Begin typing your search above and press return to search.

రసకందాయంలో కర్నాటకం

By:  Tupaki Desk   |   27 Aug 2018 3:57 PM GMT
రసకందాయంలో కర్నాటకం
X
అనుకున్నదే జరుగుతోంది. ఊహించినదే నిజమవుతోంది. కాంగ్రెస్ - జనతాదళ్ (ఎస్) కాపురం మూడు నాళ్ల ముచ్చటగా మారుతోంది. కర్నాటకలో ముఖ్యమంత్రి మారుతారని - రెండు పార్టీల సమన్వయ కమిటీ సభ్యులు అంగీకరిస్తే ముఖ్యమంత్రి కుమారస్వామి స్ధానంలో మరొకరు వస్తారని కర్నాటక మంత్రి శివశంకర్ రెడ్డి బాంబు పేల్చారు. దీంతో కర్నాటక రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. నిజానికి కుమారస్వామి ముఖ్యమంత్రి కావడంలోనూ - రెండు పార్టీల కలయికలోనూ కూడా మంత్రి శివశంకర రెడ్డి దే కీలక భూమిక. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి మారతారంటూ ఆయన చెప్పడంతో కర్నాటక రాజకీయాలు కొత్త రూపు సంతరించుకోనున్నాయి అని అంటున్నారు. మరోవైపు సెప్టెంబర్ నెలలో తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానని మాజీ ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య ప్రకటించడం హాట్ టాపిక్ గా మారింది. హసన్ జిల్లాలో పర్యటించిన సిద్ధ రామయ్య సెప్టెంబర్ నెలలో తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానని ప్రకటించడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది. ఏకంగా ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణం చేసేందుకు సిద్ధ రామయ్య ముహూర్తం కూడా నిర్ణయించుకోవడంతో కర్నాటక రాజకీయాలు ఆసక్తిగా మారాయి.

చామరాజనగర్‌ లో మీడియాతో మాట్లాడిన కర్నాటక వ్యవసాయ శాఖ మంత్రి రెండు పార్టీలకు చెందిన సమన్వయ కమిటీ సభ్యులు సమావేశమై సిద్ధరామయ్యను ముఖ్మమంత్రిని చేసే అంశంపై చర్చించాలని సూచించారు. అంతే కాదు... కుమారస్వామిని ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించాలని ఎమ్మెల్యేలు భావిస్తే వారికి మద్దతు ఇచ్చేందుకు కూడా తాము సిద్ధంగా ఉన్నామని చెప్పడం కర్నాటక రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. ఓ పక్క ముఖ్యమంత్రి మారుతారంటూ కాంగ్రెస్ నాయకులు ప్రకటనలో చేస్తూంటే భారతీయ జనతా పార్టీ కూడా తన వంతు ప్రయత్నాలు ప్రారంభించింది. కాంగ్రెస్ పార్టీలో అసంతుష్ట ఎమ్మెల్యే బిజెపి నాయకుడు యడ్యూరప్పతో టచ్‌లో ఉండడం మరో రాజకీయ పరిణామం. మొత్తానికి కర్నాటకలో రాజకీయం రసకందాయంలో పడింది. కుమారస్వామి ఎన్నాళ్లుంటారో... ఆయన స్ధానంలో సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఎప్పుడు వస్తారో... సందట్లో సడేమియా అన్నట్లు మధ్యలో భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి కుర్చీని ఎగరేసుకుపోతుందో... అంతా అయోమయం... గందరగోళంగా మారిందని కర్నాటక ప్రజలు అనుకుంటున్నారు.