Begin typing your search above and press return to search.

కాకి వాలితే కొత్త కారు కొనేయటం ఏంటి సీఎం సారూ?

By:  Tupaki Desk   |   11 Jun 2016 4:31 PM GMT
కాకి వాలితే కొత్త కారు కొనేయటం ఏంటి సీఎం సారూ?
X
కీలక స్థానాల్లో ఉన్న వారికి ఉండే నమ్మకాలు అన్నిఇన్ని కావు. వారి నమ్మకాల కోసం వందల కోట్ల రూపాయిల్ని సైతం ఖర్చు చేసేయటం ఈ మధ్యన ఒక అలవాటుగా మారింది. ఇదే కోవలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వ్యవహారం ఇప్పుడు రాష్ట్రమే కాదు.. దేశ వ్యాప్తంగా అందరిని దృష్టిని ఆకర్షిస్తోంది. ఎందుకంటే.. ఆకాశంలో ఎగిరే కాకి వచ్చి కారు మీద ఓ పదినిమిషాలు కూర్చుండిపోయిందని.. బంగారం లాంటి కారును వదిలేసి కొత్త కారును కొనేందుకు సిద్ధం కావటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఓ వారం కిందట.. అంటే జూన్ 2న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కారుపైన ఒక కాకి వాలింది. మరి.. సీఎం కారు అని తెలిసిందేమో కానీ.. దొరక్క దొరక్క దొరికిన అవకాశాన్ని వదులుకోకూడదని భావించిందేమో కానీ.. దాన్ని ఎంత తోలినా అది మాత్రం కారు మీద నుంచి వెళ్లిపోవటానికి ఏ మాత్రం ఇష్టపడలేదట. కాకిని అపశకునంగా భావించే సిద్ధరామయ్య.. వెంటనే కారును వదిలేసి.. కొత్త కారు కొనేందుకు రెఢీ అయిపోయారు.

ముఖ్యమంత్రుల వారు అనుకోవాలే కానీ కార్లకు కొదవ ఉండదు కదా. అందుకే.. శనివారం ఆయన రూ.35 లక్షలు పోసి టొయోటా ఫార్చ్యూనర్ కారును కొనుగోలు చేశారు. దీంతో.. కాకి వాలటం వల్లనే ఆయన పాత కారును వదిలేసి.. కొత్త కారు కొన్నారన్న వార్తలు కర్ణాటక వ్యాప్తంగా ఛానళ్లు హోరెత్తించటం.. అది కాస్త ఇప్పుడు జాతీయ స్థాయిలో ఇప్పుడో హాట్ వార్తగా మారింది. ఆ మధ్యన ఖరీదైన వాచీని ధరించిన అందరి దృష్టిలో పడ్డ సిద్ధరామయ్యకు.. ఈ కాకి – కారు వ్యవహారం ఆయన ఇమేజ్ ను భారీగా డ్యామేజ్ చేసిందన్న మాట వినిపిస్తోంది.