Begin typing your search above and press return to search.

ఆ పార్టీతో కాంగ్రెస్ దోస్తీ ముగిసిందా?

By:  Tupaki Desk   |   25 Aug 2019 7:56 AM GMT
ఆ పార్టీతో కాంగ్రెస్ దోస్తీ ముగిసిందా?
X
కలిసి ఉండే కలదు సుఖం అన్నారు. అయితే కలిసి ఉంటే తాము ఓడిపోతామనే భయం అటు కాంగ్రెస్ నేతల్లోనూ - ఇటు జేడీఎస్ నేతల్లోనూ గట్టిగా ఉంది. అందుకు ఇటీవలి లోక్ సభ ఎన్నికల ఫలితాలే కారణం. లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో కర్ణాటకలో జేడీఎస్ - కాంగ్రెస్ కలిసి పోటీ చేశాయి. అంతకు ముందు అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలప్పుడు ఆ పార్టీలు సాధించుకున్న ఓట్ల శాతాన్ని బట్టి చూస్తే మెజారిటీ ఎంపీ సీట్లను అవే గెలవాలి. అయితే ఆ రెండూ కలిసిపోటీ చేయడం బీజేపీకి ప్లస్ పాయింట్ గా మారింది. కర్ణాటకలో కమలం పార్టీ స్వీప్ చేసింది!

తమ సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కనీస స్థాయిలో కూడా ఆ పార్టీలు సీట్లను నెగ్గలేకపోయాయి. ఇలాంటి నేపథ్యంలో ఇక తమ దోస్తీని కొనసాగించకూడదని ఫిక్సయినట్టుగా ఉన్నాయి కాంగ్రెస్ - జేడీఎస్ లు. అందుకే ఇప్పుడు ఇరు పక్షాల నేతలూ మాటలు రువ్వుకుంటున్నారు. ప్రభుత్వం పడిపోవడానికి ఒకరు కారణం అంటే, కాదరు మరొకరని విమర్శలు చేసుకొంటూ ఉన్నారు.

భవిష్యత్తులో కలిసి పోటీ చేయడం గురించి సానుకూలంగా స్పందించడం లేదు. ఆ విషయాన్ని ముందు ముందు చెప్పడం జరుగుతుందన్నట్టుగా వారు మాట్లాడుతూ ఉన్నారు. త్వరలోనే కర్ణాటకలో కొన్ని సీట్లకు ఉప ఎన్నికలు జరగాల్సి ఉంది. అనర్హత వేటు పడ్డ ఎమ్మెల్యేల స్థానంలో కొత్త వారి ఎన్నిక జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ - జేడీఎస్ లు విమర్శలు సంధించుకుంటున్నాయి.

పొత్తు లేకుండా పోటీ చేసే ఉద్దేశంతోనే ఆ పార్టీల నేతలు అలా మాట్లాడుతున్నారనే అభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి. అయితే సోనియాగాంధీ అడిగితే పొత్తుకు సిద్ధమని దేవేగౌడ ప్రకటించారు. కానీ రాష్ట్ర కాంగ్రెస్ నేతలను ఆయన తిడుతున్నారు. సంకీర్ణ ప్రభుత్వం పడిపోవడానికి కారణం సిద్దరామయ్యే అని దేవేగౌడ తేల్చారు.