Begin typing your search above and press return to search.

ప్ర‌త్యేక జెండాకు పొరుగు రాష్ట్రం క‌స‌ర‌త్తు

By:  Tupaki Desk   |   19 July 2017 4:21 AM GMT
ప్ర‌త్యేక జెండాకు పొరుగు రాష్ట్రం క‌స‌ర‌త్తు
X
పొరుగున్న ఉన్న కర్ణాటక రాష్ట్రం సంచ‌లన నిర్ణ‌యం తీసుకుంది. ఆ రాష్ట్రంలోని అధికార‌ కాంగ్రెస్ ప్రభుత్వం తమ రాష్ర్టానికి ఒక ప్రత్యేక జెండా రూపొందించే దిశగా అడుగులు వేస్తోంది. రాష్ర్టానికి ప్రత్యేక జెండాను రూపొందించేందుకు సిద్ధరామయ్య ప్రభుత్వం గత నెలలోనే తొమ్మిది మందితో ఒక కమిటీని వేసింది. కన్నడ రచయిత - పాత్రికేయుడు పాటిల్ పుత్తప్ప - సామాజిక కార్యకర్త భీమప్ప గుండప్పల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం కన్నడ - సాంస్కృతిక విభాగం ప్రిన్సిపల్ కార్యదర్శి నేతృత్వంలో ఆ కమిటీని వేసింది. ఈ కమిటీలో పలు ప్రభుత్వ శాఖలకు చెందిన కార్యదర్శులు - కన్నడ సాహిత్య పరిషత్ అధ్యక్షుడు - కన్నడ అభివృద్ధి సంస్థ చైర్మన్ - కన్నడ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ సభ్యులుగా ఉన్నారు. చట్టపరమైన అంశాలను పరిశీలించడంతోపాటు జెండాలో ఏయే రంగులు ఉండాలో నిర్ణయించే పనిని ఈ కమిటీకి అప్పగించింది.

మ‌న‌దేశంలో ఇప్పటివరకు దేశంలో జ‌మ్ముకశ్మీర్‌ కు తప్ప మరే ఇతర రాష్ర్టానికి ప్రత్యేక జెండా లేదు. అదే కోణం లో క‌ర్ణాట‌క స‌ర్కారు తీసుకున్న ఈ నిర్ణయం పెద్ద దుమారాన్ని రేపుతోంది. కాంగ్రెస్ సర్కార్ నిర్ణయం జాతి వ్యతిరేకమని బీజేపీ - శివసేన విమర్శించాయి. అయితే రాష్ర్టాలకు ప్రత్యేక జెండాలు ఉండకూడదని రాజ్యాంగంలో లేదని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. రాష్ర్టాలకు ప్రత్యేక జెండా ఉండరాదని రాజ్యాంగంలో ఉంటే ఎవరైనా చదివితే చెప్పాలని సీఎం సిద్ధరామయ్య బీజేపీ నేతలను ఉద్దేశించి అన్నారు. ఏ రాష్ట్రానికా రాష్ట్రం ప్రత్యేక జెండాను రూపొందించుకునే అవకాశం భారత రాజ్యాంగంలో లేదని, త్రివర్ణ పతాకమొక్కటే అందరి జెండా అని కేంద్రం స్పష్టం చేసింది. ‘మనది ఒకే దేశం.. ఒకే జెండా. అయితే ఏ రాష్టమ్రైనా సొంత జెండా కలిగి ఉండడాన్ని లేదా అలాంటి ప్రయత్నాన్ని నిషేధించే న్యాయపరమైన నిబంధన ఏమీ లేదు’ అని హోం శాఖ ప్రతినిధి వివరించారు.

కాగా, క‌ర్ణాట‌క‌లో ఇప్పటికే ఎరుపు, నలుపు రంగులతో ఉన్న జెండాను రాష్ట్ర అవతరణ దినోత్సవమైన నవంబర్ ఒకటిన అనధికారికంగా ఆవిష్కరిస్తున్నారు. ఈ జెండాను కన్నడ హక్కుల కార్యకర్త వీర సేనాని మా రామమూర్తి 1960లో డిజైన్ చేశారు. ఇంతకుముందు డీవీ సదానంద గౌడ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం 2012లో, రెండు రంగుల కన్నడ జెండాను అధికార పతాకంగా ఆమోదించేందుకు నిరాకరిస్తున్నామని రాష్ట్ర హైకోర్టుకు తెలిపింది. రాష్ర్టానికి ప్రత్యేక జెండా ఉండటం దేశ సమైక్యతకు, సమగ్రతకు వ్యతిరేకమని తెలిపింది.