Begin typing your search above and press return to search.

ముంద‌స్తు మాట‌!.. క‌ర్ణాట‌క పోల్సే బేస్‌!

By:  Tupaki Desk   |   26 Jan 2018 4:41 PM GMT
ముంద‌స్తు మాట‌!.. క‌ర్ణాట‌క పోల్సే బేస్‌!
X
మ‌రో ఏడాదిలో సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. అంటే ఇంకో ఆరు నెల‌ల త‌ర్వాత ఎన్నిక‌ల వేడి రాజుకుంటుంది. లోక్ స‌భ ఎన్నిక‌ల‌తో పాటుగా దేశంలోని రెండు తెలుగు రాష్ట్రాలు స‌హా 8 రాష్ట్రాల అసెంబ్లీల‌కు కూడా ఒకేసారి ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఇందులో పెద్ద‌గా చ‌ర్చించుకోవ‌డానికి ఏమీ లేదు గానీ... మొన్న ఓ జాతీయ ప‌త్రిక‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా ప్ర‌స్తావించిన ఓ అంశాన్ని తీసుకుంటే... నిర్దేశిత స‌మ‌యాని కంటే ముందుగానే దేశంలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌తో పాటుగా 8 రాష్ట్రాల అసెంబ్లీల‌కు ఎన్నిక‌లు జ‌రుగుతాయా? అన్న దిశ‌గా చ‌ర్చ సాగుతోంది. ఇదే జ‌రిగితే... పూర్తిగా ఐదేళ్లు ప‌దవిలో ఉండ‌కుండానే ముంద‌స్తు ప్ర‌జ‌ల తీర్పున‌కే మోదీ మొగ్గు చూపుతున్న‌ట్లుగా భావించక త‌ప్ప‌దు. అదే స‌మ‌యంలో ఇష్టం ఉన్నా - లేకున్నా... రెండు తెలుగు రాష్ట్రాల అసెంబ్లీల‌కు కూడా నిర్దేశిత గ‌డువు తీర‌క‌ముందే ఎన్నిక‌లు జ‌రిగి తీర‌తాయ‌న్న మాట‌. గ‌డువు ముగియ‌క‌ముందే ప్ర‌స్తుత శాస‌న‌స‌భ‌ల‌ను ర‌ద్దు చేసేందుకు తెలుగు రాష్ట్రాల సీఎంల‌కు ఇష్టం లేక‌పోయినా... కొన్ని అనివార్య కార‌ణాలతో సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌తో పాటుగా రెండు రాష్ట్రాలు కూడా ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్ల‌క త‌ప్ప‌ద‌న్న వాద‌న ఇప్పుడు బ‌లంగానే వినిపిస్తోంది. రెండు రోజుల క్రితం హిందూస్థాన్ టైమ్స్ ప‌త్రిక‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో అమిత్ షా ముంద‌స్తు ఎన్నిక‌ల మాట‌ను వినిపించారు. సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌తో పాటుగా దేశంలోని 8 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిల‌ను కూడా ముంద‌స్తు ప‌ద్ద‌తిలోనే నిర్వ‌హించ‌నున్న‌ట్లు కూడా ఆయ‌న సోదాహ‌ర‌ణంగా చెప్పుకొచ్చారు.

అయినా ముంద‌స్తు ఎన్నికల‌కు వెళ్లాల్సిన అగ‌త్యం గానీ - అవ‌స‌రం గానీ బీజేపీకి పెద్ద‌గా ఏమీ లేద‌నే చెప్పాలి. ఎందుకంటే... గ‌డ‌చిన మూడు రోజుల్లో విడుద‌లైన దాదాపుగా అన్ని స‌ర్వేల్లో వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ ఎన్డీఏదే అధికార‌మ‌ని తేలిపోయింది. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగినా - నిర్దేశిత గ‌డువుకు కాస్త ముందుగా జ‌రిగినా... షెడ్యూల్ ప్ర‌కారం వ‌చ్చే ఏడాది జ‌రిగినా బీజేపీకి పెద్ద‌గా పోయేదేమీ లేదు. అలాగ‌ని లాభించేదేమీ లేద‌ని కూడా చెప్ప‌క త‌ప్ప‌దు. సీట్ల సంఖ్య‌లో కాస్త హెచ్చుత‌గ్గులు క‌నిపించినా... మోదీనే మ‌రోమారు ప్ర‌ధాని పీఠం చేప‌డ‌తార‌ని స‌ర్వేల‌న్నీ తేల్చి చెప్పిన నేప‌థ్యంలో అమిత్ షా నోట ముంద‌స్తు మాట ఎందుకు వినిపించింది? అన్న‌దే ఇప్పుడు మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌గా మారింది. ఆ క‌థాక‌మామీషు లోకి వెళితే... ఈ ఏప్రిల్‌ లో క‌ర్ణాట‌క అసెంబ్లీకి ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ద‌క్షిణాది రాష్ట్రాల్లో బీజేపీకి బేస్ దొరికింది ఒక్క క‌ర్ణాట‌క‌లోనేన‌న్న విష‌యం తెలిసిందే క‌దా. క‌ర్ణాట‌క మిన‌హా ఏ ఒక్క ద‌క్షిణాది రాష్ట్రంలోనూ బీజేపీకి కాలు కాదు క‌దా... వేలు పెట్టేందుకు కూడా అవ‌కాశం చిక్క‌లేద‌నే చెప్పాలి. ఈ నేప‌థ్యంలో త్వ‌ర‌లోనే క‌ర్ణాట‌క అసెంబ్లీకి జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌లు - వాటి ఫ‌లితాలు మొత్తంగా బీజేపీ ప్లాన్‌ ను నిర్దేశించ‌నున్నాయ‌న్న వాద‌న వినిపిస్తోంది. క‌ర్ణాట‌క‌లో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్ర‌భుత్వం ఉన్నా... గ‌తంలో బీజేపీ కూడా అక్క‌డ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగ‌తి తెలిసిందే.

ఈ క్ర‌మంలో క‌ర్ణాట‌క‌లో అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ స‌ర్కారును గ‌ద్దె దించేసి... త‌మ ప్ర‌భుత్వాన్ని కొలువుదీర్చాల‌ని అమిత్ షాతో పాటు ప్రధాని న‌రేంద్ర మోదీ కూడా ఉవ్విళ్లూరుతున్నారు. అయితే ఇప్పుడు క‌ర్ణాట‌క‌లో ఉన్న ప‌రిస్థితి చూస్తుంటే... మోదీ షాల ప్లాన్ వ‌ర్క‌వుట్ అయ్యేలా క‌నిపించ‌డం లేదు. ఎందుకంటే క‌ర్ణాట‌క ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త ఉన్నా... ప‌ల్లె సీమ‌ల్లో మాత్రం సిద్ద‌రామ‌య్య స‌ర్కారుపై పూర్తి స్థాయిలో సంతృప్తి వ్య‌క్త‌మ‌వుతోంది. ఈ నేప‌థ్యంలో అక్క‌డ జ‌రిగే ఎన్నిక‌ల్లో మ‌రోమారు కాంగ్రెస్ పార్టీనే విజ‌యం సాధించే అవ‌కాశాలే ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయి. మ‌రి మోదీ షాల ప్లాన్ వ‌ర్క‌వుట్ అయ్యి బీజేపీ స‌ర్కారు క‌ర్ణాట‌కలో అదికారంలోకి రావ‌డ‌మంటే అద్భుతం జ‌ర‌గాల్సిందేన‌ని స‌ర్వేలు చెబుతున్నాయి. మొత్తంగా క‌ర్ణాట‌క ఫ‌లితాల ఆధారంగానే ముందస్తు ఎన్నిక‌ల‌కు పోవాలా? వ‌ద్దా? అని బీజేపీ నిర్ణ‌యించుకునే అవ‌కాశం ఉంద‌న్న వాద‌న వినిపిస్తోంది. మ‌రోవైపున ముంద‌స్తు మాట‌కు ప్ర‌ధాని మోదీ ఇప్ప‌టికే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశార‌ని... క‌ర్ణాట‌క ఫ‌లితాలు ఆ ముంద‌స్తు మాట 6 నెల‌లు ముందుగానా? 8 నెల‌లు ముందుగానా? అన్న విష‌యాన్ని మాత్ర‌మే నిర్దేశిస్తాయ‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది. ఏది ఏమైనా.. ప‌టిష్ట స్థితిలోనే ఉన్న బీజేపీ స‌ర్కారు ముంద‌స్తు మాట ఎందుకు అందుకుందో ఏ ఒక్క‌రికి కూడా అర్థం కావ‌డం లేద‌న్న వాద‌న వినిపిస్తోంది.