Begin typing your search above and press return to search.

క‌ర్ణాట‌క‌కు స్పెష‌ల్ జెండా!... ర‌చ్చేనా?

By:  Tupaki Desk   |   31 Jan 2018 11:06 AM GMT
క‌ర్ణాట‌క‌కు స్పెష‌ల్ జెండా!... ర‌చ్చేనా?
X
దేశంలోని ద‌క్షిణాది రాష్ట్రంగా ఉన్న‌ క‌ర్ణాట‌క‌... త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక జెండా, అజెండా ఉండాల‌ని కోరుకుంటున్న విష‌యం తెలిసిందే. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక అజెండా ఉండాల‌ని కోరుకోవ‌డంలో త‌ప్పు లేదు గానీ... ఇప్ప‌టికే భార‌తదేశం మొత్తానికి మువ్వ‌న్నెల ప‌తాకం జెండా ఉండ‌గా, ఇప్పుడు ఆయా రాష్ట్రాల‌కు కూడా ప్ర‌త్యేక జెండా అవ‌స‌ర‌మా? అన్న చ‌ర్చ‌కు తెర లేసింద‌నే చెప్పాలి. క‌ర్ణాట‌క సీఎంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత త‌మ రాష్ట్రానికి ఓ ప్ర‌త్యేక జెండా ఉండాల్సిందేన‌ని, దానిని రూపొందించ‌డంతో పాటుగా రాజ్యాంగ‌బ‌ద్ధంగానే ఎగుర‌వేసి తీర‌తామ‌ని గ‌తేడాది సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ దిశ‌గా యోచించిన రాజ్యాంగ నిపుణులు దేశానికి ఓ జెండా ఉండ‌గా, రాష్ట్రాల‌కు కూడా ప్ర‌త్యేక జెండా ఉండాల‌న్న విష‌యం కాస్తంత ఆలోచింప‌జేసేదేన‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. అయితే ప్ర‌స్తుత‌మున్న రాజ్యాంగ నిబంధ‌న‌ల మేర‌కు రాష్ట్రాల‌కు ప్ర‌త్యేక జెండా రూపొందించుకునే అవ‌కాశాలు మాత్రం లేవ‌ని తేల్చేశారు.

రాజ్యాంగ నిపుణుల మాట‌ను ఎప్పుడో ప‌క్క‌న పెట్టేసిన సిద్ద‌రామ‌య్య‌... తాను అనుకున్న‌ట్లుగానే త‌మ రాష్ట్రానికి ప్ర‌త్యేక జెండాను రూపొందించేందుకు కార్యార‌చ‌ణ కూడా నాడే ప్ర‌క‌టించారు. ఆ ప్ర‌క‌ట‌న‌కు అనుగుణంగా తొమ్మిది మంది స‌భ్యుల క‌మిటీని ఏర్పాటు చేసి ఆ క‌మిటీ బాధ్య‌త‌ల‌ను కన్నడ - సంసృతిక శాఖ ప్రధాన కార్యదర్శికి అప్ప‌గించింది. ప్ర‌భుత్వ ఆదేశాల‌తో రంగంలోకి దిగిన స‌ద‌రు క‌మిటీ ఇప్ప‌టికే క‌ర్ణాట‌క జెండాగా వాడుక‌లో ఉన్న పసుపు, ఎరుపు రంగుల జెండాకు ప‌లు మార్పులు చేసి తుది రూపును ఇచ్చేసింది. ఈ జెండాకు సంబంధించిన మొత్తం నివేదిక‌ను స‌ద‌రు క‌మిటీ ప్ర‌భుత్వానికి అంద‌జేసింది. ఇక ఆ జెండా ఆవిష్క‌ర‌ణ‌కు ప్ర‌భుత్వ అనుమ‌తే త‌రువాయిగా మారింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఇదిలా ఉంటే... ద‌క్షిణాది రాష్ట్రాల్లో బీజేపీకి ప‌ట్టున్న రాష్ట్రం క‌ర్ణాట‌క ఒక్క‌టే. గ‌తంలో ఆ రాష్ట్రంలో అధికార ప‌గ్గాల‌ను చేజిక్కించుకున్న బీజేపీ... మ‌రో రెండు నెల‌ల్లో జ‌ర‌గ‌నున్న అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు దాదాపుగా ప‌క్కాగానే వ్యూహం అమ‌లు చేసుకుని రంగంలోకి దిగిపోయింది కూడా.

ఈ సారి ఎలాగైనా సిద్దూ స‌ర్కారును గ‌ద్దె దించ‌డంతో పాటుగా వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు రెట్టింపు ఉత్సాహంతో వెళ్లాల‌ని ప‌థ‌కం ర‌చిస్తోంది. ఈ నేప‌థ్యంలో సిద్దూ స‌ర్కారు తెర మీద‌కు తెచ్చిన ఈ కొత్త జెండా అంశం కాంగ్రెస్‌ - బీజేపీల మ‌ధ్య పెద్ద వివాదాన్నే రేపే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. క‌న్న‌డ ప్ర‌జ‌ల మ‌నోభావాల‌కు అనుగుణంగానే తాము జెండా రూపొందించామ‌ని సిద్దూ స‌ర్కారు చెబుతుండ‌గా, ఎన్నిక‌ల వేళ స‌ద‌రు జెండాను తిర‌స్క‌రించి క‌న్న‌డ నాట ఓటర్ల మ‌దిలో వ్య‌తిరేక ముద్ర వేయించుకునేందుకు బీజేపీ సాహ‌సిస్తుందా? అన్న విష‌యం కూడా ఆస‌క్తిక‌రంగా మారింది. మొత్తానికి ఎన్నిక‌ల వేళ సిద్దూ సంధించిన ఈ జెండా అస్త్రాన్ని బీజేపీ ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.