Begin typing your search above and press return to search.

మోడీకి షాకిచ్చేలా సిద్ధూ నోట సౌత్ రాగం

By:  Tupaki Desk   |   17 March 2018 4:03 AM GMT
మోడీకి షాకిచ్చేలా సిద్ధూ నోట సౌత్ రాగం
X
కొన్ని భావోద్వేగాలు అస్స‌లు స్టార్ట్ కాకూడ‌దు. ఒక‌సారి అయితే వాటిని స‌ర్దిచెప్ప‌టం క‌ష్టం. కేంద్ర.. రాష్ట్రాల మ‌ధ్య సంబంధాలు ఇచ్చిపుచ్చుకున్న‌ట్లుగా ఉండాలే కానీ.. బాస్‌.. సేవ‌కుడి మాదిరి అస్స‌లు ఉండ‌కూడ‌దు. ఆ మాట‌కు వ‌స్తే.. కేంద్రానికి వ‌చ్చే నిధుల‌న్నీ రాష్ట్రాల నుంచే అన్న‌ది అస్స‌లు మ‌ర్చిపోకూడ‌దు. కేంద్రం పెద్ద‌న్న‌లా వ్య‌వ‌హ‌రించినా.. అదెప్పుడూ మ‌న‌సు నొచ్చుకునేలా.. భావోద్వేగాలు బ‌య‌ట‌కు వ‌చ్చేలా మార‌కూడ‌దు.

మోడీ మొండితీరు.. తాను అనుకున్న‌దే జ‌ర‌గాల‌న్న త‌త్త్వంతో పాటు.. మితిమీరిన అహంభావం.. ఏం చేసినా న‌డిచిపోతుంద‌న్న ధీమా ప‌లు రాష్ట్రాధినేత‌ల‌కు మంట పుట్టేలా చేస్తోంది.

తెలుగు రాష్ట్రాల్లో మొద‌లైన సౌత్ రాగం.. అంత‌కంత‌కూ విస్త‌రిస్తోంది. త‌మిళ నేత‌ల నోట త‌ర‌చూ వినిపిస్తున్న ఈ ప‌దం తాజాగా క‌ర్ణాట‌క రాష్ట్ర ముఖ్య‌మంత్రి నోటా వ‌చ్చేసింది. త్వ‌ర‌లో క‌ర్ణాట‌క అసెంబ్లీకి ఎన్నిక‌లు నిర్వ‌హిస్తున్న‌నేప‌థ్యంలో ఆ రాష్ట్ర సీఎం.. కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత సిద్ధ‌రామ‌య్య కేంద్రంపై విరుచుకుప‌డ్డారు. పాల‌న‌లో రాష్ట్రాల‌కు స్వ‌యం ప్ర‌తిప‌త్తి క‌ల్పించాల్సిన టైం వ‌చ్చేసింద‌ని పేర్కొన్నారు.

కేంద్ర‌.. రాష్ట్ర ఆర్థిక సంబంధాలు.. విదేశాల‌తో కేంద్రం ఏక‌ప‌క్షంగా చేసుకున్న ఒప్పందాల‌తో జ‌రుగుతున్న న‌ష్టాల్ని ఫేస్ బుక్ లో వివ‌రించారు. స‌మాఖ్య వ్య‌వ‌స్థ‌ను కేంద్రం మ‌ర్చిపోతుంద‌ని.. పాల‌న‌లో రాష్ట్రాల‌కు మ‌రింత స్వ‌యం ప్ర‌తిప‌త్తిని క‌ల్పించాల‌న్నారు.

ఉత్త‌రాదిని ద‌క్షిణాది ఆదుకుంటున్నా.. కేంద్రం ద‌క్షినాది రాష్ట్రాల్ని ఏ విధంగానూ ప్రోత్స‌హించ‌టం లేద‌న్నారు. క‌ర్ణాట‌క‌.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌.. తెలంగాణ‌.. మ‌హారాష్ట్ర.. కేర‌ళ రాష్ట్రాల‌కు కేంద్రం నుంచి వ‌స్తున్న ఆర్థిక సాయం కంటే.. చాలా ఎక్కువ మొత్తాన్ని ప‌న్నురూపంలో చెల్లించాల్సి వ‌స్తోంద‌న్నారు.

క‌ర్ణాట‌క నుంచి జ‌మ‌య్యే ప‌న్ను మొత్తంలో 47 పైస‌లు మాత్ర‌మే రాష్ట్రానికి కేంద్రం నుంచి అందుతోంద‌ని.. అదే స‌మ‌యంలో ఉత్త‌ర‌ప్ర‌దేశ్ కు మాత్రం రూ.1.79 ద‌క్కుతోంద‌న్నారు. జ‌నాభా ప్రాతిప‌దిక‌న నిధుల్ని కేంద్రం ఎంత‌కాలం కేటాయిస్తూ పోతుంద‌ని ప్ర‌శ్నించిన సిద్ధ‌.. కేంద్ర ఆర్థిక విధానాల రూప‌క‌ల్ప‌న‌లో రాష్ట్రాల‌కు భాగ‌స్వామ్యం లేక‌పోవ‌టం స‌రికాద‌న్నారు.

కేంద్రం కుదుర్చుకుంటున్న విదేశీ ఒప్పందాల కార‌ణంగా ప‌లు రాష్ట్రాలు తీవ్రంగా ప్ర‌భావితం అవుతున్నాయ‌న్న సిద్ద‌.. అందుకు ఉదాహ‌ర‌ణ‌గా ఇటీవ‌ల వియ‌త్నాంతో కేంద్రం చేసుకున్న ఒప్పందాన్ని ప్ర‌స్తావించారు. వియ‌త్నాం మిరియాల్నిశ్రీ‌లంక ద్వారా దిగుమ‌తి చేసుకోవ‌టం కార‌ణంగా క‌ర్ణాట‌క‌.. కేర‌ళ మిరియాల రైతుల బ‌తుకులు బ‌జారున ప‌డ్డాయ‌న్నారు. ఇప్ప‌టివ‌ర‌కూ ద‌క్షిణాది ముఖ్య‌మంత్రులు ప్ర‌స్తావించ‌ని కొత్త కోణాన్ని బ‌య‌ట‌కు తీసిన క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి మాట‌లు.. మిగిలిన ద‌క్షిణాది రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌కు పాఠాలుగా మారితే మాత్రం మోడీకి ముప్ప‌తిప్ప‌లు త‌ప్ప‌న‌ట్లే.