Begin typing your search above and press return to search.

సీఎంకు వచ్చిన ఆ బహుమతి స్మగుల్డా?

By:  Tupaki Desk   |   6 March 2016 4:50 AM GMT
సీఎంకు వచ్చిన ఆ బహుమతి స్మగుల్డా?
X
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మెడకు చుట్టుకున్న వాచ్ వివాదం ఒక పట్టాన తేలేటట్లు లేదు. బడాయి కోసం పెట్టుకున్న వాచ్ మరీ ఇంత పెద్ద వివాదం అవుతుందని సిద్ధరామయ్య ఊహించి ఉండరు. స్నేహితుడు ఇచ్చిన విలువైన వాచ్ ను.. ఏ పావలానో.. అర్థరూపాయి అనుకున్నారో? లేక.. తనలాంటోడికి తప్పించి వాచీ విలువ ఎవరికి తెలుస్తుందని అనుకున్నారో ఏమో కానీ.. ఫ్రెండ్ ఇచ్చిన వాచీ పెట్టుకొని అడ్డంగా బుక్ అయిపోయిన సంగతి తెలిసిందే.

దుబాయ్ లో ఉన్న తన సన్నిహిత స్నేహితుడు ఒకరు వాచ్ ను బహుమతిగా ఇవ్వటం.. దాని విలువ రూ.70లక్షలుగా తేలటం.. ఒక ముఖ్యమంత్రికి బహుమతిగా ఇచ్చిన వాచీ రూ.70లక్షల విలువ చేయటం చర్చనీయాంశం కావటమే కాదు.. ఏం లబ్థి ఆశించి ఇంత ఖరీదైన బహుమతి సీఎంకు ఇచ్చారన్నది పెద్ద చర్చగా మారింది. ప్రత్యర్థిపై పైచేయి సాధించటమే కాదు.. కోలుకోకుండా దెబ్బ తీయటానికి సరైన సమయం కోసం ఎదురుచూస్తున్న వేళ.. ఒక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ఈ ఇష్యూను తెరపైకి తీసుకొస్తే.. మరో మాజీ సీఎం ఈ వ్యవహారాన్ని మరో లెవల్ కు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.

ఖరీదైన వాచీ వ్యవహారంపై కుమారస్వామి చేసిన విమర్శలు.. ఆరోపణలు రాజుకొన్న కారణంగానే సీఎం.. విలువైన బహుమతిని వదిలేయాల్సి వచ్చిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఈ వాచీ స్మగుల్డ్ పీస్ అంటూ మరో మాజీ ముఖ్యమంత్రి యాడ్యూరప్ప ఆరోపిస్తున్నారు. ఈ ఉదంతంపై సీబీఐ చేత విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. నిజానిజాలు బయటకు రావాలంటే సీబీఐ విచారణ అవసరమని యడ్యూరప్ప అభిప్రాపడుతున్నారు.

మరోవైపు.. ఈ వివాదం నుంచి బయటపడేందుకు సిద్ధరామయ్య తన ప్రయత్నాలు షురూ చేశారు. వాచీ వ్యవహారంపై విపక్షాలు విరుచుకుపడుతున్న వేళ.. తన క్యాబినెట్ సహచరులు.. సొంత పార్టీ ఎమ్మెల్యేలకు ఓ భారీ విందును సీఎం ఏర్పాటు చేశారు. ఆశ్చర్యకరంగా ఆ విందుకు సగానికి పైగా మంత్రులు.. ఎమ్మెల్యేలు అటెండ్ కాకపోవటం గమనార్హం. విపక్షాలే కాదు.. సొంత పార్టీ నేతలు సైతం సిద్ధరామయ్యకు షాక్ ఇవ్వటం విశేషం. మునిగిపోతున్న పడవలో ప్రయాణించేందుకు ఎవరు మాత్రం ఎందుకు ఇష్టపడతారు..?