆదాయ‌ప‌న్ను శాఖ‌ల ద్వారా ఆయ‌న్ను అదుపులోకి తీసుకున్న‌ట్లుగా కాంగ్రెస్ ఆరోపించింది. చిత్ర‌మైన విష‌యం ఏమిటంటే క‌నిపించ‌కుండా పోయిన ఆనంద్ సింగ్ వ్య‌వ‌హారంపై కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత‌లే డ‌బుల్ టోన్ వినిపించ‌టం.

వ‌రుస పెట్టి వివాదాస్ప‌ద నిర్ణ‌యాలు తీసుకుంటున్న క‌ర్ణాట‌క గ‌వ‌ర్న‌ర్ వ‌జుభాయ్ వాలాకు వ్య‌తిరేకంగా.. కాంగ్రెస్ పార్టీ నిర్వ‌హించిన నిర‌స‌న‌లో పాల్గొన్న మాజీ సీఎం సిద్ద‌రామ‌య్య మాట్లాడుతూ..త‌మ ఎమ్మెల్యే ఆనంద్ సింగ్‌ను బీజేపీ కిడ్నాప్ చేసిన‌ట్లుగా వెల్ల‌డించి సంచ‌ల‌నం సృష్టించారు. ఆనంద్ సింగ్ త‌ప్పించి మిగిలిన ఎమ్మెల్యేలంతా త‌మ‌తోనే ఉన్నార‌ని.. ఇద్ద‌రు స్వ‌తంత్ర ఎమ్మెల్యేలు (వారిలో ఒక‌రు బీఎస్పీకి చెందిన వారు) సైతం త‌మ‌తోనే ఉన్న‌ట్లు చెబుతున్నారు. ఆనంద్ సింగ్ మిన‌హా ప్ర‌తాప‌గౌడ పాటిల్ త‌మ‌తోనే ఉన్న‌ట్లు సిద్ద చెప్పారు.

దీనికి భిన్న‌మైన వ్యాఖ్య‌ల్ని చేశారు కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌.. మాజీ కేంద్ర‌మంత్రి గులాం న‌బి అజాద్‌. ట్ర‌బుల్ షూట‌ర్ గా పేరున్న ఆయ‌న క‌ర్ణాట‌క ఎన్నిక‌ల ఫ‌లితాలు వెల్ల‌డి కావ‌టానికి ఒక రోజు ముందే బెంగ‌ళూరు న‌గ‌రానికి వ‌చ్చి.. నేటి వ‌ర‌కూ కీల‌క‌భూమిక పోషిస్తున్న అజాద్‌.. క‌నిపించ‌కుండా పోయిన ఆనంద్ సింగ్‌పై ఆస‌క్తిక‌ర‌వ్యాఖ్య‌లు చేశారు.

ఆయ‌నేమీ అదృశ్యం కాలేద‌ని.. త‌మ‌తో ట‌చ్ లో ఉన్న‌ట్లు చెప్పారు. ఆనంద్ సింగ్ ప్ర‌స్తుతం ఢిల్లీలో ఉన్నార‌ని.. ఆయ‌న త‌న‌తో మాట్లాడుతూనే ఉన్న‌ట్లు వెల్ల‌డించారు. మ‌రి.. వీరిద్ద‌రిలో ఎవ‌రి మాట న‌మ్మాలి? ఎవరి వ్యాఖ్య‌ను విశ్వాసంలోకి తీసుకోవాల‌న్న‌ది ఇప్పుడో పెద్ద ప్ర‌శ్న‌గా మారింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.